మానవజీవితంలో అత్యంతవిలువైన వస్తువు ప్రశాంతత. ఈ ప్రశాంతతను ప్రకృతి చిన్నతనంలో మనిషికి కానుకగా ఇస్తుంది. పెద్దైయ్యాక, తమకంటే ఒకటి రెండు పెద్దతరాల వాళ్లు కళ్లముందే తిరుగుతూ అహరహం శ్రమించి, వేరే దేనికోసమూ పడని తాపత్రయమంతా పడి ధర్మాధర్మాల నియమాలను ఏర్పరిచి నిర్మించిన కుటుంబమనే వ్యవస్థ వాటిని పాటిస్తూ కలిసిమెలిసి జీవించిన మనుషులకు కొంతకాలం ముందువరకూ ఆ ప్రశాంతతను ఇస్తూ వచ్చింది.
ప్రతీ నియమమూ దుర్మార్గమైన బిగింపు కాదు. ముఖ్యంగా ధార్మిక నియమం అనేది, దాని ఫలితాన్ని చవిచూసిన జీవితాన్ని జీవించిన ఒక పెద్దమనిషి అందులోని విలువను గ్రహించి, తన వాళ్లపై ప్రేమతో చేసిన కట్టడి. అది వారికి శ్రీరామరక్ష. భారతీయ కుటుంబాల్లో వివిధ వర్గాలలో ఆయా వర్గాల తాలూకు జీవనవిధానానికి తగినట్లుగా ఆయా పెద్దలు పెట్టిన ఆచారాలు, నియమాలు ఆ ఇంటి పిల్లల తాలూకు మెదళ్లను ఎలా కాపాడాయో, కౌమారదశనూ అలానే రక్షించాయి. వారిదైన సంసారం ఏర్పడ్డాక, అలానే చేయూతనిచ్చాయి. ఎందరో చుట్టాలతో ఒక చూరు క్రింద బ్రతికిన మనుషులు కుటుంబధర్మనియమాలకు తలను వంచి బ్రతికి ఉండవచ్చు. కానీ తలను ఎటువైపు పడితే అటువైపు తిప్పగలిగే స్వేచ్ఛతో మనసుపై కోతలు కోసుకుని,పేర్లు తెలీని వ్యాధులతో దుఃఖపడిన సందర్భాలు తక్కువ. కుటుంబంలో లోపాలు, మనిషిలో లోపాలంత సహజం. లోపాలున్నా అది మొత్తంగా వ్యవస్థగా ఒకతాటిపై నిలబడగలగడం చాలా పెద్ద విజయం. మనోబలాన్నీ, మనుషుల ఆసరానూ కుటుంబం ఇచ్చినంతగా మరేదీ ఇవ్వలేదు. అటువంటి కుటుంబంలో ఎన్నో లోపాలుండవచ్చు. ఉంటాయి. ఆ లోపాలను ఎందరో తట్టుకున్నారు. భరించారు. ఆ భరించిన వారందరూ మూర్ఖులనీ, అమాయకులనీ, వెర్రివాళ్లనీ సమాజం ఒక ముద్ర వేసింది. ఒక నెప్పిని భరిస్తున్నపుడు, దాన్ని అతిశయించే ఆనందమో లేదా బలమో మరోవైపు ఉందేమో, దానికి వారు విలువనిస్తున్నారేమో అన్న ఆలోచనకు అవకాశం కూడా ఆధునికత ఇవ్వలేదు. సైన్సు, సాంకేతికత అనే వాటిని తన విజయాలుగా వెనకేసుకు వచ్చి, ఆ బలంతో ఈ దేశపు ఎన్నో విలువైన వస్తువులకు సమాధి కట్టింది ఆధునికత. ఒక పదం స్పెల్లింగ్ ను తప్పుగా వ్రాస్తే, పలకపై "డాంకీ" అని వ్రాసి విద్యార్థి మెడలో వేసి తరగతి మధ్యలో నిలబెట్టడం ఆధునికత తాలూకు మోడస్ ఆపరాండీ. దానితోనే ప్రతీ వ్యవస్థకూ ఉన్నట్లే, ఎన్నో లోపాలూ- లాభాలూ ఉన్న కుటుంబమనే గొప్ప వ్యవస్థ నుదుటిపై లోపాలను మాత్రం పెద్ద పెద్ద అక్షరాలతో నెత్తురోడేలా చెక్కి, దాని పుట్టిల్లైన ఊరి మధ్యలోనే, తన వాళ్ల ముందే, దానిని గాడిదపై ఎక్కించి ఊరేగించి,తన్ని, తరిమేసింది.
