
తెలుగులోనూ, ఆంగ్లంలోనూ హృదయంగమమైన కవితలను అల్లే కవి, భావనాతిశయ లలితగీతాలను ఆశువుగా కూర్చి, గానం చేసి సహృదయుల హృదయాలకు రసానందాన్ని పంచిపెట్టే కళాభిజ్ఞులు శ్రీ సముద్రాల హరికృష్ణగారు హృదయావి కావ్యం పై వ్రాసిన స్పందనను వారి అనుమతితో ఇక్కడ ఉంచుతున్నాను.
నమస్కారాలతో.
------------------------------------------
నమస్కారం.
ఒక చిరు యత్నం,మీ రచన 'హృదయావి', కావ్య వస్తువు మీద.
***
శ్రీ పరిమి శ్రీరామనాథ్ గారి "హృదయావి"-
(కావ్యవస్తువు గురించిన చిరు పరిచయం!)
***
ఒక కవి మానసవనంలో ఉదయించే సుపుష్పం ఒక కవిత,ఒక పద్యం.
అది వికసించి నలుగురి మెప్పునూ పొంది,దాని ఆకృతి అందాలు,నిర్మాణ నైపుణ్యాలూ,వర్ణ విశేషాలూ, గంధగాఢతలూ సహృదయుల,సాటి కవి పండితుల ఆమోదం పొందితే అతనికి అది గజారోహణం చేయించిన ఆనందమే!
నమస్కారం.
ఒక చిరు యత్నం,మీ రచన 'హృదయావి', కావ్య వస్తువు మీద.
***
శ్రీ పరిమి శ్రీరామనాథ్ గారి "హృదయావి"-
(కావ్యవస్తువు గురించిన చిరు పరిచయం!)
***
ఒక కవి మానసవనంలో ఉదయించే సుపుష్పం ఒక కవిత,ఒక పద్యం.
అది వికసించి నలుగురి మెప్పునూ పొంది,దాని ఆకృతి అందాలు,నిర్మాణ నైపుణ్యాలూ,వర్ణ విశేషాలూ, గంధగాఢతలూ సహృదయుల,సాటి కవి పండితుల ఆమోదం పొందితే అతనికి అది గజారోహణం చేయించిన ఆనందమే!
అదే ఆ కవితలో ఉన్న గుణాతి శయాలన్నీ విడిచిపెట్టి,
లేని నెరుసులు వెతికి సాటివారు మత్సరమో,దంభమో ఏ కారణంగానో చప్పరించేస్తే,అది అతనికి ప్రాణాంతక మైన బాధగానే పరిణమిస్తుంది.
ఆ అన్యాయపు తూకపు వైనానికి, కుహనా ప్రమాణాలకూ అతని '"ఉత్పలకోమల" సదృశమైన మనసులో కటారి దింపినట్లౌతుంది.
అతని పసి యెద గిలగిల లాడుతుంది.
అకారణంగా గుణాన్ని తోసిరాజంటున్నా రెందుకు అని ఖేదపడుతుంది.
ఈ కవితా వ్యాసంగమే వృథా అని అతను తన కలాన్ని మూసివేసి తన ఊహాశాలితకూ,తనలోని కవితా విహంగానికీ ఇనుపపంజరం వేసి బంధించే ప్రమాదమూ ఉన్నది.
ఇంత మథనపడి,అలలై దూసుకువచ్చే భావపరంపరను అదుపు చేసి, మదుపుచేసి,సన్నని నయగారాల పదాలను ఏరి,ఎంపికచేసి,శ్రధ్ధగా అలంకరించి, పలుమార్లు సమీక్షించు కుని కూర్చిన దానిని--
ఎంత సులువుగా,నిర్లక్ష్యంగా తన రసపరిశ్రమను తృణీకరిస్తారు వీరని ఆ సాత్త్విక హృదయం తల్లడిల్లుతుంది.
కవితాసృష్టి ఎంత ప్రసవవేదనా తుల్యమో,ఈ కారణరహిత నిరాకరణ,నిరాదరణలు అంత కంటే వేయిరెట్లు ఎక్కువ బాధాకరం ఆ స్వఛ్ఛహృదయుడికి.
