సాహిత్యతత్వాన్ని ఆసాంతంగా ఆకళింపు చేసుకుని, శారదాదేవి కటాక్షానికి నోచుకున్న కాటూరి, దేవులపల్లి, విశ్వనాథ వంటి మహనీయకవులందరూ పధ్నాలుగు పదిహేను సంవత్సరాలకే సారస్వతాంశ పూర్ణంగా పెనవేసుకుని ఉన్న బాలకవిగా గుర్తుపట్టారు మల్లంపల్లి శరభయ్యగారిని. మల్లంపల్లి వారి వంశమంతా వీరశైవమత పరిమళాలు ఆంధ్రదేశమంతటా ప్రాకింపజేసి, జ్ఞానరోచిస్సులను నలుదిశలా చిందింపజేసిన ఉన్నతవ్యక్తిత్వాలకు ఆకరమైనటువంటిది. వీరశైవాంధ్రవాఙ్మయానికి వారు చేసిన సేవ అద్వితీయం. ఈ వంశంలోని పూర్వీకులు శివదీక్షాగురువులు.
Tuesday, 24 March 2026
Sunday, 6 July 2025
ఒక పిల్లఁగ్రోలువాఁడు
ప్రార్థన చేయగలగడం మానవజాతికి ఉన్న గొప్ప వరం. భగవంతుడి కోసం బుద్ధి తలుపులని తెరుచుకున్న మనిషి అహంకారాన్ని తగ్గించి, బాలుడిగా చేసి, ఆలోచనలనే ఎల్లలను తెంచి, ఆయుష్షుని పెంచే సంజీవని ప్రార్థన. ఈ వస్తువే కనుక ఉండి ఉండకపోతే, పెరిగే వయసుతో పెరిగే కుదింపుల స్వతంత్రత శిరసుమీద పెట్టే బరువుని మనిషి మోయడం అసాధ్యమయి ఉండేది.
Friday, 4 July 2025
అలమేలుమంగాస్తవము
మాత్రాఛందస్సులలో అత్యంత ప్రసిద్ధి పొందినవి చతుర్మాత్రల జాతి ఛందస్సులే అని చెప్పాలి. ఈ చతుర్మాత్ర గతి ఉన్న గీతాలు వినపడని రసపిపాసుల చెవులు ఎక్కడా ఉండవు. 'చందన చర్చిత నీలకళేబర పీత వసన వనమాలీ' అని గీతగోవిందకారుడు దివ్యలోకాలలో ఉన్న కవితాకన్యని క్రిందకి దింపి నాట్యం చేయిస్తున్నపుడూ, వల్లభాచార్యుడు 'అధరం మధురం నయనం మధురం' అంటూ తీపి తేనెకే కాదు, కృష్ణవర్ణన చేసే గీతికీ ఉంటుందని నిరూపణ చేసినప్పుడూ, శంకరులు 'భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే' అని భవ్యబోధ సలిపినపుడూ ఈ నాలుగు చిటికెలంత పొడుగైన మాటలే వారికి ఊతమయ్యాయి.
Saturday, 28 June 2025
జనార్దనాష్టకం
కందుకూరి రుద్రకవి పదహారవ శతాబ్దం నాటి వాడు. కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నాడని కొంతమంది అంటారు. సుగ్రీవవిజయమనే యక్షగానం, నిరంకుశోపాఖ్యానం అనే గ్రంథాలను రచించాడు. కానీ ఈయనలోని మహాకవి బయటకి వచ్చింది యెనిమిది పద్యాల నిడివి ఉన్న ఒక కవితలో.
Sunday, 11 May 2025
వేమన గురువు చెప్పిన విముక్తివిద్య
"తునాతున్క లగుచున్న 'కడిద'ము అను నల్లని రంగుపూత గల కాగితముపై పిండిబలపముతో వ్రాయబడియున్న యీ పద్యము లొక ప్రాచీన శతకములోనివి" అన్న గగుర్పాటు కలిగించే వాక్యంతో భారతి పత్రిక 1930 వ సంవత్సరం మార్చి సంచికలో "వటమూలమందిరా!" అన్న శీర్షికతో ఈ ఐదు పద్యాలు అచ్చయ్యాయి.