ఒక విలువల రాశిగా కుటుంబం మనుషుల మనసుల్లోంచి వెళ్లిపోయాక, భౌతికంగా వేర్పాటుకు ఎంతో కాలం పట్టలేదు. వ్యక్తులుగా మిగిలిన మనుషుల జీవితాల్లో ఆ ఖాళీలోకి, ఆ సందులోకి ఎన్ని ప్రమాదాలు, ఉత్పాతాలు వస్తున్నాయో; అలా వచ్చిన వాటిని నార్మలైజ్ చేసి, సహజమే అంటూ ఎలా అందరినీ ఒప్పిస్తున్నారో, మనకు సంబంధం లేని, ముందుతరాల వాళ్లెపుడూ చూడని వాటిని ఇప్పటి వాళ్లతో బలవంతంగా ఎలా అనుభవింపజేస్తున్నారో, దానితో వారు లాభాలెలా పొందుతున్నారో, వాటికి ప్రగతి-అంధవిమోచనం అంటూ పేర్లెలా పెడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం.
ఎంతో దగ్గరైన తల్లిదండ్రులూ, పిల్లలూ విదేశీ ప్రయాణం ద్వారా విడిపోవడం కాదు. ఒకే ఇంట్లో ఉన్నా, ఒకే కూర తింటున్నా పిల్లలను తెలియకుండా వలసకు తీసుకుపోతున్న శక్తులు ఎన్నో. ఒకే చూరు కింద కలిసి ఉన్నా ఇప్పటి న్యూక్లియర్ ఫామిలీ బ్రతికేది వేరే వేరే దేశాల్లోనే. జీవించేది వేరే వేరే జీవితాలనే.
"ఈ పెద్దవాళ్లున్నారే, పిల్లల మనసును ఎప్పటికీ అర్థం చేసుకోలేరు" అనే వాక్యానికి ఉన్న బాహ్యాకర్షణ తీరైన విలువలున్న పెద్దల మనసుల్లోని లోతును ఒకనాటికి చూడలేదు. నిర్ణయం ఎప్పుడూ వన్‌సైడ్ అయిందంటే, ఎప్పుడూ ఒకవైపున్న మూలాలపైనే వ్యతిరేకత పేరుకుంటోందంటే, ఏదో శక్తికి లోబడిపోయామనే అర్థం. దీనికి తెలివి, స్వేచ్ఛ అనే పేర్లు ఎంతవరకూ నప్పుతాయో ఆలోచించవలసిన అవసరం ఉంది.
"వలస" ఈ దేశానికి చెందిన ప్రతీ ఊరిలోని తల్లి మనసుకూ, తండ్రి గంభీరతకూ ఎత్తిన నీరాజనం. ప్రతీ కౌమారదశలోని పిల్లల నిస్సహాయతకు నిలువుటద్దం. ఈ నవల తమ స్వంతదేశాన్ని వదిలి, వేరేదేశానికి పొట్టను చేతబట్టుకుని వెళ్లిన మనుషుల జీవితాలకు ప్రతిబింబం కావచ్చు. కానీ ఇది స్వంతదేశంలోనే ఉంటున్న ప్రస్తుతవ్యక్తుల జీవితాలకూ అంతే వర్తిస్తుంది. ఈ నవలలోని పెనుగులాట కుటుంబంపై మనసున్న ప్రతీ భారతీయుడూ అనుభవించేదే. కానీ అది అతడు చేసుకున్న స్వయంకృతాపరాధం కాదు. తెచ్చిపెట్టుకున్న కర్మఫలితం కాదు. తనకు తెలియక తలదూర్చిన రోలు. అందులో రోకటి పోట్లను వేస్తున్న అధికార శక్తులకు ఏ కర్మసిద్ధాంతాలూ వర్తించవు. వారి రాజ్యాంగమందిరంలోకి ఎవరినీ కాలు కూడా పెట్టనివ్వరు.