ఒక రకంగా అతని జీవితేఛ్ఛనే తుంచివేసేంత దుష్ప్రభావకారి!
ఆ కువిమర్శలకు అతను జవాబు కూడా ఇవ్వటానికి సుముఖుడుగా ఉండడు.
ఒక విరాగమైన నవ్వు నవ్వి నిర్లిప్తుడై పోతాడు.
ఆశించిన దానికి పూర్తి వ్యతిరిక్తంగా పరిణామం ఉన్నపుడు ఏర్పడే విరక్తి.
సంపూర్ణంగా మనసు పెట్టి కృషి చేసి,
తన సకలోహ సమన్విత సౌకుమార్యం తో ఒక సుందర చిత్రాన్ని గీస్తే, కాలు వంకర, చేయి వంకర, ముఖంలో కళ లేదు అని నిర్హేతుకంగా చిన్నబుచ్చిన ఒక కళాకారుడి పరిస్థితి.
అటువైపు ఆ తామస విజృంభణం,
ఇటు ఈ సత్త్వప్రధానుడైన, సత్యశీలుడైన కవి యెదలో శోకోల్బణం!
దీనినంతా శ్రీరామనాథ్ గారు,
రచనాద్యవస్థనూ,రచన సాగుతుండగా ఎదురయ్యే అవరోధాలను,వాటిని అధిగమించడానికి కవి ప్రయత్నమూ, తరువాత కావ్య రచనా అనే అంశాలతో తనదైన కోమలమైన శైలిలో,ఈ చిరుకావ్యంలో అందించారు.
ఆ అందించడం,ఆత్మానుభవమేమో అనిపించేంత అనుభూతి గాఢతతో అందించారు.
ఒక సృజనశీలుడైన సారస్వతోపాసకుడి హృత్తాప సాకారమైన తన ఈ "హృదయావి" కావ్యంలో!
***
అడుగు తీసి అడుగు వేసే లోపల,అతని హృదయంలోఎన్నెన్ని భావాలో-
కుసుమించే ననలు కొన్నీ, అగ్నికణ సమ జాజ్జ్వల్యమానాలు ఇంకొన్నీ!
నిన్న ఏదో లీలగా తోచి,శబ్ద రూపం ఇంకా దాల్చని వాటిని మళ్ళీ స్ప్రశించి, లాలించి ఒక పద్యాకృతి ఇచ్చి,
చూసి మురిసిపోవాలని ఒక ఉద్వేలమైన ఉత్సాహం.
ఈ కవితా వ్యవసాయం,ఒక పూర్వ పుణ్యమే,ఒక 'భోగ గరిమ' యే అతని గణనలో.
అప్పుడే మదిలో మెదిలిన పద్యాన్ని తన్మయత్వంతో మళ్ళీ మననం చేసుకుని, "ఆహా కవీ, అమృతసుతుడ" వోయీ అని తనకు తాను ఒక కితాబు ఇచ్చుకుంటాడు, వినయంగానే!
అది భౌతికావరణలను దాటిన ఒక రసహృదయుడూ, మనస్వీయైన వాడి మనఃస్థితీ,నిర్మలవాక్కూ!,
"ప్రాణములు ధారవోసి",ఆత్మలో నుంచి ఉబికింపచేసిన భావాలకు రూపకల్పన ఆ రచన.
అతనికి అది ప్రాణాధికం.
దానికి వెల లేదు,అది అమూల్యం!
అతని రసదృష్టికి కావ్యకన్య ఒక గడసరి పిల్ల.
అదను చూడదు,అనుమతి కోరదు, కుశలాదికాల ముచ్చటే లేదు-
సర్వ స్వతంత్రయైన అనురాగమంత్ర ప్రయోగచణి!
అతన్ని రాగమయుణ్ణి చేస్తుంది, మంత్రముగ్ధుణ్ణి చేసేస్తుంది!
ఆ నెనరుకు అంతు లేదు. ఆ చనువుకు సీమ లేదు.
అతనికీ అంతరంగంలో మహాప్రీతికరమే ఆ ధోరణి మరి!
