Wednesday, 22 October 2025

విబుధస్పందన


సాహిత్యవిద్యానిష్టాతులు, స్వయంగా అద్వితీయ కవి విమర్శకులూ అయిన శ్రీ చీర్ల చంద్రశేఖర్ గారు "హృదయావి" కావ్యంపై తమ స్పందనను వ్రాశారు. వారికి అనేక నమఃపూర్వక ధన్యవాదాలతో దానిని ఇక్కడ ఉంచుతున్నాను. 

-------------------------------------------------------------------------------------



కొంత ప్రతిభ కల కవి ఏదో ఒక కథను తీసుకొని శృంగారమో, వీరమో, కరుణయో - ఏదో ఒక రసం ఆలంబనగా, శయ్యాలంకార ధ్వనులతో రంగరించి ఒక కావ్యాన్ని రూపొందించిడం మనం సాధారణంగా గమనిస్తాము. కాని పరిమి శ్రీరామనాథ్  గారు అలా చేయరు. కారణం - వారి ప్రతిభ అసామాన్యమైనది కనుక.

శ్రీరామనాథ్ గారు తమ మొదటి కావ్యం జీవాతువులో వలెనే, 'హృదయావి' లో విశిష్టమైన వస్తువును ఎన్నుకొన్నారు. కవి హృదయాన్ని ఇంత గాఢంగా, దీర్ఘంగా ఆవిష్కరించినవారు తెలుగు సాహిత్యంలో మరొకరు లేరేమో - కొంతవరకు శ్రీ శ్రీ 'కవితా ఓ కవితా' సమీపంగా ఉన్నదనుకోవచ్చు.**

'హృదయావి' ప్రారంభంలో శ్రీరామనాథ్ గారు సుభాషిత రత్నభాండారం లోని ఒక శ్లోకాన్ని ఉదాహరించారు.

            దిగంతే ఖేలంతీ సరసహృదయానందజననీ
            మయానీతా దుష్టప్రచురనగరీం కాపి కవితా
            అకస్మాదున్మీలత్ ఖలవదన వల్మీక రసనా-
            భుజంగీ దష్టాంగీ శివశివ సమాప్తిం గతవతీ.

ఈ సందర్బంగా శ్రీ రామనాథ్ గారు తమ ముత్తాతగారి చిత్తుకాగితాలలో నుండి మరోక చోట ప్రస్తావించిన శ్లోకమే దీనికి మూలమై ఉండవచ్చు.  అందులో రెండవ పాదం లో 'దుష్టప్రచురనగరీం కాపి' బదులుగా 'భోజక్షితిపనగరీ మంబ' అని ఉంది. తన రమ్యమైన కవితను భోజ రాజుకు వినిపించాలని వెళ్లినపుడు, అక్కడి కొందరు కువిమర్శకులు 'పుట్టలో నుండి అకస్మాత్తుగా వెలికి వచ్చిన పాములవంటినాలుకలతో లేని' దోషాలను ఎత్తి చూపగా, ఆ కవిత అక్కడే అంతమయ్యింది. భోజునికి తన కవిత్వం వినిపించాలన్న ఉత్సుకత, 'అంబ' అని తన అవమానాన్ని ఖేదంతో సరస్వతీ దేవికి నివేదించడం, సుభాషితంలో లుప్తమయ్యాయి. 'దుష్ట నగరీం' అనడంలో కొంత  అనౌచిత్యం కూడా కనుపిస్తున్నది. కనుక ఈ రెండవ శ్లోకమే మూలమని అనవచ్చు.

ఈ శ్లోకం కదిలించిన భావంతో శ్రీరామనాథ్ గారు సహృదయుడైన కవి కువిమర్శల చేత బాధితుడు కావడమన్న విషయంతో 'హృదయావి' పద్యకావ్యాన్ని రచించారు. అయితే ఈ విమర్శాప్రస్తావం మూడవభాగం లో మాత్రమే వస్తుంది.  మొదటి భాగంలో కవి ఒక భవ్యకవితను సృజించడానికి తన అంతరంగాన్ని ఆయత్తం చేసుకొంటాడు. రెండవ భాగంలో ఆ కవిత అవతరించడంలో నున్న బాధ, ప్రసవవేదన వంటిది. చివరి భాగంలో, సభలో కవితా పఠన, విమర్శల పాలుకావడం.

