Monday, 28 April 2025

పాఠకాభిగమనం


పుట్టపర్తి వారి జగద్విదితమైన కావ్యం “శివతాండవము” నకు వాగ్దేవి నా ద్వారా వ్రాయించుకున్న “సహాయవల్లి” వ్యాఖ్య నాకు ఎంతో ప్రత్యేకమైన రచన. దీనికి ముందుమాటలు గానూ, ఈ కృతి ఆవిష్కార సమయంలో స్పందనలు గానూ ఎందరో పెద్దలు, పండితులూ చల్లని పలుకులను ఈ రచనపై కురిపించారు. రచనను చదివి మరికొందరు తమ సహృదయస్పందనలను అందించారు. వారందరికీ ప్రత్యేకకృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం ఇప్పటికి కలిగింది.

వారిలో ఆచార్య శ్రీ గంగిశెట్టి లక్ష్మీనారాయణగారు, శ్రీ బులుసు వెంకటేశ్వర్లు గారు, శ్రీ గన్నమరాజు గిరిజామనోహర్ బాబు గారు, శ్రీ వజ్ఝల రంగాచార్య గారు వంటి మహనీయులున్నారు. రచన వెలికి వచ్చాక ఎందరో మాన్యులైన పఠితల ఆదృతికి ఈ ప్రయత్నం నోచుకుంది. 2022 న నా జన్మదినం నాడు నేను అనుకోని దీవెనగా కీ.శే.  శ్రీ సూరపరాజు రాధాకృష్ణమూర్తిగారి స్పందన వెలివడింది. ఆచార్య శ్రీ మహాదేవమణి గారి స్పందన నేను ఆజీవితాంతమూ దాచుకోదగ్గది. ఆ కాలంలోనే శ్రీ చీర్ల చంద్రశేఖర్ గారు లోనారసి ఈ కృతిని పరిశీలించి వెలువరించిన సమీక్షను కొద్దిరోజుల క్రితం నాగపద్మిని గారు వాట్సాప్ లో నాకు పంపినపుడు ఎంతో పునరామోదం కలిగింది. 

ఈ స్పందనలను సహాయవల్లి పునర్ముద్రణలో చేర్చాలని అనుకున్నాను. ఆ అవకాశంపై ప్రస్తుతం స్పష్టత లేదు. ఫేస్ బుక్ మాధ్యమంలో స్క్రోలింగ్ ధాటికి మరుగునపడిపోయే గొప్ప గొప్ప రచనలు ఎన్నో. సహాయవల్లిపై అక్కడ వెలువడిన అమూల్యాలైన స్పందనలు అలా మరుగున పడకూడదన్న ఉద్దేశంతోనూ, వ్రాసినవారికి ప్రతిగా నా కృతజ్ఞతనూ, ధన్యతనూ తెలియజెప్పాలనే ఉద్దేశంతోనూ వాటిని ఒక చిరుపొత్తంగా ఇక్కడ గుదిగుచ్చుతున్నాను. ఈ వ్యాసాలలో నేను లేను. నా వంటి ఒక పండితమ్మన్యుడు ఇటువంటి ఒక రచనను వెలికి తెస్తే, దానిని చదివి ప్రతిస్పందించే ఒక సహృదయ వాతావరణం తెలుగుసాహిత్యజగత్తులో బ్రతికి ఉందనే సాక్ష్యం మాత్రమే ఈ వ్యాసాలలో ఉంది. ఒక పుస్తకంపై స్పందన ఒక ఆనందచిహ్నం. అటువంటి తొమ్మిది ఆనందచిహ్నాలివి. తమ సమయాన్ని వెచ్చించి ఈ కృతిలోని లోటుపాట్లను క్షమించి, గుణాలను పర్వతీకరిస్తూ  ఈ వ్యాసాలను వ్రాసిన ప్రతీ ఒక్కరికీ– శ్రీ సూరపరాజు రాధాకృష్ణమూర్తిగారికీ, శ్రీ ధూళిపాళ మహాదేవమణిగారికీ, శ్రీ చీర్ల చంద్రశేఖర్ గారికీ, శ్రీ చామర్తి మానసగారికీ, శ్రీ న్యాయపతి శ్రీనివాసుగారికీ, శ్రీ లక్ష్మీదేవి గారికీ, శ్రీ మోగంటి సత్యగౌరిగారికీ, శ్రీ వంకాయల శివరామకృష్ణారావుగారికీ, శ్రీ కొప్పరపు లక్ష్మీనరసింహారావు గారికీ  పేరుపేరునా నా నమస్కారాలు. సహాయవల్లిని చదివి తమ స్పందనను తెలిపిన ప్రతీ ఒక్కరికీ నా నమస్కారాలు.  