Tuesday, 6 May 2025
శైవశతకరత్నాలు
Saturday, 3 May 2025
Thursday, 27 March 2025
మణిపూసలు: 5 - రంగనాథుని శివకవిత
రగడ శివకవుల సొత్తు. ఈ ఛందోరూపం తెలుగునేలపై శివకవుల చేతులలో పడి యెన్ని వయ్యారాలు పోవాలో అన్నీ పోయింది. ఈ ఛందస్సు పద్యకవితలలోని ఆవృత్తి ధర్మాన్నీ, జానపదాలలోని సంగీత ధర్మాన్నీ తనలో కలుపుకున్న అతి తక్కువ ఛందస్సులలో ఒకటి. దేశీయ ఛందస్సులకున్న ఈ లక్షణమే శివకవులని ఆకర్షించిందనుకుంటాను. రగడ, ద్విపద వంటి దేశీయ ఛందస్సులు కాస్త పాటల రూపం వైపు ఒగ్గినా, వీటి నిర్మాణానికి అనన్యసామాన్యమైన ధార కావాలి.
Wednesday, 26 March 2025
మణిపూసలు: 4 - అపూర్వాంధ్రశివకవి చక్రపాణి రంగనాథుడు
తెలుగుదేశంలో శివకవియుగం భక్తితో ప్రజల జీవనాన్ని సుసంపన్నం చేయడంతో పాటుగా తెలుగుభాషకూ ఎనలేని సేవ చేసింది. ఆ యుగంలో కవిత్రయం పాలుకురికి సోమనాథుడు, పండితారాధ్యులు, నన్నెచోడుడు తెలుగు దేశీయతకి ఒక కొత్త వేదికని నిర్మాణం కావించారు. ఈ యుగంలోనే తెలుగునేలమీద ఉదయించిన ఒక విలక్షణ కవి రంగనాథుడు.
Saturday, 22 March 2025
గురుమూర్తిర్గుణనిధిః

2020 వ సంవత్సరంలో నేను మిడిమిడి జ్ఞానంతో సంస్కృతశ్లోకాలకు వ్యాఖ్య వ్రాస్తూ ఫేస్ బుక్ లో ప్రచురిస్తూ ఉండేవాడిని. ఆ సమయంలో ఒకరోజు అనుకోకుండా నాకు ఒక సందేశం వచ్చింది. ఆ సందేశం ఒక మందారపు మొక్క కుండీ ఛాయాచిత్రం. రెండు విచ్చిన పన్నీరుపూవు రంగు మందారపూవులు, పక్కనే జీవాన్ని నింపుకుని ఉబ్బి ఉన్న మందారమొగ్గఒకటి, భగవంతుని అరచేతులలాంటి పచ్చని ఆకులు. బ్రతుకుకాంతిని ఒకలబోస్తున్న ఆ కుండీ బొమ్మను చూస్తూ దానితో పాటు ఉన్న మహార్ఘమైన శ్లోకాన్ని కాసేపు చూడనేలేదు -
Wednesday, 29 January 2025
మణిపూసలు:3 - భ్రమరాంబామల్లీశ్వర సంవాదము
కొన్ని యోజనాలదూరంలో ఉన్న వస్తువునైనా మనసుకి తెచ్చుకోగలగడం మనకి మాత్రమే సాధ్యపడిన విద్య. భగవదుపాసన సహజంగా భారతదేశమనే పొదకి పుష్పించిన పూవు. భారతజాతి తాను ఉపాసించే దైవమనే వస్తువుకి తన సర్వమూ అర్పణ చేసింది. కటిక ఉపవాసాది ఆచారాలతో భౌతిక సుఖాలని తెంపుకుంది. యెనలేని బలంతో మనసుని తన దేవత ముందు పెట్టింది. దాని ఫలితంగా వేరెవ్వరూ ఊహించని భగవత్సుఖంలో తేలియాడగలిగింది. లౌకికసుఖాలని కొనగోరుతో నేలరాయగలిగింది.