హృదయావిన్ అన్న సంస్కృత శబ్దానికి తత్సమంగా హృదయావి ని ఎంచుకొన్నారు, శ్రీరామనాథ్ - సుకుమారమైన మనస్సు కల కవి నుద్దేశించి. ఈ కవి అడుగడుగునా తనలో కనుపించీ కనుపించనట్లున్న కవితను వెతుక్కొంటాడు.
        మొన్న శబ్దస్రవంతి సంపూర్ణ మహిమ
        జాలువారంగ గమనించి సోలు వెంట
        భావమేదో మనస్సున పండలేని
        యలజడి జడుల మరచిపోనలవి కాదు.

అంతశ్చేతన నుండి ఆవిష్కృతమవుతున్న కవితను పట్టుకోగలగడమే ఆనందము. ఇది ఒక అవరోహణ క్రమమంటారు శ్రీరామనాథ్.

            లోని లోతులనుండి తాను తనను
            సంతరించి యేకాంతసిద్ధాంత సరణి
            పద్యమల్లు వేళల, మూలప్రకృతి పాఠము
            లను చల్లు వేళల పరపూర్ణుడతడు

ఆ 'మూలప్రకృతి' నుండి జాలువారెడు భావాన్ని పట్టుకొని కవితను నిర్మించడం సులభం కాదు - దానికి మనస్సు వివశం కాకూడదు, కారణాంతరాలను వెదుకుతూ నిలుకడ కోల్పోకూడదు. అందుకని మనస్సును ప్రబోధిస్తున్నాడు, కవి.

        మనసా, పూర్వపు పుణ్యపాకమిది యామంత్రించెనా నిన్ను! కా
        రణమేమో వెతుకంగ బోకు వికచప్రజ్ఞాళికిన్, చాటుమా
        టున తృళ్ళింతలువోవనేల కవితా డోలాయమానాంతర
        మ్ము నెపమే త్రపకున్? తలిర్చి యిపుడే ముక్తారుచుల్ చిందుమా!

పునరాలోచన (deliberation) తో సహజంగా వచ్చిన కవిత మరుగున పడుతుందన్న భయమేమో కవికి?

మరికొంత ప్రస్ఫుటంగా

        మరపున నొక్క యూహ మటుమాయము పొందినదై, పురాసమీ
        కరణములోని శబ్దములు గ్రక్కున తప్పుకపోవ, వ్యాకులాం
        తరము పదే పదే వెదకి దన్ను వెలార్చెడు లే మొదళ్ళకై
        పరుగును  తీపియాశ లెగబార నవే స్మృతులందు గ్రమ్మరన్.

అంత వ్యాకులపాటుతో పైకి వచ్చిన కవితపై కవి ప్రేమ చెప్పరానిది.

        వీడిపోలేనితనమున వెలికి వచ్చి
        కాగితముపైన నమరిన కవితలోని
        పదము పదము తడుము నాప్యాయనమున
        కనుల - లేగను నాకు గోకాంత వోలె.

గోవుకు వాక్కు అన్న అర్థం ఉండడం చేత పై ఉపమానం మరింత రమణీయ మయ్యింది.

కవికి ఏదో పదము తప్ఫని దాని సరిచేయబోయినా, ఆ పదముపై ప్రీతి వదలదు.

         అపపదమ్ములు దొరలినయంత నడ్డు
        గీత గీయడు; కలము తాకించి చుట్టు
        గా లిఖించి, దాచికొనును బేల మనసు
        లో నిరంతర స్నేహితాలోచనముల.

రవీంద్రనాథ్ టాగోర్ వ్రాతప్రతులలో సవరించవలసిన శబ్దాలను కొట్టివేయకుండా ఆకారాలనేర్పరించడం చాలామంది చూసే ఉంటారు.

ఇది కవులందరికి అనుభూతమైన విషయమే. ఎప్పుడు ఏ శబ్దం తో మళ్ళీ పని బడుతుందో అని అక్కడ  కుదరకపోయిన శబ్దాన్నీ భద్రంగా దాచుకొంటారు!

