నిరంతరరామకథామననంతో మాధుర్యపరమసీమలను నేలకు అవతరింపజేస్తున్న ఆచార్య, ఆచార్యాని శ్రీమతి రమాదేవి గారు "హృదయావి" కావ్యం పై వ్రాసి ఇచ్చిన చల్లని స్పందన ఇది. వారికి అనేకనమఃపూర్వక ధన్యవాదాలతో మీతో పంచుకుంటున్నాను.
హృదయావి - పరిమి శ్రీరామనాథ్ గారి ఈ కావ్యం శాంత సుందరం. ఆసాంతం రసప్లావితం!
ఈ కావ్యంలో, కవి హృదయ శ్వాస, హృదయ తాపము,పరివేదన,ఇన్నిటిని మించి, శాంత రసంలో పరిసమాప్తం చెందడం చూస్తాం - అన్ని రసాలకు గమ్యం - శాంతం! సర్వరస పర్యవసాన భూమి . ప్రశాంతమైన అలల నీటిలో ఈదులాడుతున్న హంసద్వయం ముఖచిత్రంపై . ఈ చిన్ని పొత్తం నన్ను చేరి చాలా రోజులయినా పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నానే గానీ ప్రియమారా చదవడానికి కాస్త వెనకా ముందూ అవుతూ వస్తున్నాను, నేను చదవగలనన్న నమ్మకం కలగకపోవడంతో.
ముఖచిత్రం సూచించిన విధంగానే , రెండు పరమహంసల ధవళ శాంతి పరుచుకున్నదీ కావ్యం నిండా. ముందుగా చెప్పవలసిన మాట ఈ కావ్యానికి వారు వ్రాసుకున్న ' ఒక మాట' గురించి. "ఒకమాట" చదువుతూనే మనసులో కలిగిన భావం, గాఢత సాంద్రత అంతర్లీనత దండిగా కలిగి ఉన్న కావ్యమిది అని.
ఒక కవిత పుట్టవలెనంటే కవి ఎంత అంతర్మథనం చెందుతాడో , ఎంత ఎత్తులకు,elemantal proportion కి ఎదగవలెనో , తటిత్తువలె స్ఫురించిన బ్రహ్మానంద సహోదరమైన ఆ రసానుభూతిని అక్షర రూపంలో నిలిపే ఆ పవిత్ర యజ్ఞాన్ని ఒక దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసిన విధంగా నిర్వర్తించవలసి ఉంటుందో , అంత అంతర్మథనాన్నీ ఈ కవి అనుభవించి ఈ కావ్యరూపంలో మనకందించారు , అని ముందుగా నాకు తోచిన భావం. పరిమి శ్రీరామ నాథ్ గారు కవి, పండితులు, సహృదయులు. ఈ మూడు గుణాల సృష్టి వీరి 'హృదయావి ' సాగర గంభీరమైన విషయాన్ని , తన హృదయ పరివేదనను, ఆ తాపాన్ని, ఆ తపస్సుని, ఆ తపనని - (అన్నం నీళ్ళు గుర్తుకు రాని స్థితి - బల అతిబల విద్యలు పట్టుబడినట్లు, ఒక చోట కాలు నిలవనీయని తపన, ఏ నొప్పి తెలియని స్థితి - వారే చెప్పినట్లుగా -
"నక నకలాడు కడుపు లె
క్కకురాదు, పెరవిషయములు కానబడవు గుం
డెకు నే నొప్పి తెలియ దత
నికి సంకల్పము కృతికి యనెడు తహతహలో "; )
ఏవం విధ తపస్సు, కవి హృదయంలో ప్రోది చేసిన సత్త్వ సంపత్తిని , ఆ సత్త్వ సంపత్తి ఒక నిశ్చల గుణమై సృష్టించిన శ్రేయో దాయకమైన కావ్యం గురించి, అటువంటి కావ్యం చేకూర్చగల ప్రయోజనం గురించి అనుభవించి వ్రాసిన కవి ఈ కాలంలో బహు అరుదు అనడంలో ఏ మాత్రం అతిశయం లేదు.
