మాత్రాఛందస్సులలో అత్యంత ప్రసిద్ధి పొందినవి చతుర్మాత్రల జాతి ఛందస్సులే అని చెప్పాలి. ఈ చతుర్మాత్ర గతి ఉన్న గీతాలు వినపడని రసపిపాసుల చెవులు ఎక్కడా ఉండవు. 'చందన చర్చిత నీలకళేబర పీత వసన వనమాలీ' అని గీతగోవిందకారుడు దివ్యలోకాలలో ఉన్న కవితాకన్యని క్రిందకి దింపి నాట్యం చేయిస్తున్నపుడూ, వల్లభాచార్యుడు 'అధరం మధురం నయనం మధురం' అంటూ తీపి తేనెకే కాదు, కృష్ణవర్ణన చేసే గీతికీ ఉంటుందని నిరూపణ చేసినప్పుడూ, శంకరులు 'భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే' అని భవ్యబోధ సలిపినపుడూ ఈ నాలుగు చిటికెలంత పొడుగైన మాటలే వారికి ఊతమయ్యాయి.
ఈ చతురస్ర గతి కవితకీ, పాటకీ సమస్థితి అని నా ఊహ. కల్పన చేయడంలో, నాలుగుకి సరిపోయే గతులు యేవైనా యేకతాళంలో ఆవృత్తిని కలిగించి, వినసొంపుగా ఉంటాయి. ఆవృత్తిని కలిగించడానికి పదం తరువాత పదం ఒకదానివెంట రావాలన్నది అవసరం కనుక, ప్రతీ పదంలోనూ ఉండవలసిన అక్షరాలు కనీసం రెండని తీసుకుంటే, సంధి ద్వారానూ, సమాసం ద్వారానూ పదాలు కలుపబడుతూనే, విడివిడి పదాలూ ఉండటానికి ప్రతీ పదంలోనూ నాలుగక్షరాలుండటం సరైన సంఖ్య అవుతుంది. ఐదు దీర్ఘ సమాసాలకీ, రెంటికి మించి సంధులకీ దారితీసి నిడివి పెరుగుతుంది. మూడులో సంధికి అవకాశం ఎక్కువ కనుక సులభత్వానికి అవకాశం తక్కువ. అందుచేతనే ఈ గతిలో సంస్కృతంలో ఉత్కృష్టమైన సాహిత్యం సృష్టించబడింది. తెలుగులో నిడివి గల పదాలు ఎక్కువే కనుక, ఇక్కడి కవులకి పంచమాత్ర, షణ్మాత్రలతో విడివిడి పదాలతో కవితాసృష్టి చేయటానికి అవకాశం దొరికింది. అయితే శ్రవణం చేయడానికి తెలుగులోనూ చతురస్రగతి ఎంతో అందంగా ఉంటుంది. ఈ చతుర్మాత్రగతి రగడలో రచన చేయబడిన అలమేలుమంగాదేవిమీద స్తవమొకటి చాటుపద్యమణిమంజరిలో ఉంది. ఇది జానుతెనుగునీ, ఆంధ్రాన్నీ కలబోసుకున్న కవిత. అర్థం తెలియకపోయినా, కేవలం చదవడం చేతనే మనసుని ఊయలలూపే శక్తి మాత్రాఛందస్సులలో ఉంది.ఈ కవితకీ అదే వర్తిస్తుంది. ఈ కవిత కూర్చబడిన గతికి హరిగతి రగడ అని పేరు.
అలమేలుమంగాస్తవం నన్ను అమితమైన కావ్యానందానికి లోను చేసింది. తెలుగులో వేంకటేశుని ఇల్లాలిమీద ఇటువంటి కవితని నేను ఇంతవరకూ చదివి యెరుగను. ఇంత అందమైన గతిలో ఉన్న ఈ అపురూపాన్ని సంగీతజ్ఞులెవరైనా పాడుతుంటే వినాలనిపిస్తోంది. 'మాం దీనమనాథం పాహి రమే, మకుటాలంకృత కల్పకకుసుమే!' అన్న పంక్తికే ఈ అజ్ఞాతకవికి అక్షరలక్షలు ఇవ్వాలని అనిపిస్తోంది.
ఇందులోని గొప్ప పాదాలని ఏరలేక, కవితమొత్తాన్నీ ఇక్కడ యెత్తి వ్రాసి, అనువాదం చేస్తున్నాను.
.
