ప్రార్థన చేయగలగడం మానవజాతికి ఉన్న గొప్ప వరం. భగవంతుడి కోసం బుద్ధి తలుపులని తెరుచుకున్న మనిషి అహంకారాన్ని తగ్గించి, బాలుడిగా చేసి, ఆలోచనలనే ఎల్లలను తెంచి, ఆయుష్షుని పెంచే సంజీవని ప్రార్థన. ఈ వస్తువే కనుక ఉండి ఉండకపోతే, పెరిగే వయసుతో పెరిగే కుదింపుల స్వతంత్రత శిరసుమీద పెట్టే బరువుని మనిషి మోయడం అసాధ్యమయి ఉండేది.
'భగవంతుడి గది ఎపుడూ తెరుచుకునేఉంటుంది కానీ, దాని ప్రవేశమార్గం ఎత్తు చాలా తక్కువ, శిరస్సు వంచే లోపలికి వెళ్లాలి ' అంటారు రమణమహర్షి. ఒక బాలుడు మాత్రమే పట్టగలిగే మార్గమది. కనులు మోడ్చి, భగవంతుడికోసం తపిస్తూ మన హృదయం వేసే కేక మనలోని పెద్దరికాన్ని బాలుడిగా చేసి, బాలుడిని పెద్దవాడిని చేస్తుంది. అపుడు సంతరించుకున్న ఆ చూపులో ఊపిరి తీసుకునే ఒక నిర్మలత్వం అంతులేని బలాన్ని ఇస్తుంది. ఈ పరివర్తక శక్తి ప్రార్థనలో ఉంది. మనిషికి ప్రార్థన ఎపుడూ చిత్రమైన ప్రహేళిక లాంటిది. మామూలుగా అది మనిషి శక్తిహీనతలోనుంచి, ఈశ్వరుడి శక్తిమత్వానికి ఎదురుగా పుడుతుంది. అది లౌకికప్రార్థన. కానీ అది మనిషి శక్తిమత్త్వం లోనుండి ఈశ్వరుడి సర్వశక్తిమత్త్వాన్ని ప్రార్థించడం ఆధ్యాత్మికప్రార్థన అవుతుంది. ఆ ప్రార్థనలో కుత్సితమైన వినిమయం ఉండదు. వినియోగం ఉండదు. విచారం ఉండదు. తీపి మాత్రమే ఉంటుంది. అదే దాని అసలు స్వరూపం.
మహాకవి ఎవరు అంటే నాకు ఉన్న కొన్ని ఊహలలో ఒక ఊహ ఇది - గడియకు గంటమైనా లేకుండా ఆశువుగా ఐదువందల పద్యాలు అల్లగలిగేవాడు గొప్ప కవే కావొచ్చు. లౌకిక ప్రపంచాన్ని తేనెలో ముంచి తేల్చేవాడు గొప్పకవే కావొచ్చు. సత్యాన్ని నిర్భయంగా చెప్పి, సమాజాన్ని మేలుకొలిపేవాడు గొప్పకవే కావొచ్చు. కానీ, వినిమయంలేని నిస్వార్థమైన హృదయం తపనతో పెట్టే అనిర్వచనీయమైన ఒక కేకని దొరకబుచ్చుకుని, అందులో ముందు తాను రమించి, తన ప్రతిభతో కవితా సామాగ్రిని ఆ కేకకి జోడించి కావ్యసృష్టి చేసేవాడు మహాకవి. అటువంటి ఒకమాట, ఒక కవిత, ఒక పంక్తి చూడటానికి అష్టోత్తరం లాగానో, సహస్రం లాగానో, పొగడ్తలాగానో కనిపించినా, అవి మనసులో చేరి అందించే బలాన్ని ఊహించడం కష్టం.
అటువంటి విష్ణుమూర్తిమీద కొన్ని ప్రార్థనాకవితలను, చాటుపద్యమణిమంజరి లోనుంచి ఏరి ఇక్కడ మీతో పంచుకుంటున్నాను.
1
పరుగై రావదె?! త్రోవ గానవొ, సురల్ ప్రార్థించిరో, సామగా
నరుచిం జిక్కితొ! యాంజనేయుని వడిన్ రావించితో జానకీ
చరణాబ్జంబులు నొచ్చెనో యితరదేశప్రాణి సంరక్ష నే
మరితో జాలమిదేలనయ్య, రఘురామా, ఆర్తరక్షామణీ.
రఘురామా, పరుగున రావెందుకు?