ఇటువంటి అపురూపమైన కావ్యాన్ని చదివి పునీతులమై మనమూ రసానంద లోకాలలో విహరిస్తుండగా మన రెక్కలు విరిచే మాటలు, నడమంత్రపు మనుషుల నలుగురి మాటలు , ఆ మహత్వపూర్వమైన కావ్యాన్ని గురించి విని మన మనసు, క్షోభిస్తుంది.
"ఏమోలే! మృదులాంతరంగము మృషాహేవాకలోకమ్ములో
నామోదమ్మయి శాంతి వల్లరుల నాశాంతమ్ములందాక సు
శ్రీ మార్గమ్ముల బ్రాకజేసి తగు వాసిం గాంచునేమో,సుమ
స్తేమమ్ముల్ విలువైననాడు పునరుజ్జీవింతురేమో కవుల్ "
అని అనగల ధైర్యం, ఓర్పు, ఆశ కలిగిన ప్రశాంత మనస్కుడు ఈ కవి. (ఈనాడే కాదు, త్రేతాయుగంలోనే వాల్మీకి మహర్షికి కూడా 'శ్రోతవ్యమనసూయయా ' అని అడగక తప్పలేదు. వారి ప్రియశిష్యులు, కాళిదాసు, కాస్త గడసరి వాడవడంచేత, "తం సంతః శ్రోతుమర్హంతి సదసద్వ్యక్తి హేతవః, హేమ్నః సంలక్ష్యతేహ్యగ్నౌ విశుద్ధిః శ్యామికాऽపి వా " అని చెప్తూ, అట్లా ఇట్లా మనుషులకు కాదు ఈ నా కావ్యం , సజ్జనులు మాత్రమే అర్హులు , అని ఒక హెచ్చరికను వ్యంగ్యంగా అంటారు.")
అంతటి తిరస్కృతి అనాదరము ఈ కవిని తాకినా, నొచ్చుకొనని వారి మనఃస్థితి ఎంతో పరిణతి చెందిన పరమ శాంత స్థితి! అన్ని కువిమర్శలు విని కూడా - "తల యూచి" నవ్వగల కవి. తను "అమలరోచి" కనుక. ఇటువంటి కవిని , వారి స్థాయిని , గొప్ప పండితులు సహృదయులు, తాత్వికులు మాత్రమే అందుకోగలరేమో ! ఇంతటి విలక్షణమైన విశిష్టమైన అమోఘమైన కావ్యాన్ని, మహామహులు సాహిత్య మేరు శిఖరులు , ఆచార్యులు డా. ఏల్చూరి మురళీధరరావు గారే గాఢశైలి' అని చెప్పబడిన ఈ కావ్యం గురించి చెప్పడం నా శక్తికి మించిన పనే అయినప్పటికీ ధైర్యం చేసి కృతజ్ఞతా పూర్వకంగా ఒక నాలుగు మాటలు రాస్తున్నాను, ఎంతో సప్రశ్రయంగా శ్రీరామ నాథ్ గారు మా దంపతులకు దేవీ నవరాత్రుల కానుకగా ఈ కావ్యాన్ని పంపినందుకు . నిజం చెప్పాలంటే, ఈ పుస్తకానికి వారి ఆ "ఒకమాట" చాలు. చాలా కాలం తర్వాత మళ్లీ మా నాన్న గారి మాటల్నీ వారి భావాలనీ వారి చూపునీ వారి దృష్టి కోణాన్ని గుర్తుకు తెచ్చే విధంగా అనిపించింది.