Saturday, 25 January 2025
మణిపూసలు – 2 : చాటువులలో శివుడు
ఈ దేశంలో భగవంతుడు కవితకి యెప్పుడో దాసోహమన్నాడు. కవిత్వపు సామాగ్రి ఏదైనా సరే, అది భగవంతుడికి అన్వయింపబడనిది, ఈ దేశపు వాఙ్మయంలో అసలు కనిపించదు. భగవత్తత్త్వాన్ని ప్రతిపాదించే భాషతో పాటుగా, లౌకికమైన భావాలలోనూ భగవంతుడు అంతే అందంగా ఇమిడిపోయాడు. ఆయన ఉదాత్తతని యేమాత్రమూ తగ్గించకుండా నింద చేసి ఆయనను తగ్గించి, అదీ 'అంతే అందంగా ఉందే' అని అనిపించుకోగలిగిన బుద్ధి భారతీయుడిది. సంస్కృతంలో భవగంతుడిని చమత్కారంలో ప్రతిబింబింపచేసే ఒక విస్తారమైన సాంప్రదాయమే కవికులంలో ఉంది. తెలుగులోకూడా అది అంతే అందంగా ఉంది.
Wednesday, 22 January 2025
కీర్తనీయచరితుడు
తురుష్కో నిష్కాశిః తురగఖుర కుద్దాల దళిత
క్షమా ధూళీపాళీ చుళుకిత చతుస్సిన్ధుసలిలః
స్వదోర్లీలా భగ్న ప్రతిభట వధూటీ పరికరః
ప్రతస్థే కార్తాన్తీం దిశమితి హి వార్తా సమజని.
అపరశివావతారమైన అప్పయ్యదీక్షితుల వారు ఉపాసనలో ఉన్నారు. వీధిబైట ఏదో కలకలం. ఏం జరుగుతుందో చూసిరమ్మని కూతురిని పంపారు. ఆమె బైటకు పోయి వచ్చి ఆయనతో ఆశువుగా పై శ్లోకం చెప్పిందట!"
Wednesday, 15 January 2025
కాంతిపాతం -2
Monday, 13 January 2025
కాంతిపాతం -1
గత కొన్ని రోజులుగా నన్ను స్వామి వివేకానంద కవిత్వం వీడిపోని సాయంఫుల్ల మల్లీపరిమళంలా అల్లుకుని ఉంది. ఇదివరకు ఆయనపై వ్రాసిన అనేకాలైన కవితలు చదువుతూ ఉన్నపుడు తెలుగు కవులు, ముఖ్యంగా పద్యకవులు ఆయన్ను నెత్తినకెత్తుకున్న సంగతి నాకు గుర్తులేకపోలేదు. కడియాల సుబ్బన్నశాస్త్రిగారి వివేకానంద గీతావలి, సన్నిధానం సూర్యనారాయణశాస్త్రిగారి వివేకానందము నుండి, ముదిగొండ వీరభద్రమూర్తి గారి వందేమాతరం కావ్యంలో వివేకానందఖండం, ఎస్.టి.జ్ఞానానందకవి గారి వివేకానంద సింహగర్జన మొదలుగా తిలక్ పద్యాల వరకూ వివేకానందుడు తెలుగుపద్యాలలో పొడగట్టిన రీతి మధురాతిమధురం.
Saturday, 11 January 2025
మణిపూసలు -1: తెలుగులో విరహకవితలు
Tuesday, 7 January 2025
దివ్యజీవితాల విజయవైభవం
ఏదీ నా హృదయమ్ము? చిక్కుకొని రాదే! యాంధ్రభోజుండు ఘో
రోదారక్రమనైపుణీ సమధృతాస్యుద్భాసియౌ పాణి నే
దో దామోదర దత్తశాసన మిషాయోగాన సంధించి నా
పై దారల్ వలె వోసినట్టి తన కావ్యాబద్ధవర్ణాళిలోన్.