అవ్యక్తసుందరమైన కవిత్వతత్త్వాన్ని ప్రేమించే,ఉపాసించే వాజ్ఞ్మయసాధకుడు ఆ వ్యక్తి.
కవిత్వం,అతని ప్రవృత్తి.
కేవలం ప్రవృత్తే కాదు,జీవన సాఫల్య హేతువు.
రసానందం పంచి యిచ్చి,జగధ్ధితాన్ని మననం చేసే కవితా దీక్షను పూనిన అక్షరశక్తి,ఆ వ్యక్తి!
ఒక భావం ఏదో మెరుపులాగ తట్టి మాయమైతే,
సంయోజనం చేసిన పదబంధం మళ్ళీ స్మ్రతిపథాన మెదలక పోతే ఆ కవి పడే వ్యాకులపాటు,వాటిని గుర్తు చేసుకొనే ప్రయత్నంలో అవి కొంతసేపటికి మళ్ళీ క్రొమ్మెరుంగులతో సాక్షాత్కరించటమూ, అతని రచనాధ్వరంలో రసరమ్య ఘట్టాలు.
తిక్త మధుర సమ్మిశ్రిత రసాయనాలు!
కవి హృదయం ఒక వాత్సల్యపూర్ణ క్షీరవారాశి.
ఒక పూర్తియైన పద్యాన్ని,దానిలోని భావాన్ని అనుకుంటూ,ఆ ప్రయోగించిన శబ్దకుసుమాలను సుతారంగా వేళ్ళతో తాకి,గోముగా చూసుకుని మురిసి పోతాడు.
తన లేగను ఆప్యాయం నిండిన కనుల తో ఒక ధేనువు చూసుకున్నట్టు!
అతని శబ్దానురాగం కొలతలకు అందనిది.
ఏదైనా పదం మార్చి ఇంకొక పదం వేయాలంటే ఆ కావ్య నిర్మాణ దశలో దానిని కొట్టివేయడట!
అక్షరాన్ని కొట్టివేసే పారుష్యలేశమూ లేని పేశలచిత్తుడు ఈ కవి.
దాన్ని చుట్టి ఒక వృత్తం గీసి,దానికి ఇవ్వవలసిన గౌరవం ఇచ్చి,అప్పుడు వేరే పదంతో ముందుకు సాగుతాడు.
ఆ చుట్టిన పదాన్ని గుండెలో భద్రంగా పదిల పరుచుకుంటాడు.
అక్షరం అమృతం,
పదం,ఎన్నటికీ వసివాడని పారిజాతం అతనికి!
దీనిని పదగుంఫనం అనటం కాదు,పద పూజ,శబ్దాక్షర సంసేవనం,అనాలి బహుశా!
రచన ఒక తపస్సూ,ఒక యోగమూ అయిన కవికి ఈ భావన రాకపోతేనే ఆశ్చర్యమేమో!
పద్యరచన ఒక "శ్రీయోగం" అతని భావనలో.
గణాలు సరిపోయినంత మాత్రాన పద్యం కాదు అతని దృష్టిలో.
ఆ దశలో అది ఒక చట్రంలో స్థిరపడ్డ పదసంచయం,అంతే!
కవితాత్మ అందులో ప్రవేశించి ఉంటేనే అది పద్యపదార్హత పొందుతుంది.
కవితాప్రవృత్తిలో చిక్కదనం, రసస్ఫూర్తి అనేక సంవత్సరాల కృషి ఫలంగా లభించవలసినదే.
చేస్తే అట్లాంటి ఉత్తమ కవితావిష్కరణ మే తన కర్తవ్యమని చెప్పుకుంటాడు తనకు తాను.
పూర్వాలంకారికులు వేసిన సువర్ణ పథాలను తలచుకుని వారికి కృతజ్ఞతతో మొక్కుతాడు.
శైలి,ఛందము,పాకము,రీతి,మొదలైనవి రేకులు గా ఊహిస్తాడు అందమైన కావ్య కమలానికి!
కవితకూ ప్రేమకూ అభేదమే రస లోలుపుడైన ఈ కవి దృష్టి లో.