ముందు మాటగా వ్రాసిన వారి "ఒకమాట"లో మొదటి వాక్యం - " కావ్య జగత్తులో పఠితలందరూ ఒక గుంపూ రచయితలందరూ మరొక గుంపూ కాదు. ......జీవ ప్రాకృతిక తత్త్వాలను ఒకే విధంగా ఇముడ్చుకోగలిగే రసప్రవృత్తి అందరిలోనూ ఒకటే " అన్న వాక్యం, వారి సద్భావనకు అద్దం పట్టే వాక్యం. భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఒక మాట అంటాడు - "సూత్రే మణిగణా ఇవ" అని. మనలనందరినీ మణి సదృశులుగా భావించాడంటే ఆయనదెంత సహృదయత, మనపై ఎంత అవ్యాజమైన ప్రేమ కరుణ! అట్లాగే ఈ కవికి కూడా మనపై, మన పాఠకుల సహృదయతపై ఎంత నమ్మకం! ఎంత గౌరవం!
"ఒకమాట"లో మరొక ముఖ్యమైన వాక్యం - " సంగీతం లోని రాగాలు అతీంద్రియ రసలోకం నుండి భౌతిక ప్రపంచానికి అవతరించినట్టుగానే కవితావతరణమూ జరుగుతుంది.ఈ ప్రసారంలో కవిది అవరోహణ మార్గం, చదువరిది ఆరోహణ మార్గం. అంతే తేడా" అన్న ఒక గొప్ప వాక్యం. ఈ అవరోహణ ఆరోహణ మార్గం గురించి ప్రస్తావించడం నాకొక విషయాన్ని స్ఫురింపచేస్తోంది. మా నాన్నగారు, మా అమ్మ గారిని, మమ్మల్ని (ఆడపిల్లలమయినా) , గాయత్రీ మంత్ర జపానికి అర్హులే అని భావించి మీరూ గాయత్రీ మంత్ర జపం చేయవచ్చు అని చాలా సార్లు అంటుండేవారు, జపంగా చేయకపోయినా, ఆ మంత్రార్థాన్ని భావించమంటూ చెప్తూ ఒక విషయం ప్రస్తావన చేయడం నాకు గుర్తు. అదేమంటే అక్షరాలు అలవాటయ్యేవరకు ప్రతిదినం తల్లి తండ్రులు పిల్లల చేయి పట్టుకుని ఆ ఆ లను దిద్దించినట్లు, ఆ గాయత్రీ రూప చైతన్యం సప్త వ్యాహృతులను (ఓం సత్యం ఓం తపః ఓం జనః ఓం మహః ఓం సువః ఓం భువః ఓం భూః అనే ఏడు లోకాలను) దాటి అవరోహణ క్రమంలో వచ్చి గాయత్రీ మంత్ర జాపకుడికి తన అమృత హస్తమందించి ఆరోహణం చేయిస్తూ, ఈ ఏడు లోకాలను దాటించి తనతో ఊర్థ్వ లోకాలకు నడిపిస్తుంది అని చెప్పడం.
ఈ వాక్యం చదివిన వెంటనే నాకు గుర్తు వచ్చిన పోలిక అదే.
" కవి చేసే ,చేయవలసిన పని అదే కదా! ఒక బ్రహ్మ వలె , ఒక గాయత్రీ మాత వలె, కావ్య సృష్టి చేసి తద్వారా అవరోహణ క్రమంలో భువికి దిగి వచ్చి పఠితను ఆరోహణ మార్గంలో దివ్య భవ్య లోకాలకు నడిపిస్తాడు, సత్కావ్యానంద లోకాలకు, బ్రహ్మానందం సహోదరమైన లోకాలకు అని అర్థం చెప్పుకోవచ్చు కదా" అని . మనిషిని మనీషిని చేసే ఏకైక మంత్రం గాయత్రీ మంత్రం. (సహృదయులే ప్రమాణం.) అందుకే కవి ఉపనిషత్తు చెప్పినట్లు, మనీషీ, పరిభూః స్వయంభూః-( " కవిర్మనీషీ పరిభూః స్వయంభూః ". ఈశా ఉపనిషత్తు) ఆ సూచననే చేసారు పరిమి శ్రీరామనాథ్ గారు కూడా తన "ఒకమాట" లో.