        వ్రాయడు ప్రకటింపడు గణ
        నాయాసముకై, లిఖించినంత కవిత కా
        దే యనుకొను, బద్యమ్మొక
        శ్రీయోగమని తలచు సుమశీలపుటెదలో.

ఈ కవిత్వము ఒక ఉపాసన వంటిదని శ్రీ రామనాథ్ గారి స్వానుభవమై యుండాలి! అంతే కాదు, కవిత్వము  ప్రేమ వంటిది కూడా.

        కవిత ప్రేమ వంటిది - క్రొత్త కువ కువ రుచి
        నభినవించి యాంతర భిత్తి నద్దికొనిన
        యంత విద్యుత్తు ప్రాకిన యట్లు జొచ్చి
        చూపు జగమును సౌందర్యదీప కరణి.

ఇది నిత్య నూతనమైన ప్రేమ - కవికి జగత్తంతా సౌందర్యమయమై కనుపిస్తుంది. 'ఆంతర భిత్తి నద్ది కొనిన' - కవిత అంతఃకరణమును తాకునది, కనుక కొంత మాయా విచ్ఛేదము, సౌందర్య భావన కది కారణము.

మనోభూమికను సిద్థపరుచుకొన్న కవి కవితా సృజన రెండవ భాగము. ఇది ఈ లఘుకావ్యము లో శిరోమణి వంటిది.

ముందు కవితకు వెన్నెల వస్తువు.

        నీ కొరకోయి జాబిలి!  కనీనికలన్ నభమున్ గ్రహించుచో
        బ్రాకుడుపాప లుల్లసన వాహికలౌను కదా! పటూన్నత
        వ్యాకృతులన్ భవచ్ఛవులు పందిరి గట్టు గదా వనాధిదే
        వీ కమనీయమూర్తికి, లభింతువు చల్లని పుణ్యపాకమై.

అడవికి వెన్నెల పందిరి - మనోహరమైన భావము.

        వనములలోకో, పోత ప
        వనములలోకో మదీయ భాతి పృథా పో
        వునను దిగులు సెందవు, స
        ద్గుణమతివి విధూ! యమృతము కురిపించుటలో.

నా కవిత్వము ( సరియైన పాఠకులు లేక) అడవి పాలవుతుందో, గాలి కెగిరిపోయో వృధా అవుతుందేమో నన్న నా భయం నీకు లేదు కదా, వనములకూ పవనములకూ నీ అమృతకిరణాలను సమానంగా పంచుతున్న సద్గుణమతివి నీవు! 'దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే .... వనేవా హర్మ్యేవా సమకరనిపాతో హిమకరః' అన్న స్తుతి జ్ఞాపకం వస్తుంది.

        హృదయ భిత్తిపై మిగిలి యున్నది గతమున
        నేను పులిమి కొన్నట్టి వెన్నెలల రంగు
        నిట్టనిలువున నమృతమై నిలిచి యున్న
        కనుల ముంగిటి  శేవధి గాంచినాను.

ఆ 'జన్మాంతర సౌహృదము'లు ఈ అమృతకిరణుని రూపంలో ఫలించినవి.

ఆ తర్వాత కవి కవితను కొనసాగించడానికి అశక్తుడైనాడు. 'అటుపై మనసాడక సాగలేక మానగ లేమిన్' ఒక అంతర్యుద్ధం మొదలయ్యింది. 'గుండె గొంతుకలోన కొట్లాడుతాది' అన్నట్టుగా 'ఆ తెలుగు' కవి యాతనను శ్రీరామనాథ్ గారు ఇరువదినాలుగు పాదాల సీసమాలికలో అద్భుతంగా వర్ణించారు.

        వచ్చునూహ యొకటి వచ్చిరానట్లుగా
        రాకున్న మేలేమో రమ్యపదము
        తోచునొకటి యేమి తోపించదు వెనుక
        తోపకుండిన హాయి తోచునేమొ

అసలొక ఊహ రాకపోవడమే సుఖము. ఆ ఊహ అస్పష్టంగా ఉండి స్పష్టమయ్యేవరకు వేధిస్తూనే ఉంటుంది.