కవిత కూడా ప్రేమ వలె కాలమాగిన అనుభూతి కల్గించనూ సమర్థమే;
జగతి సర్వాన్నీ సౌందర్యమయంగా భాసింపచేయనూ సమర్ధమే!
ఆ కవి హృదయం రసనిర్భరం.
పూవు సోయగానికి కదిలిపోతాడు.
మెరుపు భయదసౌందర్యానికి దాసోహమంటాడు.
ఆ హృదయం ఒక---
" లలితగంభీరంపు వలపు వాక"!
"సత్త్వమృన్నిర్మిత మనోజ్ఞ చంద్రశాల"!
వెన్నెలలతో చిరకాల పరిచయం,స్నేహం కవికిశోరుడికి.
తన మేనికి వాటి గంధాన్ని, తన మనసుకు ఆ విడదీయరాని చంద్ర సంబంధాన్ని అలంకారాలుగా భావించి తృప్తిగా వహించే భావుకశేఖరుడు కవి!
నీవున్నావన్నదే నా ధైర్యం శీతాంశుప్రభో, అని కూడా అంటాడు చమత్కారంగా.
"ధన్యకవిత మూల ధాతువీవు"అని అగ్గిస్తాడు కూడా రజనీకాంతుణ్ణి!
ఆ కౌముదీవైభవ వర్ణనలో కొంత దూరం సాగిన తరువాత ఏదో తెలియని భావావరోధం ఏర్పడుతుంది కవన ప్రవాహానికి.
అప్పుడు దాన్ని దాటటానికి ఈ కవి పడే అవస్థ వర్ణానాతీతం.
నిత్యకావ్యవ్యవసాయులు,కావ్యసారగ్రాహులూ అయిన సహృదయుల ఊహకు మాత్రమే అర్థమయ్యే మానసికావస్థ అది.
అన్యులకు,అంటే ఆ అక్షరలోక పరిచయం కించిత్తూ లేని వారికి ఈ పోకడ ఒక వింతగాను,వ్యర్థ ప్రయాస గానూ,ఒక డాంబికమైన ప్రదర్శనగానూ అనిపించినా ఆశ్చర్యమేమీ లేదు.
అది కనిపించని ఆంతర యుద్ధమే.
ఏదో ఊహ తోచటమూ,కానీ ఇది ఇంతకు ముందే వాడబడినదిగా అనిపించడమూ;
ఏదో పదం లీలగా తోచడమూ,సరియైన సమయానికి జారిపోవడమూ;
కొంత పొడిగించి ఇంక దారి కానక వెనుతిరిగి రావటమూ;
ఏదో అలసిపోవడమూ;
మానివేద్దాము అనిపించడమూ, కాదు కాదు అది సరియైన పద్ధతి కాదను కోవడమూ;
పద మొకటి తనను వాడమని తొందరించటమూ;అది ప్రయోగిస్తే మొత్తం కవితలో అది అమరక పోవడమూ;
ఇట్లా ముందువెనుకల పయనం-- ఆ మథనలోనే, కవి కవితా సృజనయానం!
భావుకుడైన ఆ కవి మానసక్షీరసాగర మథనమే ఈ కావ్యవస్తువు.
సంశయావరోధ రూపమై ఉదయించిన గరళాన్ని తానే శివుడై మింగేసి,మిగిలిన కామధేను, కల్పవృక్షాది సమస్త మంగళ వస్తు సముదాయాన్నీ కవితామృత రూపంలో పాఠకలోకానికి పంచి ఇచ్చిన వాగర్థ సమ్మోహన శక్తి గల
నారాయణీయంగా చెప్పవచ్చు.
అనగా,'రామనాథీయం', అని కూడా అనవచ్చేమో!
ఈ యానంలో పూర్వకవుల స్మ్రతులూ పలకరిస్తాయి,హెచ్చరిస్తాయి,వెన్నుతడతాయి కూడా.
అన్ని రకాలూ సాక్షాత్కరిస్తాయి కవి కుమారుడికి, స్ఫూర్తినిస్తూ.