కవిర్బ్రహ్మ కవిర్విష్ణుః కవిర్దేవో మహేశ్వరః కవిస్సాక్షాత్ పరబ్రహ్మ అని చాటింపు వేయాలనిపించే పద్యాలే ఈ హృదయావి నిండా !
ఒక కావ్యం అంటే ఎట్లా ఉండాలి అని నిర్వచించడానికి, ఎంతో లోతైన విశ్లేషణతో , అవగాహనతో చేసిన రచన వారి హృదయావి - కవి తపించి తపించి ప్రేమతో మన్ననతో కన్న తన కవితకు ఊపిరులూది, ప్రాణప్రతిష్ఠ చేసి లాలించి పోషించి అలంకరించి పూజించి హృదయ కోవెలలో పదిలపరచిన సారస్వత మయమైన కవిత ఈ హృదయావి.
అసామాన్యమైన అపురూపమైన ఒక దివ్యమైన స్థితిలో పురుడు పోసుకున్న కవిత ఈ హృదయావి. కావ్యం పూర్వార్థం అంతా , కవి ఒక తల్లి వలె కంటికి రెప్పలా కాపాడి తన గర్భస్థ శిశువును ప్రసవించి, ప్రాణం పోసి పాలించి పోషించే విధానం ఎంతో అద్భుతంగా అమోఘంగా అపూర్వంగా వర్ణించడం చూస్తే 'అపారే కావ్య సంసారే కవిరేకః ప్రజాపతిః' అన్న వాక్యం అనుభవమవుతుంది. కావ్య సృష్టి ఒక సవనం - విశ్వ శ్రేయస్సు కోసం తపస్సు చేసి, ఒక నిష్టా గరిష్ఠుడైన యాజ్ఞికుడు , కవి బ్రహ్మ, నిర్వర్తించిన బృహద్యజ్ఞం ఇది.
"ప్రశ్నలను ప్రేమ యందు ,విలాసములను
భావి యందు, పరిమితిని భావమందు
దుఃఖమును చక్కదనమందు,దురిత తతుల
బేలతనమున నిరతమ్ము వేల్చునతడు ".
*****
ఎంతో ఆరాటం ఉంటేనే కనగలడు కవి తన కవిత ! ఎంత జాగ్రదవస్థ అతనిది! కనండి మీరూ -
......." ఇటుల నారాటపడి యొక యింత యంత
రాత్మ పదముల నొలకింప వ్రాసె పద్య
ములను ప్రేమాశ్రుత ఫలించి ముంచివేసి
మేని యందు ప్రతికణము మేలుకొనగ"!
ఎంత అద్భుతమైన ఆవిష్కారం! అమృత ధారలవంటి పదాలను ఒలికించింది, తను కాదు, తన అంతరాత్మ! తననుండి వెలువడినది ఒక కవితా రూప దైవీ వాక్! ఈ కావ్యం ప్రారంభమే వెలుతురుతో - ఎంత వెలుగు! చదువరులు " తమసో మా జ్యోతి ర్గమయ" అని అడగనవసరం లేకుండానే తనతో కవి మనలనీ కాంతి లోకాలకు తీసుకెళ్తున్నాడు చూడండి -
"వెలుతురు పొట్లముల్ పవిలి వెండి తనమ్ముల సూనృతాంశువల్
చిలికిన యట్లు సంకలన శేవధి యైన జవంపుచూపుతో
తొలి వలపంత తాకి యెలతూలిక యేలిన చేతి వ్రేళ్ళతో
కళలిడు మేధతో కవి యొకండు గమించె గృహమ్మువైపుగా"
ఈ పద్యంలో కవి అంతర్ముఖుడై, బహిరాకాశపు వెలుగు ను ఆ వెలుగు విరజిమ్మిన సూనృతాంశువులను హృదయాకాశంవైపుకు తిప్పి అతి సుతారంగా ఈక వంటి కలాన్ని సాధనగా చేసుకుని కళను మేధను కలపడానికి ఉద్గమించినట్లు తెలుస్తుంది. ఆయన అప్పటి వరకు ఒకెత్తు, ఇప్పుడు మరొక మెట్టు పైకి ఎదిగిన వ్యక్తి - దివ్యపథం వైపు కు ఆయన నడక , నడత -
"అనిమిషత్వము రెప్పల నాక్రమింప
నడుగుదమ్ముల వేగము లవఘళింప
ప్రావరణపు కొసల్ పరిపరి చలింప
నడచు యతని లోనడతలో నవతలమరె ".