        అసమగ్ర సంభావనావర్తముల కొన్ని
        కాలమ్ములవరకు కలియదిరిగి

కొన్ని ఊహలు అసంపూర్ణంగా ఉండి ఒక సుడిగుండంలో చిక్కుకొన్నట్లుగా క్రిందుమీదవుతుంటవి.

...పట్టునకు దొరికి పనివడి విదిలింప
నీయదు, కదలదు, రాయబార
ము కుదర, దనునయము సహకరింపదు; కలయిక, విరహమ్ము, కలిసి క్రమ్ము

'మరియొక త్రుటిపాటు మది నుంచెదను, వచ్చు
నేమో' యని తలచు - రామి, రోసి ..

ఈ ఊహాపథము లోని ఊహలన్నీ కవికి ప్రాణప్రదమైనవి - ప్రేయసి వంటివి. వచ్చీ రానట్లుగా, కనుపించీ కనుపించనట్లుగా ఉన్న ఊహను దొరికించుకొనడమే కష్టము, ఆ తర్వాత తగిన పదం వెతకాలి.

  పదమొకటి తనను వాడగా వేడును,
 బాగు పదము దివ్య పథము నుండి
పలుకదు, ప్రార్థన పనిజేసి పలికెనా
కవితలో నమరదు కమ్రముగను ..

ఈ శాబ్దికజగత్తులో కవి అవిశ్రాంతమతియై చరిస్తాడు. చివరికి

వ్రాసి, దిద్ది, మరల వ్రాసి, యిమిడినది
చూచి, శిశువు మాడ్కి చొక్కి మురియు

తన కవితపై ప్రేమానురాగముల పెంచుకొన్న కవి -

        యనుకొనిన యప్ఠు విడిచిపో మనసు రాని
        యొక మహత్తరమైన ప్రేమకు  నమాయి
        క చిరబద్ధుడు, సౌందర్య కథన శీలి
        గూఢ హృదయ వంతుడు, తెలుగు కవి వాడు.

ఈ గూఢ హృదయం రహస్యమైనదని కాక, లోతైన మనస్సని అర్థం చేసుకోవాలి. శ్రీరామనాథ్ 'తెలుగు కవి' అనడంలోనూ ప్రత్యేకత ఉంది - ఈ ప్రసక్తి చాలాచోట్ల వస్తుంది - గణ యతి ప్రాస బద్ధమై తెలుగుకే విశిష్టమైన పద్యాన్నే వారు ప్రేమిస్తారు కనుక. అందులోనూ పూర్వాలంకారికుల లక్షణ శాస్త్రములపై పరమ గౌరవము (పూర్వ భాగంలో "అభినవ గుప్తపాదు డనినట్టి విధాన రన న్వరూప సౌరభ గతులో, యలంకృత సురమ్య జగత్తున దండి, వామనాది భణిత రీతులో ...").

కవి, కవితను పూర్తి చేయుట కొరకు -

        ఒక ముత్యాలరథమ్ము వోలె నడచెన్ యోగించి రాగించు శీ
        ర్షిక కోసమ్మొక యూహ కోస మొక యుద్రేకమ్ము కోసమ్ముగా
        నకళంకప్రభలుప్పతిల్లిన స్ఫుటమ్మౌ స్ఫూర్తి కైసేత బూ
        ర్వ కవీంద్రాశయశిల్పముల్ తన మనోభావాల నూగింపగన్.

పూర్వకవులపై అభిమానమూ ఆటంకమే అవుతుంది -

ఒక కవి స్మృతిని పలుకరించి'నీవయే నే'నని మురిపించు, నిమ్మళమున
వేరొక కవి తోచి వెనువెంట 'నా లోన నీవు వసించెద' వని వచించు
నింకొక కవినాథుడేతెంచి 'నా రసవాదము నీ కలభ్య'మని చెప్పు ......

ఇత్యాది. తుదకు 'సరసానుభూతుల సత్కవిత' వెలువడింది. శ్లీరామనాథ్ గారిక్కడ 26 చరణాల చంపకమాలిక తో ఆ కవిత నావిష్కరిస్తారు.