దారి తెలియడంలేదా?
దేవతల ప్రార్థనలు స్వీకరిస్తున్నావా?
సామగానశ్రవణంలో తేలియాడుతున్నావా?
ఆంజనేయుని పిలిపించుకున్నావా?
సీతాదేవి కాళ్లు నెప్పి పెడుతున్నాయా?
మిగిలిన దేశాల ప్రాణులని రక్షించడంలో ఏమరిచావా?
ఆర్తరక్షామణీ,
పరుగున రావెందుకు?
2
మొగము నెలనవ్వు మొలకరేయెండల గాయువాఁ డావుల గాయువాఁడు
పశుపాలిక మోవి బంగాళి చక్కెరగ్రోలువాఁ డొక పిల్లఁ గ్రోలువాఁడు
తిరుమేన బంగారు జరబాజు గలుగువాఁడు తనంతఁ గలుగువాఁడు
అఖిలపావనమైన యడుగుఁ దామరతేనె జాలువాఁ డెలమి యీఁజాలు వాడు
శ్రవణములు వ్రేలు కర్ణికారములవాఁడు
తీర్చినట్టున్న ముక్కుముత్తియమువాఁడు
కళుకు లీనెడునెద మానికంబులవాఁడు
మనలఁ గరుణా విధేయుడై మనుచుఁగాత.
ముఖంపై మందహాసంతో
వెన్నెలలు కాసేవాడు, ఆవులని కాచేవాడు;
గోపికల పెదవితేనెని గ్రోలే వాడు, పిల్లంగ్రోవి కలవాడూ,
దేహంమీద పచ్చనిబట్ట కలిగిన వాడు,
తనంత తానుగానే కలిగే వాడూ,
పవిత్రమైన పాదాలదగ్గర నదిని కలిగిన వాడు,
దేన్నైనా ప్రేమతో ఇచ్చేవాడూ
కర్ణాల దగ్గర కర్ణికారాలని అలంకరించుకున్నవాడూ
తీర్చినట్లుగా ఉన్న ముక్కుక్రింద ముత్యం ఉన్నవాడూ
గుండెలమీద మాణిక్యాలని అమర్చుకున్నవాడూ
మనలని కరుణతో రక్షించునుగాక.
3
మూడుకన్నుల వేల్పు ముంజేతికడియంబు
పఱుపు పచ్చడమునై యొఱపు మిగుల
అక్కున విలసిల్లు చక్కని పూఁబోణి
యాలును మనుమరాలై తనర్ప
బొడ్డుతామరఁ బుట్టి పొలుపారుబిడ్డఁడం-
తటికిఁ దీర్పరియుఁ దాతయును గాఁక
పులుఁగులగమికాడు పలుదెఱుంగుల దాట
గుఱ్ఱంబు బంటునై కొమరు మిగుల
ప్రాఁతచదువులు వలకాలిపసిఁడి యందె
యనుఁగుఁ గూర్చుండు పలకయునగుచు మీఱ
నందములకెల్ల యైననిన్ డెందమందుఁ
దెల్లమిగఁ జేర్తుమోయన్న నల్లనన్న.
నల్లనన్నా!
మూడు కన్నులున్నాయన ముంజేతి కంకణం
పరుపూ పక్కా అయి స్థిరంగా కుదురుకోగా,
హృదయంలో కొలువైన చక్కని పూబోణి
ఆలుగానూ, మనుమరాలిగానూ అతిశయించి ఉండగా
బొడ్డుతామరలో పుట్టిన అందమైన పిల్లవాడు
అంతటినీ తీర్చేవాడూ తాతా అవగా;
పక్షుల రాజు దశదిశలా తిరిగేందుకు
వాహనమై, బంటు అయి ఉండగా
పాతచదువులు
కుడికాలి బంగారు అందె
పక్కనే ఉండే పలకగానూ మీరగా
ఆనందానికి హద్దు అయిన నిన్ను
హృదయంలో నిర్మలంగా చేర్చుకుంటాము.
4
అందంపుఁజుంచుతో నాణిముత్తెమ్ముల జోకైన నెఱరావిరేక తోడ
నిద్దంపు వజ్రాల మద్దికాయలతోడ మురువైన చిఱునవ్వుమొగము తోడ
బొజ్జపై నటియించు పులిగోరుతాళితో రమణీయమణికంకణముల తోడ
నవరత్నఖచితఘంటలమొలనూలితో నీటైన గిలుకుటందియల తోడ
తోడ లక్ష్మణభరతశత్రుఘ్ను లాడ
బరుగులెత్తఁగ వెనువెంట బరుగులెత్తి
తల్లి కౌసల్య రార నా తండ్రి యనుచు
నెత్తి ముద్దాడు శ్రీరామునే భజింతు.