దివ్యత్వపు అంశం ఆయనలో కుదురుకుంటున్నది, ఆయన నడక ఆఘమేఘాలపై భువిని విడిచి దివి దిశగా అడుగులు. అప్పుడు ఆయన మనస్సులో కోటి కుసుమాల లలిత సంస్పందనం, ......
నిన్న పొడసూపి, కళ్ళచెమ్మగా పుట్టి (వాక్కు ప్రకటించ సమర్థత లేని కారణంగా) వెంటనే జీర్ణమయిన భావ తతి తిరిగి ఈనాడు స్పృశిస్తే ఇహ ఆయన్ను అవి ఒకచోట నిలవనీయక పోతుంటే మృదులోక్తులతో ఆ వాణిని ప్రచోదనం చేస్తాడు. ఆ సమయాన ఆయన తన మూల ప్రకృతి చేత సృష్టి సాగు చేసే కామేశ్వరుడు.-
" లోని లోతులలో నుండి తాను తనను
సంతరించి యేకాంతసిద్ధాంత సరణి
పద్యమల్లువేళల, మూలప్రకృతి పాఠ
ములను చల్లువేళల పరిపూర్ణుడతడు ".
మరి అంతే కదా, సృష్టి "సాగు" తోనే కదా అప్పటిదాకా ఒంటరి వాడు, పరిపూర్ణుడయేది. అతనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు,తురీయుడు కూడా తానే.
"అతని చూపులో నే సృష్టి తతులు కలవొ?
అతని తలపులో నే స్థితి గతులు కలవొ?
అతని మనసలో నే లయ జతులు కలవొ?
అతని యాత్మలో నే తురీయతలు కలవొ?".
అంటాడు కాని, ఆయనకు తెలుసు ఏవేవి 'కలవో!' అది ప్రశ్న కాదు, నిశ్చయాత్మకత తెలపడం. కవి అవిశ్రాంత నిత్య కృషీవలుడు -
"యుగములు క్షణములు,క్షణములు
యుగములు తత్పరతలో,వియోగములో సా
గగ కవనరసకృషిని బా
గుగా బ్రతికెడు కవి హాలికుడు వాడెపుడున్".
కవి హృదయం ఎంత అనర్ఘమైతే ఇటు వంటి పద్యం పుట్టగలదో చూడండి -
"అతని హృదయ మనర్ఘము,వితత చిత్ర
పటము,లలిత గంభీరంపు వలపువాక;
సత్త్వ మృన్నిర్మిత మనోజ్ఞ చంద్రశాల;
చారు సద్గుణ కౌముదీపూర రాత్రి ".
అట్లాంటి స్ఫురణకల్పిస్తున్నదే మరో పద్యం -
" నిశ్చలమైన నావ, యభినీతము పుష్పపరీమళమ్ము, ప్రా
జ్నిశ్చిత బంధ తారకిత నిస్తుల శూన్యనభమ్ము తోడుగా
పశ్చిమమందు దోచిన శుభంకర పూర్ణ సుధాంశు బింబ,మం
తశ్చర్యమైన పద్యము,విదారిత దైన్య భరమ్ము లెల్లెడన్ ".