ఐదారేళ్ల క్రిందట ఈ వ్యాఖ్య వ్రాయడమనే అవకాశం నాకు రావడానికి ప్రధాన కారణభూతమైన శ్రీ ఈయన్వీ రవి గారికీ, ఈ వ్యాఖ్య వ్రాసేందుకు నాకు అవకాశమిచ్చిన శ్రీమతి నాగపద్మిని గారికీ, నా తల్లిదండ్రులకూ, గురువులకూ కృతజ్ఞతాపూర్వక నమస్కారాలను అర్పిస్తున్నాను. తమ కృతులద్వారా ఈ వ్యాఖ్యరచనలో నాకు తోడ్పాటునిచ్చిన శ్రీ భరతుడు, నందికేశ్వరుడు, అమరసింహుడు, అభినవగుప్తుడు, బోధాయనుడు, రాజా రాధాకాంత దేవుడు, ఆనందకుమారస్వామి, పతంజలి మహర్షి, మేదినీకారుడు, భవభూతి, శబ్దచంద్రికాకారుడు, వాత్స్యాయనుడు, హలాయుధుడు,  విన్నకోట పెద్దన, రావూరి దొరస్వామి శర్మ, కోవెల సంపత్కుమారాచార్య, జాయపసేనాని, శారదాతనయుడు, సోమదేవసూరి, పుష్పదంతుడు (అపభ్రంశభాషాకవి), హేమచంద్రుడు, జటాధరుడు, విద్యానాథుడు,విప్రదాసుడు, జ్యాయనుడు, భరతకల్పలతాకారుడు, బహుజనపల్లి సీతారామాచార్యులు,పుల్లెల శ్రీరామచంద్రుడు, చిత్రభానుడు, తారానాథ తర్కవాచస్పతి, సంకుసాల నృసింహకవి,హమ్మీరుడు, కుంభుడు, కల్లినాథుడు,గౌరీనాథుడు, శార్జ్గుడు, రాజశేఖరుడు,ఆదిశంకరులు,  విద్యారణ్యులు, అ.ఉషాదేవి,  లింగమగుంట మాతృభూతయ్యకవి, మానవల్లి రామకృష్ణకవి, పోణంగి శ్రీరామ అప్పారావు, జమ్మలమడక మాధవరామశర్మ, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ ఇత్యాదులైన గురు మహనీయ పూర్వకవిపండితులకూ, సంగీతనాట్యలాక్షణికులకూ, శాస్త్రకారులకూ కృతికర్తలకూ సప్రశ్రయాంజలులను ఘటిస్తున్నాను. ఈ శివతాండవసహాయవల్లిని చదివిన, చదువబోయే ప్రతీ ఒక్క రసజ్ఞపాఠకునికీ నమస్కారాలు విన్నవిస్తున్నాను. 


సరస్వత్యాస్తత్త్వం కవిసహృదయాఖ్యం విజయతే.

ఈ పుస్తకాన్ని దిగుమతి చేసుకోవడానికి ఈ లంకెపై నొక్కండి:

సహాయవల్లి స్పందనలు.pdf









6 comments:

  1. చదువరి28 April 2025 at 09:01

    బాగుంది!

    ReplyDelete
  2. మీ పద్ధతే వేరండి...అమృత సంతానం కి ఇలా భద్రుడు గారు పాఠకుల స్పందనలతో పుస్తకం తెచ్చారు. మళ్ళీ మీ దగ్గర చూస్తున్నాను. చాలా సంతోషం. మీరింకా ఎన్నో విమర్శలు, కావ్యాలు ప్రచురించాలని, మేం చదువుకోవాలని నా ఆకాంక్ష. చల్లగా ఉండండి. ❤️

    ReplyDelete
    Replies
    1. పరిమి శ్రీరామనాథ్28 April 2025 at 10:05

      హృదయపూర్వక ధన్యవాదాలు మానస గారూ!

      Delete
  3. ఈ సహాయవల్లి పుస్తకం ఎక్కడ లభిస్తుంది అండీ

    ReplyDelete
  4. Thanks for mentioning my name. Seeing my name being bracketed with great names, I too felt big and accomplished. Thanks aqgain.

    ReplyDelete