Friday, 3 January 2025
పదిలక్షలు

మా ఇంట్లో కొన్ని ముందు పేజీలూ, కొన్ని వెనకపేజీలూ పోయినటువంటి ప్రతాపరుద్రీయమనే ఒక తెలుగు నాటకం పాత ప్రతి ఒకటి ఉంది. చిన్నతనంలో ఆ పుస్తకాన్ని చదివినపుడు, ద్వితీయాంకంలో వచ్చిన విద్యానాథుడి పాత్ర నా మనసులో ముద్రించుకునిపోయింది. అందులో ముస్లిం రాజుల చెంత బందీగా ఉన్న ప్రతాపరుద్రుడికి అనుకోకుండా విద్యానాథుడు తారసపడి అతడెవరో తెలీయకుండా ప్రతాపరుద్రుడిమీద వ్రాసిన తన కావ్యాన్ని అతనికే వినిపించడమూ, అది విని ఉప్పొంగిన ప్రతాపరుద్రుడు అతడికి ఒక ఉంగరాన్ని ఇవ్వడమూ, దానిమీద "ప్రతాపరుద్రమహారాజు" అన్న ముద్రను చూసి, మహరాజును గుర్తుపట్టి, ఆశువుగా విద్యానాథుడు పద్యాలు చెప్పడమూ ఒక అందమైన సన్నివేశం. (ఈ నాటకాన్ని వ్రాసింది సోమరాజు రామానుజరావు గారు. ఆర్కైవులో అందుబాటులో ఉంది)
Friday, 1 November 2024
అంతిమ లతాంతము
నా దృష్టిలో భాష అంటే కొన్ని పదాల గుంపునకు ఉన్న పేరు కాదు. అది మనిషి పుట్టిన వెంటనే అతనికి లభించే ఒక సిద్ధశక్తి. మానవుడికి ఉన్న దురదృష్టాలలో ఒకటి, కేవలం హృదయంతోనే పట్టుకోగలిగే భాష ఉనికిని మెదడుతో పట్టుకోవాలని ప్రయత్నించడం. ఎదుటివారితో తన భాష గురించి చెప్పవలసి వస్తే, నేటి కాలంలో ఏ మనిషీ తన అనుభూతులను పదాలలో పెట్టకోగలిగి బయటకు వ్యక్తీకరించే సమయంలో తన మాతృభాషలో మాట్లాడినప్పుడు అతను పొందే అలౌకిక ఆనందాన్ని వర్ణించడం నేను ఇప్పటివరకూ చూడలేదు, వినలేదు.
పుట్టిన తొలినాళ్ళలో, మనసులోని భావాలను బయటకు చెప్పలేని ఆ సమయంలో భాష మనిషి ప్రాణానికి ఇచ్చిన శక్తి ఎంత విలువైందని? ఆ శక్తితో ఎదిగిన ఒక మనిషి తన భాషలో ఇంకొకరికి ఒక కథ చెప్పి ఉంటాడు. ఒక ప్రియుడు తన ప్రియురాలికి ఒక కవితను వినిపించి ఉంటాడు. ఒక కవి ప్రకృతిని చూసి పద్యాన్ని చెప్పి ఉంటాడు. ఒక భావకుడు తన పూర్వకవి కవితను తల్చుకుని ఉంటాడు. ఈ కారణాలు చాలు, ఒక భాష గురించి మాట్లాడటానికి, దాని ఉనికిని గుర్తించి, నమస్కరించడానికి. దాని బదులు, ‘నా భాషలో ఉన్న ఈ ప్రక్రియ నీ భాషలో లేదు’ అనో; ‘నా భాష నీ భాష నుండి పుట్టలేదు’ అనో; ‘నా భాషను నీ భాష కంటే ముందునుంచే మాట్లాడుతున్నారు’ అనో; ‘నాది దేవతలు మాట్లాడే భాష, నీది కాదు’ అనో మొదటగా చెప్పడం తన భాషను తక్కువ చేసుకోవడమే అవుతుంది. ఇవన్నీ రెండవ, మూడవ కారణాలు అవుతాయని నాకనిపిస్తుంది. పుట్టగానే వ్యక్తీకరణ అనే సామర్థ్యం తనకు ఊరికే అలా చిక్కడం అనే జ్ఞాపకాన్ని మనసులో మాటిమాటికీ అనుభవించలేనివాడు ఎప్పటికీ భాషాభిమాని కాలేడు.
మాతృభాష అంటే తల్లినుండి వచ్చిన భాష అని మాత్రమే కాదు, అది మన అనుభూతిని, మనకు ఏరకంగానూ కాపట్యం సోకని ఆ పూత వయసులో, మొట్టమొదటగా వ్యక్తీకరించుకోనిచ్చిన భాష. ఆనాటి అనుభూతులే మన జీవితంలో అసలైన మాతృభావాలు. ఆనాటిది మాతృభాష.