ఇది యొక గ్రామ వీధి, నవ హేలల కౌముది విస్తరించు కొన్నది యణువణ్వు నందు.....

సుఖము లోనూ, దుఃఖము లోనూ, జీవితం లోని భిన్న భిన్నాంశాలు వరుసకట్టి జ్ఞప్తికి రావడం సహజమే.

.... కంట తడి గాలములెన్నియొ మ్రింగి గొంతులో నదిమిన సంగతుల్; కథలు, యాత్రలు, రాత్రులు, దిగ్దిగంత శ
స్త దురితసంఘ భంగిమల చాయలు, మోజులు, దంభనాళి, ష
ట్పద సుమ వాటికా గిరు, లపాంపతు, లాప్తులు, శత్రువుల్, వ్యథల్,
పదములు, నవ్వులన్ పులుము పాపపు గెల్పులు, యుద్ధముల్, మిషా
స్పద కటుభాష్యముల్, తెరలు, వ్యాళములున్ .....

ఈ కలతలన్నీ కవి వైయక్తికము కావు. సామాజిక, చారిత్రక సృతులలో తల్లీనమైనపుడు ఇవన్నీ కవికి ఆంతరికమైన ఘర్షణలుగా మారుతవి. 'పాపపు గెల్పులు, యుద్ధముల్' అన్నపుడు భారతం లోన 'రక్తపు కూడు' జ్ఞాపకం వస్తుంది కదా. అయితే వీనికి పరిష్కారంగా -

........................ బరువుల్, విలాస సం
పదలు మనీష నిండు కొన వర్తిలుచున్న యంత ని
య్యది యొక గ్రామ వీధి; యపుడంచిత సత్కవి ప ద్యమేదొ ది
వ్య దయను గుండెను బొల్చె; వికచామల కోమల రాత్రి పుష్పమ
ల్లది నను జూచె నంత కనులార, నవానిల శాబకమ్ము కమ్మదనము తోడుగా నొలసె, .....

'దీర్ఘ విటపాంచల సంచలదామ్ర వర్ణ'ములు, 'అభ్రగమ బాలక నిద్రిత శుద్ధ నేత్రము'లు, శర్వరీ సమయ పుంజిత రంజిత గేహదేశము'లు ఎన్నో మనలను చుట్టుముట్టి దిగ్భ్రమ కలుగ జేస్తవి, మనకీ చంపక మాలికలో.

ఆ కవి కుమారుడు వెన్నెల రాత్రిలో విహరిస్తూ నది ఒడ్డుకు చేరుతాడు.

        అది నదీ తీరము, నిశీధిని; దరి జేరు
        వాతముల, తరంగముల, భావముల నడుమ
        నిలిచె నా భావుక తపస్వి - కొలవలేని
        కవిత లీ రీతి వరుసలు కట్టెనపుడు....

        ఈ యీహా మసృణత్వ మెంతటిదొ కానీ, యూహలే పాటలై
        పోయెన్; లోబడి చంద్రకాంతికి నిశామోహమ్ము పై పై  వృథా
        మాయాంధ్యమ్ము నపాకరించు వెరవై మార్గమ్ము చూపించె, వి
        ద్యాయామమ్మిది సర్వతోముదము, కాంతా! పద్యముల్ బల్కనా!

ఈహా మసృణత్వము - ప్రౌఢ ప్రయోగము. ఈహ - కోరిక, కాంతి కిరణము, మసృణత్వము - స్నిగ్ధమైనది, మార్దవము. కవి హృదయానికి, వెన్నెలకు సమానంగా వర్తించే విశేషణము.

అలా పరవశించిన కవి నుండి ఒక పద్యధార  జాలువారినవి. ఈ పద్య కవిత లో రూపకోత్ప్రేక్ష లున్నవి, ఉక్తి వైచిత్రి యున్నది, తాత్త్వికతా ఉన్నది.

        మల్లీ గుచ్ఛములై పదమ్ముల కడన్మార్కొన్న ఫేనమ్ము, లు
        త్ఫుల్లాంతఃకరణమ్ముతో జగములన్ బోషించు చిచ్ఛక్తి, హ్రీ
        వల్లీవేల్లిత కావ్యకాంత యెదలో, బంగారు పద్యమ్ములున్జ
        ల్లించెన్ సుమనస్వి చిత్తములలో జాడ్యాది మాలిన్యముల్.