ఆ స్ఫూర్తితో ఆ వెన్నెల వీథులలో విహరించి మునుపటి అర్గళాలు విడివడి, భావధార గల" కవన శుద్ధజన్మ", పొందుతాడు.
అతని అప్పటి పరిస్థితిలో..
"కొలువలేని కవితలు...వరుస కట్టెనపుడు..."
తన "పదకంపనమే తాండవమనీ,...తన సత్త్వము నిస్సమానమనీ", అనిపించిన అమృతఘడియలవి, ఆ కవి జీవనంలో.
అది ఒక "పునర్భవము", అతనికి కవిగా!
"విద్యాయామమ్మిది సర్వతోముదము కాంతా...", అని కావ్య కన్యతో ఆ యువకవి అనగల్గిన ధైర్యాన్నిచ్చిన మంగళజ్యోత్స్నల పావనవేళ!
ఆ నవాంకురిత స్ఫూర్తితో ఒక ప్రభామయ పథం కనిపిస్తుంది. కవితాస్యందనం నిరాఘాటంగా ముందుకు సాగుతుంది.
పద్యధార కొనసాగుతుంది,సరసమైన కవిత్వోదయం అవుతుంది.
నూత్న కావ్యావతరణం జరుగుతుంది.
***
మార్దవ ప్రధానమైనది వీరి శైలి.
అందాలొలికే తెలుగు పదాలతో,వెలుగులీనే అమరభాషా
శబ్దాలు చెట్టాపట్టాలేసుకుని ప్రసన్న రమణీయంగా సాగిపోయిన రచన.
మనస్సుకు అధిపతియైన చంద్రుడిదీ,,ఆ చంద్రకాంతి యైన వెన్నెలలదీ పరామర్శ, చంద్రశాలలో కూచున్నంత హాయి
కూర్చే పద్ధతిలో నడిపించారు.
అందమైన కొన్ని అభివ్యక్తులు:
"వెన్నెలల పొట్లముల్ పవిలి వెండితనమ్ముల సూన్రృతాంశువుల్ చిలికిన యిట్లు...."
"అతని లోనడతలో నవత లమరె..."
"పద్యమల్లువేళల, మూలప్రకృతి పాఠములను చల్లు
వేళల పరిపూర్ణుడతడు...."
"కావ్యము నెద జేర్చికొను జాగ్రతలు మీర
పాల పాప నెత్తినటుల పల్లవించి"
"వెన్ను నరచేత నానించి చెన్ను పుటల
ద్రిప్పు నొయ్యారముగ విడదీయు సొగసు. "
"పద్యమ్మొక శ్రీయోగమని తలచు
సుమశీలపు టెదలో..."
ఇంకా ఎన్నో ఎన్నెన్నో....
నిజానికి ఇందులోని ప్రతి పద్యమూ హృద్యమైనదే,
భావంలోనో,శబ్దసంయోజనం లోనో, ఆవిష్కరణలోనో ఒక ప్రత్యేకత కల్గియున్నదే. ఉదహరించ తగ్గదే.
ఒక్క మాటలో,ఇది ఒక వెన్నెలవాకయైన కావ్యం.
కవితావనిత మరాళమందయానంతో సాగిన ఘట్టాలు కొన్ని.
కవితావేశం పొంగులువారిన ఘట్టాలు కొన్ని.
కౌముదీపర్వంలో కానవచ్చే గంగా ప్రవాహవేగంతో, ఆవేగంతో కూడిన రమ్యతర ఘట్టాలు కొన్ని.
అన్నీ పూర్తిగా ఆనందించటానికి ఈ చిరు కావ్యాన్ని ఆసాంతం వెంటనే చదవటమే తక్షణ కర్తవ్యం అని ఘంటాపథంగా చెప్పవచ్చు.
****
ఇంత ప్రాణప్రదంగా ఆ కవి తలచిన కావ్యాన్ని, "సదస్యులహృదాశ్లేషమ్ము కాంక్షించుచున్", సభలో వినిపించగా,అతనికి దక్కిన స్పందన మాత్రం నిరాశాజనకమే; ఫలితం విరక్తే!