నాకైతే సుందరకాండ లో సీతమ్మను హనుమ దర్శించుకున్న శారద రాత్రిని జ్ఞప్తికి తెచ్చింది ఈ పద్యం.
అక్కడే మరో పద్యం -
"శాంతమైన యావరణము స్వాంతమందు;
భవ్య విధుమూర్తి గగనాన - ప్రతిభ కాపు
తొడగి పదచిత్రణములు ప్రదోషతోష
పులకితాంకురములవోలె తలలనెత్తె;"
అవి కేవలం కవితాంకురాలు కాదు, దివ్యౌషధాంకురాలు - చంద్రుని వెన్నెలను త్రాగి మొలకెత్తిన దివ్యకవితాంకురాలు! కవి ఎంత సంయమి అయితే కవనం అంత శుద్ధం -
" పరమ యోగాంగ ముద్ర గాపడము వెట్టి
సలుపు గరగించుకొన్నట్టి సంయమివలె
నమలిన ధ్యానము వలన నయ్యె వాని
శుభ్ర చిత్తమ్మున కవన శుద్ధ జన్మ ".
కవి కావలసిన వాడు రసపరిశ్రమకి ఏం ధారపోయవలసి ఉంటుందో చెప్తున్నాడు, చూడండి -
'ప్రాణములు ధారవోయగా వలయుగాదె
యీ రసపరిశ్రమమునకు? ...'
అంత శ్రమతో వెలికివచ్చింది కాబట్టే అంత వాత్సల్యం కూడా -
"పదము పదమును తడుము నాప్యాయనమున
కనుల - లేగను నాకు గోకాంత వోలె".;
"అపపదమ్ములు దొరలిన యంత నడ్డు
గీత గీయడు; కలము తాకించి చుట్టు
గా లిఖించి, దాచికొనును బేలమనసు
లో నిరంతర స్నేహితాలోచనముల".
తల్లికి తప్పనిపిస్తుందా, కళ్ళల్లో పెట్టుకొని కాపాడుతుంది, తనది కొట్టివేయలేని ప్రేమ!
"అతని గర్భాన కలవు మహా కవీంద్ర
కృతి సువర్ణములు"
అన్న పద్యం చెప్తుంది ఈ సారస్వతాస్తిత్వమూర్తి రూపు దిద్దించిన పురాకవుల సుకృతాలను- (బృహదారణ్యకోపనిషత్తు చెప్పిన మధు విద్య ఇదే. ) ఎందరు మహానుభావులను జీర్ణించుకోగలిగిన ప్రజ్ఞ తనదని! అందుకే మళ్లీ ఇంకోసారి తనను సంస్మరింపచేస్తోంది ఆ ప్రజ్ఞ-
"ఒక కవి స్మృతిని పలుకరించి "నీవే
నే" నని మురిపించు; నిమ్మళమున
వేరొక కవి తోచి వెనువెంట"నాలోన
నీవు వసించెద" వని వచించు;
నింకొక కవినాథు డేతెంచి" నా రస
వాదము నీ కలిస్తే"మని చెప్పు;
మరి యొక్క కవి"మన మార్గము భిన్నము
కాని నీయందు నే గలను కాదె"
యనును; "
అందరిలో తను,తనలో అందరినీ చూసుకోగల చూపు. అదే ఋషి స్మరణం హృదయాళువులయిన అమల కవన నిర్మితి నిపుణకవులందరూ వరసకట్టి తమ వాక్ప్రభలకు ఈ మనకవి అందజేస్తున్న అభివాదములు స్వీకరిస్తున్నారు, (శుభ కార్యాల్లో చాలా ముఖ్యమైన 'కులదేవతారాధన' ఘట్టాన్ని గుర్తుకు తెచ్చింది ఈ పద్యం); (అట్లే Eliot ను కూడా- ) తను కన్న కావ్యం, పొత్తిళ్ళలో పాప- ఎంత మెత్తగా ఎత్తుకోవాలో,ఎదకు హత్తుకోవాలో చెప్తాడు కవి -
"పాల పాప నెత్తినటుల పల్లవించి
వెన్ను నరచేత నానించి చెన్నుపుటల
ద్రిప్పు నొయ్యారముగ విడదీయు సొగసు ".