పాదాలను తాకుతున్న నీటి తరగలు మల్లెపూ బొత్తుల వలె నున్నవి. 'చిచ్ఛక్తి హ్రీ వల్లీ వేల్లిత'  - 'హ్రీం' శక్తి బీజము (హ్రీంకారావాల వల్లర్యై నమః- త్రిశతి). ఇక్కడ కావ్యకాంతకు సరస్వతీ దేవికీ అభేదం చెప్పబడుతున్నది. 'జల్లించెన్ ...జాడ్యాది మాలిన్యముల్' - 'సరస్వతీ నిశ్శేష జాడ్యాపహా' స్మృతికి తెస్తున్నారు.

        కలిత రిరంసా సమభవ
        లలితాలంబన, మనంత లావణ్య గుణో
        జ్జ్వల, మధికతమానందాం
        చల కమనీయమునగు కవిశక్తి నిలుచుతన్.

కవికి అప్రయత్నంగానో, సప్రయత్నంగానో దేవ్యారాధన సంబంధితములైన వాక్కులే వస్తున్నాయి. రిరంస, లలిత, లావణ్య (శేవధి), ఆనందాంచలము అటువంటివి.

ఆ మరునాడొక సాహితీ సదస్సు జరుగ నున్నదన్న వార్త కవికి తెలియవచ్చింది.

కావ్య ప్రయోజనాలను ఎన్ని విధాలుగా నిర్వచించినా కావ్యరచన వల్ల  వచ్చే యశస్సు కూడా ఒక ప్రధానమైన లక్ష్యమన్నది నిర్వివాదమైనది. ఈ యశస్సు కవి యొక్క అహం వృత్తిని తృప్తి పరచేది మాత్రమే అని భావించకూడదు. సహృదయులైన పాఠకులను కావ్యం రంజింప చేయగలిగినపుడు మాత్రమే యశస్సు వ్యాపిస్తుంది. ఆప్పడు కవి తన శ్రమ సార్థకమైనదని, తన ఆనుభూతిని ఇతరులతో పంచుకోగలిగినాన్న సంతృప్తి ని పొందుతాడు. ఆ అనుభూతిని పంచుకోవడంలో పాఠకుని మనస్సు భౌతిక కష్మలాలను వదలి ఒక పై స్థాయి కెదుగుతుంది - అదే రసానందమనవచ్చు. కావ్యసృజన కవికి ఒక చైతన్య భూమిక నుండీ అవరోహణ అవుతే, పాఠకుని కావ్యానందము ఆరోహణ అని శ్రీరామనాధ్ గారంటారు.

ఈ విధంగా కవి యశో కాంక్ష  తన కృషి సఫలమైనదనుకొనేందుకు పర్యాయపదము. కవికులగురువు కాళిదాసు 'కవి యశః ప్రార్థీ' అనడం లోనూ ఇదే రహస్యము.  ఆలంకారికులు 'కావ్యం యశసే౽ర్థకృతే.. ' అని యశస్సునూ ఒక గమ్యంగా అంగీకరించారు. నన్నయ 'సత్సభాంతర సరసీ వనంబు'లను కొనియాడడమూ యశఃప్రాప్తి కొరకే.

కనుక మన కవి కుమారుడు 'కవివర ధీమయ పండిత యుత'మైన సభలో తన కవితను వినిపించదలచడం స్వాభావికమే.

        ఆ కలయికలో బఠియింప నభిలషించి
        యల్లుటకు బూనె బదివన్నెలారు కవిత
        పదకుసుమమాలలౌ పద్యముల న
        వారిత ప్రబంధ సుగంధ బంధురముగ.

బహుధా శ్రమించి -

...... ఆరాటపడి, యొక యింత యంత
రాత్మ పదముల నొలికింప వ్రాసె పద్య
ములను ప్రేమాశుత ఫలించి ముంచివేసి
మేని యందు ప్రతి కణము మేలుకొనగ.