సిరి నెఱి నీలపురంగుబెడంగుల - చిన్నరి పొన్నరి పెన్నెఱితురుమును
మురువగు పాపటచుక్క నుచుక్కను - మొత్తపు ముత్తెపు సరిసిందురమును
నుదయారుణకరబింబ ప్రతిబిం - బోద్యద్ధగధగితశిరోమణియును
ముదురరచందురు నుదురు చలములన్ -మొలచెనొయన జనుముఖతిరు మణియును
పచ్చల రచ్చల బొగడల మొగడల - పజ్జలసజ్జల వజ్రపుమురువును
విచ్చలవిడి విడి కెంపులమంపుల - విరివినెరవుకొను బవిరెలహరువును
మగరా కమ్మలకళ్కులతళ్కుల - మలచిన చక్కని చెక్కుల పెక్కును
పగడపు జగడపు మోవిసుపాణియు- పసిమి మిసిమిగల ముక్కరనిక్కును
చంపకసుమ పరిహాసిక నాసిక - చక్కందనముల నింపగుసొంపును
యొరపుగఁ బరపుగ దయకుదయంబై - యెలపుసొలపుదగు చూపుల కోపులు
మురిపెపు ముచ్చట ముసిముసినగవుల - మొలచిన చిలుకలకలుకుల ప్రోవులు
కులుకు కలికివాలుందెలి గన్నుల - కొమరుల మరుతామర నగుమోమును
అల చిందము చందము గల గళమున - నమరిన మంగళసూత్రపు గోమును
తుదలమొదల సిరిమేలగు జతనల - దొల్కుకళ్కుకుతికంటుత్తండలు
ఉదిరిపసిఁడి మొగ్గలనిగ్గుల జ - గ్గొందగఁ బొందగు సందిటిదండలు
వలయపు సొలపుల ఝుణఝుణరవముల - వలనవలనమగు శ్రీహస్తమ్మును
జక్కవనడకల చన్నుంగవపై - సౌరై తీరై తగుహారమ్ములు
చిక్కఁగ జక్కఁగ మేనంబూసిన - సిస్తగు కస్తురి గాంబూరంబును
నవనిధులును గల శ్రీవర్ణనక - ర్ణముల నెదుర్కొను మణి భుజకీర్తులు
సవరణ జల్ తార్ రైక నలుపు పై - చాందిన చక్కని పతిమలమూర్తులు
చివ్వున నాభి బిలమ్మున వెడలిన - చీమల చాలనఁ దగు నూఁగారును
చివ్వకు నాకౌ నీకౌ నని బలు - సింగముఁ జెనకెడు కౌనుందీరును
మెచ్చుల కుచ్చెల నెరిపై నొరపై - మేలఁగి చెలఁగు మణికాంచీదామము
గ్రుచ్చుకొనఁగ మానికమున్ జెక్కిన - కొలుకుల యొడ్యాణపుబలు సీమము
కిసమసనిసుమున్ దీవులఠీవులఁ - గేరు తీరుపిరుదరుదు నొయారము
మినుకుమినుకుమని కదలిన మెరసెడు - మెఱుఁగు టొయారపుటూరుల బీరము
నందంబు హళాహళికాహళి యఱ - పఱఁదఱమిన జిగిబిగి చిఱుఁదొడలును
కెందామరలన్ గని తా మరలన్ - గెలచిన మృదుపదముల నిలుకడలును
చిటిపొటివ్రేళ్లన్ జిటుకు పొటుకు మనఁ - జిటికెడు మట్టపు మట్టెల భంగులు
పెటుకున జిలిబిలి గలిబిలిగల బొ - బ్బిలి కాయల నిబ్బరపు టెలుంగులు
బడిబడి గలుగలు గల్లన మొరసెడి - బంగరుటందియ కవసింగారము
నడుగుల పైఁబడు బడుగులగాచుట - కయిపెట్టిన గండర పెండారము
శతకోటిరతిప్రతిభాభాసుర - సౌందర్యపుఁ దిరుమేని విలాసము
సతతానత సంరక్షణదీక్షా - సంరంభ సమగ్రసముల్లాసము
కలిగి చెలఁగు శ్రీ వెంకటనిలయుని - ఘన వక్షస్థల సింహాసనమున
నెలకొని యలమేల్మంగాదివ్య వి - నిర్మలనామమునందగు ప్రియమున
సకల జగమ్ముల బొజ్జను నిడికొని - సాకిన తల్లిని నినుఁగొనియాడెద
ముకుళితకరకమలుఁడనై నీకున్ - మ్రొక్కెద నిఁక నా లేములు వీడెద
మాం దీన మనాథం పాహి రమే - మకుటాలంకృత కల్పకకుసుమే
మాం దేవి కృతార్థం కురు పరమే - మంజులచంద్రస్పురదురుసుషమే
తుభ్యం మంగళ మార్తశరణ్యే - తుభ్యం మంగళ మభిజనగణ్యే
శ్రీ వరలక్ష్మీ జనని నమస్తే - క్షీరాంబుధి సజ్జనని నమస్తే
భవభవాబ్జజ జనని నమస్తే - పాహి మాం జగజ్జగని నమస్తే.