పుస్తకాన్ని చదివేటపుడు, పుస్తకం వెన్నును (back) అరచేతిలో పెట్టుకుని అతి సున్నితంగా పుటలను తిప్పుతూ పోతుంటే, ఆ కావ్యంలో ఆవిష్కృతమైన సొగసును చూస్తూ మైమరచడాన్ని , ఎంత అందంగా వర్ణించారో . పసిపాపల వెన్నును మన చేతులకు ఆనించి, ఒత్తుకుపోకుండా మృదువుగా ఎత్తుకుని, మనం ముద్దు చేస్తుంటే , తానూ మురిసి నవ్వు దొంతరలను చిందించే బంగారుపాపను మన కళ్ళెదురుగా నిల్పిన కవి హృదయం ఎంత సున్నితం! అప్పుడు ఆ పద్యం ఒక దేవత -
"దేవత వలె పద్యమ్ము మదిని మెరసి క
నబడు వేడుక నావాహనము ఘటింప
చదువును పదము పదమును పెదవి పైని
ప్రత్యణువు నవ్వుదొంతికి పట్టువడగ ".
( 'నవ్వుదొంతి' అన్న ఊహ ఎంత బాగుందో )
కానీ అంతలోనే ఒక సందేహం కమ్ముకుంటుంది కవిని -
'.........కవిత కా
దే యనుకొను; పద్యమ్మొక
శ్రీ యోగమని తలచు సుమశీలపు టెదలో ".
అంతరంగంలో కవికి అనుభవమైంది తనను పలికించింది శ్రీయోగమేనని. కానీ రవ్వంత సందేహం, సందేహం తనపై, సరిగా పోల్చుకున్నానా లేదా అని, అమ్మవారి మీద కాదు, లేకపోతే ,
" మల్లీ గుచ్ఛములై పదమ్ముల కడన్మార్కొన్న ఫేనమ్ము, లు
త్ఫుల్లాంతః కరణమ్ముతో జగములన్పోషించు చిచ్ఛక్తి,హ్రీ
వల్లీవేల్లిత కావ్యకాంత యెదలో, బంగారు పద్యమ్ములున్
జల్లించెన్ సుమనస్వి చిత్తములలో జాడ్యాది మాలిన్యముల్ " అని;
"నీకెదురై కొరంతల ననేకములన్ వినిపించు కోర్కెతో
కేకలు వైచు నా హృదయ గేహములో వెలిగించి స్నిగ్థ రా
గాకర దీపికల్, బ్రతుకు కష్టము వెన్కటి తాల్ములన్ పవి
త్రీకృత యత్నధారలను తేలిక నిచ్చిన దేవి! మ్రొక్కెదన్" అని;
" వ్యసనముననో! నిధులలోనొ! కసవు కుప్ప
వోలె కలియనీక నను పూపొడిగ జేసి
ఆలయ పరిసరములలో వెలయ జిమ్ము
కావ్యకన్యక నిరుపమ కరుణనెంతు" అని! అనగలడా?
పరాశక్తి కనుకనే అమృత రసప్రవాహమై సాగింది తన కవితా స్రోతస్సు-
"అరవిరి విప్పారినట్లు,మరాళము
కులికినయట్లు,నింపొలయు నట్లు
పసిపాప,రాగకల్పన సందడులు గొన్న
యట్లు, వెన్నెల కరుళ్ళడరినట్లు
పాలుపొంగినయట్లు,బాలెంత నవ్విన
యట్లు, పర్వచ్ఛవులాడినట్లు
కమలకన్యక జలకణముల విదిలించి
నట్లు, గోధూళి తారాడినట్లు".