ఇది మరొక రహస్యము. 'మేని యందు ప్రతి కణము మేలుకొనగ' - అట్టి ప్రత్యగ్రప్రసవాభిముఖమైన చేతనావస్థ నుండే కవిత్వ సృష్టి జరుగలదు.

కావ్యగానము -

        గంభీరమ్మగు గొంతుతో, నలత రాగక్షేమ వైచిత్రితో
        నంభోజమ్ముల వంటి పద్యముల వాగర్థ ప్రభల్ బొల్చు వి
        స్రంభ ద్యోతకమౌనటుల్ చదివె వాచాంభామినీ సేవనో
        జ్జృంభాహ్లాదితుడై సదస్యుల హృదాశ్లేషమ్ము కాంక్షించుచున్.

హృదాశ్లేషము - తన కవిత శ్రోతల హృదయములను తాక వలెనన్న కోరకతో.

శ్రీరామనాథ్ ఆ కవి పఠనాన్ని హృదయంగమంగా వర్ణిస్తున్నారు.

.... పాలు పొంగిన యట్లు, బాలెంత నవ్వివ
యట్లు, పర్వచ్ఛవులాడినట్లు
కమలకన్యక జలకణముల విదలించి
నట్లు, గోధూళి తారాడినట్లు
కవిత పఠియించినాడు సాకారపరచి ...

కాని, ఆ సభ 'మహిత శూన్యము' - సహృదయులైన శ్రోతలు లేనిది.

కావ్యగానము తర్వాత పండితులు తమ అభిప్రాయం వెలిబుచ్చుతారు.

ఒక పండితుడు 'చాలా కాలం తర్వాత పద్య కవిత వింటున్నాము - 'రూవు రేఖల వినూత్నత యవసరము నేడు', ఈ కాలానికి తగినది కాదని ధ్వనించాడు.

మరొక భాషా శాస్త్రవేత్త 'మీ కవిత యందుతెలుగును మ్రింగివైచు, సంస్కృతపదముల్ కలవయ్యె చట్టుబండ' లనినాడు.

మరొక సాంకేతిక వేత్త , మనుజుల కన్నా ఘనమైన పద్యాన్ని కృత్రిమ మేధ సృష్టించగలదని ఒక  పద్యాన్ని చదివాడు.***

మరొక కవి ఒకచోట అఖండయతి పడిపద్యము లోని 'మధురిమను హరించె'నన్నాడు.

మరొక శ్రోత కవిత్వం వల్ల సామాజిక హితం చేకూరాలన్నాడు.

అన్ని విమర్శలనూ కవి మందహాసంతో విన్నాడు. అర్థరహితమైన మరొక పద్యం చదివినపుడు 'ఇదీ నవీనమైన కవిత' అని ఒక కవిమిత్రుడు మెచ్చుకొన్నాడు.

తుదిని కవి అనుభూతి -

        ముగిసెను మేళనమ్ము,; చిరుమువ్వల శయ్య సృజించువాని గుం
        డె గుడిని చుట్టుముట్టి బిగడిగ్గె మరొక్క పరాయి పంక్తిగా
        నొగి విపరీత కాలకఠినోపల నిర్మిత రోధనమ్ము, వా
        లుగ ముకుళించుకొన్నయవి లోపలి రేకులు నీరవమ్ములో.

ఆ మేళా లో కవి హృదయకమలం ముకుళించు కొన్నది! 'అరసికాయ కవిత్వ,నివేదనం శిరసి మాలిఖ మాలిఖ' అన్నారు కదా!

శ్రీరామనాథ్ గారి శైలి గురించి చెప్పవలసిన దేమున్నది? వారేవిధంగా కావాలనుకొంటే ఆ విధంగా వ్రాయగలరు. అక్కడక్కడా మనకు పరిచయం లేని పదాలు, పదబంధాలు కనుపిస్తాయి - ప్రజ్ఞాళి,తురీయత, విద్యాయామము, కలవాసన వంటివి. ఒక కొన్ని పద్యాలు ఒకటి రెండు మార్లు చదివితే కాని వారి ఊహను పట్టుకోలేము. కాని, పద్యాలన్నిటా మధురిమయో, తత్త్వభావనయో, హృదయస్పర్శియైన సౌకుమార్యమో ఉంటుంది. ఒక్కొకచే వారికి పద్యం ఓక హేలగా ఉంటుంది. చూ.