సభాధ్యక్షుడు ,"ఏదీ వినిపించండి మీ రచన", అనగానే,అతని హృదయం పొంగులెత్తింది,
ఆ మధుర క్షణం చేతి కందినందుకు.
అరవిరిసిన పూవు విప్పారినట్లు,విప్పారిన కమలం సలిల కణాలను విదలించినట్లు- భావం, రసం ఉట్టిపడేట్టు శ్రావ్యంగా చదివి వినిపిస్తాడు.
స్పందనలను తెలియచేయమన్నాడు సభాధ్యక్షుడు, ఆసీనులైన విద్వద్వరేణ్య కవి పండిత సభ్యులను.
ఒక సాహిత్యవేత్త చప్పరించేస్తూ,"కాలం మారిపోయిం
దండీ,నియమాలు పోయాయి,రాచరికాలు పోయాయి, విప్లవాలు వచ్చాయి!
ఇంకా ఇట్లాంటి పాతవి కాదు కావలసినవి,కొత్త పుంతలు తొక్కాలి కవితా ధోరణులు" అన్నాడు.
ధృతిమంతుడైన ఆ కవి,ఆ మాటలు విని హతాశుడైనా, నిర్లిప్తంగా నవ్వి ఊరుకున్నాడు.
భాషాశాస్త్ర వేత్త ఒకాయన ,"అదేంటండీ మీ తెలుగు కావ్యంలో తెలుగే మృగ్యం!
ఉన్నదంతా సంస్కృతపు చట్టుబండలే" అన్నాడు తీసిపారేస్తూ!
ధృతిమంతుడైన ఆ కవి,ఆ మాటలూ విని హతాశుడైనా,నిర్లిప్తంగా నవ్వి ఊరుకున్నాడు.
సభికుల్లో ఉన్న ఒక సాంకేతిక నిపుణుడు," ఇంతింత ప్రయాస అవసరం లేదండీ ఈ ఆధునిక సాంకేతిక యుగంలో.
మీట నొక్కితే ఏ తరహా కవిత్వమైనా మీ కళ్ళ ముందుంచుతుంది మా విజ్ఞానం.
ఇక ఈ కళలూ,కళాకారులూ చాప చుట్టేయాల్సిందే", అన్నాడు,ఈ విషయంలో తనదే ఆఖరి మాట అన్నంత ధీమాతో!
హతాశుడైన కవి,నిర్లిప్తంగా నవ్వి ఊరుకున్నాడు.
పద్యరచనాశిల్పిగా పేరున్న ఇంకొక సభ్యవర్యుడు,
" మీ కవిత్వంలో "మధురిమ" లోపించిందండీ,ఏ మాటకామాట చెప్పాలి కదూ" అన్నాడు
కషాయకంఠంతో,నిష్కర్ష చేస్తూ!
హతాశుడైన కవి,నిర్లిప్తంగా నవ్వి ఊరుకున్నాడు.
పాఠకుడొకడు లేచి," పెద్ద ఆదర్శం ఏవీఁ కనబడలేదండి నాకు ఇందులో!?
కావ్యం అంటే సమాజాన్ని తట్టి లేపే సత్యదర్శనం ఉండొద్దూ", అన్నాడు బహుసత్కావ్యపఠనంతో కూడా పోగొట్టుకోలేక తనను కుదుపుతున్న ఏదో అసహిష్ణుతతో!
ధృతిమంతుడైన ఆ కవి,ఆ మాటలకూ హతాశుడైనా, నిర్లిప్తంగా నవ్వి ఊరుకున్నాడు.
సభ ముగిసింది.
కవి మనసు విరిగింది.
ఆకాశంలో విహరించిన అతని మానసమరాళం రెక్కలు
విరిగిన పక్షి లాగా మూలిగింది.
అయినా అతని ఆత్మ ప్రత్యయం, జీవశక్తి అపారం.
అతనిది ఆశావాదం.
సత్కవిత్వాన్నీ,సత్కవినీ ఆదరించే సభలు ఇలాతలంలో లేకుండా ఉండవని.
సమాన ధర్ముడైన సామాజికుడు ఒక్కడు పఠించి తన భావంతో సంవదించినా,తన రచనకు ధన్యత
చేకూరినట్లే అని అతని నమ్మిక!