ఎంత ముద్దు ఎంత సొగసు ఈ పోలికలలో. ఆనందం, సౌందర్యం , శాంతం అంతా ఒకచోట కుప్పపోసినట్లు లేదూ?
ఇదీ కవి కలగన్న - హృదయ కోశాన్ని తాకవలసిన కవితకు ప్రత్యక్ష ఉదాహరణ!
('ఏ పథానుయాన కవిత యేని హృదయ
కోశమును తాకెనా,సదావేశమున వ
చించు - నిదియె కవిత, దీని మించు నదియు
గలదె?" యంచు శాంతులొలుకు కనులతోడ!')
ఈ యీహా మసృణత్వ మెంతటిదొ కానీ,యూహలే పాటలై
పోయెన్; లోబడి చంద్రకాంతికి నిశామోహమ్ము పైపై వృథా
మాయాంధ్యమ్ము నపాకరించు వెరవై మార్గమ్ము చూపించె,వి
ద్యా యామమ్మిది సర్వతో ముదము కాంతా! పద్యముల్ బల్కనా"
అంటూ,విద్యా యామంలో 'వ్యథల్ ప్రభవించిన గాని నిత్య మావాసము జేయజాలవు అని అనుభవ పూర్వకంగా పలికి ,
(" పాదబద్ధో ऽ క్షర సమస్తంత్రీలయ సమన్వితః,
(" పాదబద్ధో ऽ క్షర సమస్తంత్రీలయ సమన్వితః,
శోకార్తస్య ప్రవృత్తో మే శ్లోకో భవతు నాऽన్యథా!" అని వాల్మీకి మహర్షి! ) ,
సభలో పదివన్నెలారు పదకుసుమాల మాలలవంటి పద్యాలు పఠిస్తే, ఆయనకు ఎదురైంది, పలువురి నీరస హృదయుల పెదవి విరుపు. ఎంత విరక్తి కలగవలె - కాళిదాసు అంతటి వాడే నిర్వేదంతో 'అరసికేషు కవిత్వ నివేదనం శిరసి మా లిఖ మా లిఖ మా లిఖ ' అనవలసి వచ్చింది.
*******
"తచ్ఛ్రుత్వా మునయః సర్వే బాష్పపర్యాకులేక్షణాః,
సాధు సాధ్వితి తావూచుః పరం విస్మయమాగతాః".
ఆర్దృత నిండిన మనసుతో సాధు సాధు అనగలగడానికి , మన కళ్ళు తడి అవడానికి మనం త్రేతాయుగపు మునులం కాదు కదా! కలి ఆవహించిన మానవులం మనం. కవికి కాసేపు హృదయావేదన తప్పదు. అన్ని విధాలా ఇప్పుడు మనం మనుషులం విపరీతంగా, ప్రకృతి విరుద్ధంగా ప్రయాణం చేస్తున్నట్లే కావ్య లోకంలో కూడా గతులు తలకిందులవుతున్నాయి. వాగ్దేవతా కరుణతో కవి హృదయతాపాన్ని శమింపచేసే సహృదయులు ఆవిర్భవించి కవులు సమ్మానింపబడి, వారి ఆవేదన పరిహరించబడి, సత్కవిర్జయతి అన్న వాక్కులతో దిక్కులు ప్రతిధ్వనించుగాక! అని భావిస్తూ, మన పరిమి శ్రీరామనాథ్ గారు అతి త్వరలో మరిన్ని అద్భుతమైన రచనలతో మనముందుకు రాగలరని ఆకాంక్షిస్తూ,ఆశీఃపురస్సర అభినందనలు 💐
******

No comments:
Post a Comment