        కెరలు వాని నయన జీవ కేంద్రముల గ
        విత్వ కళలూరు, చెలువారు విద్య జాలు
        వారు, విరితీరు లెగబారు; నారితేరు
        సౌరు ముడిదేరు, సిరితీరు, హోరులారు.

మాధురీధురీణమైన ఈ లఘుకావ్యం చదివిన తర్వాత ఒక చిన్న అసంతృప్తి మిగులుతుంది. అది కవికుమారుడొక నిరాశాదృక్పధంతో మిగిలి పోవడం. 'కుకవి నింద యప్రశస్త పథ'మైనట్లే, కువిమర్శకులను కూడా దూరంగా ఉంచాలి,  లేదా వారిని ఉపేక్షించాలి. సుకవిని మెచ్చేవారెపుడూ ఉంటారు,  'కాలోయం నిరవధిః..'

అయితే ఆశా కిరణం భరతవాక్యంలో కనుపిస్తుంది.

        ఏమోలే! మృదులాంతరంగము మృషా హేవాకలోకమ్ములో
        నామోదమ్మయి శాంతి వల్లరుల నాశాంతమ్ములం దాక సు
        శ్రీమార్గమ్ముల బ్రాకజేసి తగు వాసిం గాంచునేమో, సుమ
        స్తేమమ్ముల్ విలువైననాడు పునరుజ్జీవింతురేమో కవుల్.

కవుల ఉజ్జీవనానికి భంగపాటు లేదనడానికి పరిమి శ్రిరామనాథ్ గారే తార్కాణం. వారి నుండి మరిన్ని రాగరంజితమైన కృతులు వెలువడగలవని ఆశిద్దాం!

"జయంతి తే సుకృతినో రససిద్దా కవీశ్వరా, నాస్తి తేషాం యశః కాయే జరామరణజం భయం"

............................

** రాయప్రోలు సుబ్బారావు గారి రమ్యాలోకము నుండి విశ్వనాథ సత్యనారాయణ గారి కావ్యానందము వరకు కావ్యలక్షణములకు అలంకారశాస్త్రముల వలె వ్యాఖ్యా ప్రాయమైనవి, కవి హృదయ స్పర్శ వానిలో ప్రధానాంశ కాదు.

*** కృత్రిమ మేధ (జెమిని) నుండి ఉత్పన్నమైన పద్యం

"అలరున్ దేశమునందు శాంతి సుఖముల్, ఆనందముల్ నిత్యమున్,
కలహంబేమియు లేక మిత్రతలతో గల్గున్ జనుల్ నెమ్మదిన్,
జ్వలనం బేమియులేక జ్ఞానముననే జాలిన్ దలంచెన్ జనుల్,
వలపున్ ప్రేమయు నిండి, ధర్మపథమే వర్ధిల్లు గాకన్, సదా!"

గణయతి బద్ధమే కనుక ఇదీ కవిత్వమే అనవచ్చు *('కొయ్య బొమ్మలు మెచ్చు వారలు'!).! 


**

This essay was published in Sri Chandrasekhar garu's FB Wall -https://www.facebook.com/chandrasekhar.cheerla/posts/pfbid02cK1iw7C4kHvtLqKuezbKXzD6ZPVf4VTqAndQ4NkEXwkM8PojqaNEa4XWRtasVWZgl

2 comments:

  1. అభినందనలు. కవి సన్మానము ఇంత చిన్న వయస్సు లో పొందడము పూర్వ జన్మ సుకృతము పెద్దల ఆశీర్వచనము మరియు సరస్వతీ దేవి కరణా కటాక్షము. విశ్లేషణ చాలాబాగావుంది. కవితాసారాన్ని రుచి చూపించి, ఎప్పుడు చ దువుతామా అనె ఉత్కంఠత నెలకొల్పినారు.
    శుభాశీస్సులు.🎉🙏🍒

    ReplyDelete
  2. కరుణా

    ReplyDelete