భూమి మహా విశాలం!
కాలం అనంతం,సందీర్ఘం!
****
శ్రీ పరిమి రామనాథ్ గారు-
వారి తాతగారికి తాతగారి కవిలెలో వారి స్వదస్తూరితో దొరికినదీ,సుభాషితరత్నభాండాగారం లో పాఠాంతరంగా లభ్యమౌతున్నదీ అయిన, ఒక అజ్ఞాతకవి శ్లోకం ఆధారంగా వ్రాశాను ఈ చిరు కావ్యం, "హృదయావి",అని చెప్పారు
ఆ శ్లోకం ఇది:
దిగంతే ఖేలంతీ సరసహృదయానంద జననీ
మయానీతా భోజక్షితిపనగరీ మంబ కవితే(తా)
అకస్మాదున్మీలత్ ఖలవదన వల్మీక రసనా-
భుజంగీ దష్టాంగీ శివశివ! సమాప్తిం గతవతీ.
సుభాషితరత్నభాండాగారం లోని పాఠాంతరం:
దిగంతే ఖేలంతీ సరసహృదయానందజననీ
మయానీతా దుష్టప్రచురనగరీం కాపి కవితా
అకస్మాదున్మీలత్ ఖలవదన వల్మీక రసనా-
భుజంగీ దష్టాంగీ శివశివ సమాప్తిం గతవతీ!
దీని గురించి రామనాథ్ గారి మాటల్లోనే:
"ఈ శ్లోకం భోజమహారాజు కాలం నాటిదై ఉండాలి. ఒక కవి సరసమై, సహృదయుల మెప్పు పొందిన తన కవితను మరికొంతమందికి తెలియాలనో లేదా పండితులకు విద్వాంసులకు వినిపించి వారి అనుమోదాన్ని పొందాలనే ఉద్దేశంతోనో ధారానగారానికి తీసుకుని వెళ్లాడు. అక్కడి వారిలో కొందరు చదువుకున్న ఖలుల చేతులలో ఈ కవిత పడింది. తప్పులను అనేకం కావాలని ఎత్తి చూపించి తమ ముఖాలనే పుట్టలలో ఉన్న రసనాభుజంగాలతో దానిని కాట్లు వేశారట. దానితో ఆ కవిత సమాప్తమైపోయింది అని ఈ కవి తన తల్లితో (సరస్వతీదేవి లేదా అమ్మవారితో అని అన్వయించవచ్చు) మొరపెట్టుకున్నాడు".
****
పైన ఉదహరించిన ఆ ప్రాచీనకవి శ్లోకంలో ఉటంకింపబడ్డ వైనమే పునరావృత్తమై ఈ కవికీ అనుభవంలోకి వచ్చింది.
శోచనీయమే,కానీ మానవ స్వభావం మూలతః మారేది కాదుగా!
అవే ఈసునసూయలు,రాగద్వేషాలూ,వ్యక్తిగత పక్షపాతాలూ,వైమనస్యాలూ!
కళా విషయాల్లో బానిసత్వాలూ,దోషైకబుధ్ధితో ఉండటాలూ,తగనివారికి అందలాలు,అర్హులైన వారిని అథఃకరించడాలూ ముమ్మాటికీ తగని పనులు.
నూటికి నూరు శాతం గర్హ్యాలు!
అది ఆ కళాంశ ఉన్న ఆ యా వ్యక్తులకు చేసే ద్రోహం కాదు,సాక్షాత్తూ విద్యాధిదేవత ఆ సరస్వతినే,ఆ శారదాంబ నే తృణీకరించినంత పాపం,అవమానించినంత నేరం కూడా!
****
ఇవీ, నాకు తోచిన రెండు మాటలు,ఈ సుందరమైన రచన,"హృదయావి",మీద.
మరొక్కసారి 'కుమారభారతి' శ్రీ పరిమి శ్రీరామనాథ్ గారికి అభినందనలతో....
సెలవు.
***
సముద్రాల హరికృష్ణ
***
No comments:
Post a Comment