~
సిరులొలికిస్తూ నీలిమ అతిశయించే అందాల జడకొప్పు,
సుందరమైన పాపటచుక్కని ఉచుక్కనిపించే మంచిముత్యంతో పోలిన కుంకుమ బొట్టూ,
ఉదయాన్నే ఉదయించే అరుణబింబానికి ప్రతిబింబంలా ఉదయించిన ధగద్ధగల
శిరోమణి,
ముదిరిపోయిన అరచందురుడిలాంటి నొసటిమీద మొలిచిందా అన్నట్లున్న తిరుమణీ,
పచ్చలు కలహించుకుంటూంటే వాటి మొగ్గలలాంటి అంచుల దగ్గర హొయలుపోతున్న
వజ్రపు జిగులూ,
స్వేచ్ఛగా యెర్రని పద్మరాగమణులని విరివిగా పొదువుకొని వన్నెలు చిందే బవిరెల
అందమూ,
వజ్రపు కమ్మలలో కాంతుల తళ్కులతో మలచిన చక్కనైన పొదిగింపులూ
పగడంతో యుద్ధంచేసే క్రిందిపెదవి మీదకి ఊగుతున్న ముత్యమూ, పసుపువన్నెతో
అలరారే ముక్కెరా,
సంపెంగని పరిహసించే నాసిక ఇంపైన సొంపులూ,
విలాసాలతూపులతో కరుణకి ఉదయమైన చూపుల రమణీయతా,
మురిపాల ముచ్చటలతో ముసిముసి నవ్వులతో మొలిచిన చిలుకల మాటల గుంపులూ,
శృంగారకలితమైన నిర్మలమైన వాలుకళ్లలో అందాలమరే నవ్వుముఖమూ,
శంఖంలాంటి గళం చుట్టూతా అమరిన మంగళసూత్రపు గోమూ;
మొదలూ చివరా సిరులు కురిపించే మెడలోని బంగారపు కడ్డీలూ;
బంగారు కాంతులతో మెరిసిపోయే అరవంకీలూ,
గాజుల కదలికల ఝణఝణరవాలతో చలించే శ్రీహస్తమూ,
చనుదోయిపైన అందంగా తీరిన హారావళీ,
శరీరమంతా లేపనం కాబడిన కస్తూరీ, కర్పూరమూ;
నవనిధులూ ఉన్న వర్ణనల కర్ణాలని యెదుర్కొనే మణిభుజకీర్తులూ;
సవర్ణమైన జలతారు నీలిరంగు రవికమీద చిత్రించబడిన చక్కని ప్రతిమలూ,
చివ్వుమని నాభి బిలంలోకి వెళ్లిన చీలమగుంపులా ఉన్న నూగారూ;
గొడవకి సిద్ధపడి నీదో, నాదో తేల్చుకుందామని సింహాన్ని యెరిదించే నడుము తీరూ;
సుగుణాల కుచ్చెళ్లపైన వంకరగా ఒరుస్తూ మెలగే మణుల మొలత్రాడూ;
గుచ్చుకుంటూ మాణిక్యాలతో చెక్కబడిన ఒడ్డాణపు పళ్ల నునుపూ;
ఇసుకతిన్నెల ఉత్సాహాన్ని ఆపివేసే పిరుదుల ఒయ్యారమూ;
మినుకుమినుకుమంటూ కదలగానే మెరిసే ఊరువుల గర్వమూ;
ఎర్రతారమరలని చూసి, తాను మళ్లీ గెలిచిన మృదుపాదాల నిలకడలూ;
చిన్ని వ్రేళ్లపైన చిటికెడంత ప్రకాశించే మెట్టెలూ;
బొటనవేలికి పెట్టుకున్న ఆభరణపు కాంతుల పెల్లులూ;
ఘలు ఘల్లుమంటూ శబ్దంచేసే బంగారు అందియ సింగారమూ;
తన పాదాలమీద పడే బడుగులని రక్షించడంకోసం పెట్టుకుందా అన్నట్లున్న
గండపెండేరమూ;
కోటిమంది రతీదేవులతో సమానమైన కాంతికలిగిన ఆ తిరుమేని విలాసమూ;
ఎప్పుడూ శరణుజొచ్చేవారిని రక్షించే వేగిరపాటుతో కూడిన సమగ్రమైన సముల్లాసమూ;
వీటితో శ్రీవేంకటనిలయుడి వక్షస్థలమనే సింహాసనమ్మీద నెలకొని,
సకలలోకాలనూ నీ కడుపులోపెట్టుకుని కాపాడే అలమేలుమంగా! నా తల్లీ! నిన్ను
కొనియాడతాను.
ముడిచిన చేతులతో నీకు మొక్కుతాను.
నా లేములన్నీ విడిచిపెడతాను.
అమ్మా, దీనుడినై, అనాధనైన నన్ను రక్షించు! మకుటంమీద అలంకరించుకున్న
పారిజాతపుష్పాలు కలదానా!
నన్ను కృతార్థుడిని చేయి!
మంజులమైన చంద్రుడిలాంటి శోభకలదానా,
నీకు మంగళమగుగాక!
అధిగతపుణ్యా! అతిలావణ్యా!
ఆర్తశరణ్యా! అభిజనగణ్యా!
నీకు మంగళమగుగాక!
క్షీరాంబుధికీ, సంసారానికీ,
శివుడికీ, బ్రహ్మదేవుడికీ తల్లివైన నీకు నమస్సులు!
వరలక్ష్మీ! జననీ, జగజ్జననీ!
పాహి మాం!
*
(Image is a painting by Sri BKS Varma)
No comments:
Post a Comment