ఒక భాష ఏ కారణం చేతనైనా మరణించింది అంటే, కేవలం ఆ భాషలో ఉన్న పదాలకు, ఇతర వ్యక్తీకరణపద్ధతులకూ బ్రతికి ఉన్నవారెవరూ అర్థం చెప్పలేరని మాత్రమే కాదు. ఒక భాష మరణించింది అంటే, విశ్వవ్యాపకమైన జీవశక్తిలో ఒక దారం తెగిపోయిందని లెక్క. ‘ఈ భాష మాట్లాడడం నేటి ప్రపంచంలో బ్రతకడానికి ఏమాత్రమూ సహకరించదు’ అని కారణం చెప్పే ఒక పరిస్థితిని కల్పించే జీవన విధానంలో మానవుడు బ్రతుకుతుండడం నన్ను ఎప్పుడూ కుదిపేస్తుంది.
పేరు గుర్తులేదు కాని, నా చిన్నతనంలో, చచ్చిపోతున్న ఒక భాషలో చివరి మనిషైన ఒక కొండప్రాంతానికి చెందిన ముసలామె వినేవారెవరూ లేక, ఒక పక్షితో తన భాషలో మాట్లాడిందని ఎక్కడో చదివేను. ఆ వార్త నన్ను కదిలించిన వైనం నేనెప్పటికీ మరిచిపోలేను. తరువాతనుండీ అనేకభాషలలో చివరివారి గురించి ప్రచురించబడే వార్తలు అడపాదడపా చదువుతూనే ఉన్నాను. ఒక భాషయొక్క ప్రతీ చివరి వ్యక్తి – అది స్త్రీ అయినా పురుషుడైనా వారు చేసేది ఇంతే – తన భాషయొక్క నిఘంటువు ఒకటి తయారు కావడంలో ఎవరెవరికో సహకరించడం; కుదిరితే ఆ భాషలో తనకు తెలిసిన కవితలను ఒక పుస్తకం వేయడం.
అటువంటి ఒకానొక వార్తే, ఈ క్రింది కవితను నేను వ్రాయడానికి నన్ను ప్రేరేపించింది. నేను చదివిన ఇటువంటి ప్రతీవార్తలోనూ ఒకేలా ఉన్న అంశం, ఆ భాష ఉనికి వారి ముందుతరంతో పోకుండా, వారి దాకా రావడానికి ప్రధానకారణాలు రెండు. ఒకటి, నేటి ఆధునికత యొక్క అవసరం ఒక జాతిని తమ భాషమీద ప్రేమను తొక్కివేయవలసింత బలంగా తాకకపోవడం. రెండు, అది తాకినా, వారు తమ సంస్కృతిమీద, నేలమీదా ప్రేమ ఉన్న దృఢచిత్తం కల మనుషులు కావడం. ఈ వ్యక్తి అటువంటివాడే.
అతని పేరు అమాదియో గార్సియా. దక్షిణ అమెరికాలోని పెరూ దేశంలో ఉన్న అమెజాన్ నది పరీవాహక ప్రాంతంలో తౌషిరో అనే వేలయేళ్ళ భాషను మాటలాడే చివరి వ్యక్తి అతను. అతని మీద న్యూయార్క్ టైమ్స్ 2017లో ఒక కథనాన్ని ప్రచురించింది.
అతనే ఈ కవితలో నాయకుడు.
పూవును పిల్చుటెట్లు? మరి ముత్యమునో? యని ప్రశ్నవేయు భా
షావిదురాలికిన్ తనదు చచ్చిన పల్కున పల్లవించి వి
ద్రావిత కౌతుకాంకముల రాయిడిగొన్న పరాకుగుండెతో
మోవి కదల్చునాతడు నమోదుకు; కన్నుల మాటలాడుచున్.
అతడు వచియించెడు పదార్థతతి నిఘంటు
నిర్మితికి తోడుపడుత, కానీ, యతడు వ
చింపని హృదయాంతయథార్థ స్థితిని పట్టు
కొను మనిషి వేరొకడు నెట్టి కొసను లేడు.
ప్రథితభాషలోనె పారాడు లోకము
ను గమనించి యతడు నగవులాడు;
పనిలొ వారిభాషను నొడువుచు తన భా
ష తలపునకు రాగ సంతసిల్లు
అతని హృది యొక రుద్ధవీణ, తెరకట్టు
యాతని గళము, రసన పత్రాంజనమ్ము
లేని ముద్రణశాల; మాలిన్యపూర
మతని దేహము, విస్మృతస్మృతి మనీష.