ఈ నవలలో ఉన్న మనుషుల జీవితాలూ, వారి విధానాలతో మనలను మనం పోల్చుకుంటాం. నవీనత వైపుకు ప్రయాణించిన వారి జీవితాల్లో వారికి జరిగిన మంచినీ, ఆధునికత మనిషికి చేసిన ఉపకారాన్నీ, అదే సమయంలో చెప్పకుండా చేసిన చెడునూ కూడా చూస్తాం. ఈ నవలలోని పాత్రలతో మమేకమౌతాం. సాధారణంగా సినిమాల్లో విలనీ బ్యాగ్రౌండ్ స్కోరుతో కనిపించే ఒక తల్లిదండ్రుల జంట మనసులు మాత్రం ఈ నవలకు ఆయువుపట్టు. అవి పడిన నలుగుడు మనం మరెక్కడా చూడం. ఇలా నిక్కచ్చి గా వాటిని మన ముందు పెట్టడం సుస్మితగారు చేసిన గొప్ప పని. ఎవరూ ఇంత విస్తారంగా చేయనిది. ఒక కౌమారదశలోని అమ్మాయిని లోబర్చుకున్న పరిస్థితులు ఒక కుటుంబంలో ఏయే సంఘర్షణలు పుట్టించగలవో అన్నదానిని ఈ నవల చూపించిన తీరు నిరుపమానం.
ఈ నవలలో ఉన్న దృక్కోణానికి విలువనివ్వకపోయినా కనీసం చూసి, అందులో లోటుపాట్లను ఆలోచించే అవకాశం ఇచ్చినా మన పిల్లలను, తరువాతి తరాలను కాపాడుకునేందుకు తెలియని ఏహ్యభావంతో ఇప్పటి పద్ధతులు వద్దే వద్దని అలవాటు కొద్దీ విసర్జించినా కూడా, కొత్తవాటినైనా పటిష్ఠంగా తయారు చేసుకోగలం. మన తాతతండ్రుల నుండీ, తల్లుల పెత్తల్లులనుండీ బలాన్ని తీసుకోగలం. వారి స్థైర్యాలనూ, క్రమశిక్షణలనూ, వాటికి దారితీసిన వాతావరణాలనూ అధ్యయనించగలం. మన ఇంటినియమాలను, పద్ధతులనూ ఆచారాలనూ రవంత హాయిగా చూడగలం. అవి మనజీవితాల్లోకి మోసుకొచ్చిన విలువనూ, ప్రశాంతతనూ గుర్తించగలం. మనవారితో, మన పద్ధతులతో మాసికంగా పెనవేసుకోవడం అనే ఆలోచనను మరికొన్ని సెకెన్లపాటు చేయగలం. మన ముందు జీవితాన్ని ఇప్పటి కాలంతో సమన్వయపరచుకోగలం. నేటి మన పిల్లలకు కావలసిన సహాయ సహకారాలానూ, బలాన్నీ తగినట్లుగా ఇవ్వగలం.
సుస్మిత గారి ముద్దులొలికే తెలుగు, రచనా సామర్థ్యం, అద్వితీయమైన అల్లిక ఈ కృతిలో ప్రతీ అక్షరంలోనూ కనిపిస్తాయి. ఈ రచన ద్వారా ఆవిడ వెలిగించిన జ్యోతి ఎందరికో మార్గదర్శనం చేయించగలదు.
*
For copies contact: Pallavi Sv Narayana @ 9866115655
DM Susmitha garu for US orders

సుస్మిత గారి పుస్తక సమీక్ష సందర్భంలో మీరు చెప్పిన విషయాలు అక్షర సత్యాలు.
ReplyDeleteనియమబద్ధమైన జీవితం అలవాటైతే.. అందులో ఉన్న నిశ్చింత, భరోసా రుచి తెలిసిననాడు అవి ఏర్పరిచిన పెద్దవారి మీద మర్యాద, గౌరవం, అభిమానం అవే ఏర్పడతాయి!
ఒకప్పుడు... మరీ పురాతనంలోకి వెళ్లక్కరలేదు.. కనీసం యేభై, అరవై సంవత్సరాల క్రితం వరకూ ఉన్న కుటుంబవ్యవస్థ పటిష్టంగా ఉన్నన్నాళ్లూ వ్యక్తిత్వ వికాస నిపుణులు, సైకాలజిస్టులూ.. ఇలాంటివారి అవసరం పెద్దగా వచ్చేది కాదనిపిస్తుంది.
మీ మాటలు ఎప్పటిలాగే తరచి చదుకోవాల్సినవి!