అందాల చుంచుతో ఆణిముత్యాలతోటి
గాలికి మెల్లగా ఊగుతున్న రావిరేకతో
కాంతిమంతాలైన వజ్రాల మద్దికాయలతో
సుందరమైన నగుమోముతో
బొజ్జమీద కదులుతున్న పులిగోరుల దండతో
రమణీయమైన మణికంకణాలతో
నవరత్నాలూ పొదిగిన మొలనూలితో
నీటుగా ఉన్న అందియలతో
తనతోపాటు లక్ష్మణభరతశతృఘ్నులు
ఆడుతూ పరుగులుపెడుతుంటే
వెనువెంట తానూ పరుగులుతీసి
కౌసల్యా దేవి 'రారా నాతండ్రీ' అంటూ ముద్దుచేసే
శ్రీరాముడిని నేను భజిస్తాను.
5
నా చిన్ని రామన్న ననుఁగన్న తండ్రి రా
నన్నేలునయ్య నాయన్న రార
నా ముద్దులయ్య నా సామి రాఁగదవోయి
అప్ప చక్కదనాలకుప్ప రార
నా పెన్నిధానమా నా పుణ్యమూర్తి రా
నా యింద్రనీలరత్నంబ రార
బంగారుకొండ నాపాలి భాగ్యమ రార
అమృతంపుఁ జెలమ రా యయ్య రార
చూతమెవ్వరువత్తురో చూత మనుచుఁ
దల్లి పిలువంగ నందియల్ ఘల్లుమనగ
నవ్వి చెలరేఁగి గునగున నడచివచ్చు
నట్టి కౌసల్యగారాపుఁబట్టిఁ దలఁతు.
నా చిన్ని రామా, నన్ను కన్న తండ్రీ!
నన్నేలువాడా, నా అన్నా, రారా!
నా ముద్దులయ్యా! నా స్వామీ! రారాదా!
చక్కదనాల కుప్పా! రారా!
నా పెన్నిధానమా, నా పుణ్యమూర్తీ,
నా యింద్రనీలరత్నమా,
నా బంగారుకొండా!
నా పాలి భాగ్యమా!
నా అమృతపు చెలమా! రారా!
చూద్దాం, ఎవరు వస్తారో, ఇప్పుడు - అంటూ
తల్లి కౌసల్యాదేవి పిలవగా
కాలి అందెలు ఘలుఘల్లుమనుకుంటూ నవ్వి,
ఉత్సాహంతో చెలరేగి
గునగునమని నడిచివచ్చే
కౌసల్య ముద్దులపట్టిని తలుస్తాను.
(ఈ పద్యం స్పష్టమే కానీ ఉండబట్టలేక అనువాదం చేసాను)
6
తిన్నని కస్తురి నామము
సన్నపుఁదలపాగ చుంగు చక్కదనంబున్
జెన్నలర మిమ్ముఁ గంటిమి
కన్నుల తెలివెంత వింత కదిరి వసంతా!
కదిరి వసంతా!
నిలువుగా ఉన్న కస్తూరి నామమూ,
సన్నని తలపాగ కుచ్చూ,
చక్కదనాలు పోతుండగా అందాల నిన్ను చూసాము.
కన్నుల తెలివి ఎంత వింతదో కదా!
7
నారాయణ నీ నామము
నారాయణ వ్రాయవయ్య నా నాలుకపై
నారాయణ నిను నమ్మితి
నారాయణ కావవయ్య నారదవరదా!
8
నిరుపమ బాలానందా!
వరవనితాచిత్తచోర వరవసునందా!
గిరిధర శరణు ముకుందా
కరుణాకర నీవు నాకు గతి గోవిందా.
9
సింగపుమోమువాడు, తులసీదళదామమువాడు, కామినీ
రంగదురంబువాడు వలరాయని గాంచినవాడు భక్తికు
ప్పొంగెడు వాడు దానవులపొంకమడంచెడు వాడు నేడు శ్రీ
బంగరు రంగశాయి మనపాలఁ గలండు విచారమేటికిన్.
*
పద్యాలు అద్భుతంగా వున్నవి. అభినందనలు 🌹🌹
ReplyDelete