అతడు నిరుద్యోగి, మితఖాది; నేటి నవీననైపుణ్యము లేని కతన
అతడు వరాకుడు, గతభోగి; తనవారు నైక్యత చెదరి వేరైన కతన
అతడు చేబోడి, నిహతరాగి; సహచరీసూనులు తనవద్ద లేని కతన
అతడు ప్రమత్తుడు, పతితుడు; దురదృష్టమాతనినెపుడు వెన్నాడుతున్న
కతన; వాడొక యేకాకి – కమ్రమైన
నైజభాషలొ బాసాడగా జవాబు
చెప్పువాడు లేని కతన; యిప్పుడు తన
దైన భూమిని విడచి పోలేని కతన.
కాని లోపల వాడొక మౌని, యోగి;
ప్రకృతి యాతని భాషలో వస్తువులను,
జీవములను, రహిని, కటుచిక్కణత్వ
ములను యతనికి చూపించి మురియు కతన
పులుగుతో వాదులాడును; పలుగు, పార,
తట్టలను కలిసికొనును; ధరణికి తన
గోడు చెప్పుకొనును; మావి కొమ్మపైని
కోకిలను చూసి పాడును గొంతునెత్తి
తనదు భాషయందున తన తనివి దీర.
అతడు నిద్రించు వేళల నతని భాష
జోలపాట; యుదయమున మేలుకొను స
మయమున నొక బోధకరి; విమలవయస్య;
వేరు వారికి దొరకని ప్రేమనగరి.
కొన్ని వేలయేండ్ల మధువుకు చరమంపు
చప్పరింపు వాడు; తనదు జాతి జాలు
వార్చినట్టి సంస్కృతి తుది వారికణము;
ఆతడొక భావనాలతికాంత్యసుమము.
*
This poem published in eemaata magazine Nov 2024 edition.
Image credit: Ben C. Solomon/The New York Times.
Monday, 12 October 2020
హృదయలేఖిని
లేత నారింజ సందెల క్రేపు కనుల
పడిన తల్లిపాలిండ్ల యాభాసలోన
యాట చేజారి దొరలింపులై గమించు
గోళి వెతుకు బాలుని మనఃకేళిలోన
పిలుపు వెంట స్పందించి తబ్బిబ్బుకాగ
వచ్చు యిల్లాలి వర్తనఫణితి లోన
యేడ్పు వెనువెంబడియె యెకాయెకి పరువిడి
బుడుత జేరు తల్లి యెదచప్పుళ్లలోన
నన్ను వెదకెడు లేఖినీ! క్లిన్నహృదయ!
యేమి వ్రాసిపెట్టితొ నాకయి వికసించి.
మండుటెండలొ, రేయెండ నిండు చలిలొ
పొలముగట్టుల నడయాడి బోది చెంత
గోళ్ల సందుల బంక బిగువుల తొలచు
హాలికుల చెంత ననుజేర్చి హాసమిడెదొ?
తిమిరవల్లీగృహమ్మున దీపము వెలి
గించు ఖద్యోతమును జూచి; కేళి వనము
న తిమిరమయవేళ కొలకువు తరగలను
తేలు వెన్నెల జెరుపు మరాలి జూచి
కలిత లలితాంశుజాల! నన్ తలచుకొనెదొ?
నీదు స్వారస్యసంకల్ప నియతులేవొ?
యేమి వ్రాసిపెట్టెదొ నాకయి వికసించి.
గాలికొదమల చేబూని కాంక్షనెగయు
కలికి పూదుమ్ము యాత్ర సంగతులనన్ని;
తొడిమతెగి మసృణరవళి తోడ నేల
బడిన పండుటాకు నిజానుభవములన్ని;
భర్త వినుకెంపు మునివేళ్లు పడినయంత
వలచి విరియు వారిజ గగుర్పాటులన్ని;
నింగి గుండియ పగిలెననంగ కురియు
వలపు వానకు నిలబడ్డ చెలమలన్ని;
నాకు చూప తర్జని చాపినావొ! కలమ,
మన్మనఃకుధ్ర సంజాత మహిత నదమ!
వ్రేళులంచుల నిన్నంటు వేడ్కలోన
ముజ్జగమ్ముల మరచు యీ మూఢజీవి
నిడుపు యేకాంతములలోన నిండి, తోడు
నిలువ రాగదె, మల్లేఖినీమతల్లి!
*
(image taken from Google. Published on Facebook. )



.jpg)



.jpg)
.jpg)






