సాహిత్యతత్వాన్ని ఆసాంతంగా ఆకళింపు చేసుకుని, శారదాదేవి కటాక్షానికి నోచుకున్న కాటూరి, దేవులపల్లి, విశ్వనాథ వంటి మహనీయకవులందరూ పధ్నాలుగు పదిహేను సంవత్సరాలకే సారస్వతాంశ పూర్ణంగా పెనవేసుకుని ఉన్న బాలకవిగా గుర్తుపట్టారు మల్లంపల్లి శరభయ్యగారిని. మల్లంపల్లి వారి వంశమంతా వీరశైవమత పరిమళాలు ఆంధ్రదేశమంతటా ప్రాకింపజేసి, జ్ఞానరోచిస్సులను నలుదిశలా చిందింపజేసిన ఉన్నతవ్యక్తిత్వాలకు ఆకరమైనటువంటిది. వీరశైవాంధ్రవాఙ్మయానికి వారు చేసిన సేవ అద్వితీయం. ఈ వంశంలోని పూర్వీకులు శివదీక్షాగురువులు.
శ్రీమన్మల్లముపల్లి వంశకరు వాక్ఛ్రీవల్లభప్రేరిత
ప్రామాణ్యాక్షర నైజభావదళన ప్రఖ్యాత శ్రీరామలిం
గామర్త్యప్రభు లోకపావనుని లింగాంగైక్యసౌఖ్యాన్వితున్
శ్రీమంతున్ నుతియింతు గొల్తు దలతున్ సేవింతు దీక్షాగురున్.
అని తనకు శివదీక్షనిచ్చిన మల్లంపల్లి రామలింగగురువుని చెన్నాప్రగడ నాగరాజు అనే కవి తన గుణసౌజన్యాఖ్యానశతకము లో మనోజ్ఞంగా ప్రస్తుతించాడు. బసవన్నవిజయము అనే ప్రబంధాన్ని కూర్చిన మల్లంపల్లి నాగభూషణకవి, ఏలూరులో వెలసిన జలాపహారీశ్వరస్వామి దేవేరి దుర్గాదేవిపై 108 సీసపద్యాల మహిషాసురమర్దినీశతకాన్ని వ్రాసిన మల్లంపల్లి బుచ్చయ్యశాస్త్రి గారు మొదలైన ఎందరో ఎందరో శివోపాసనాతత్పరులు, సత్కవులు పావనం చేసిన వంశమది. శరభయ్యగారి తండ్రిగారు విద్వత్కవి శ్రీ మల్లంపల్లి మల్లికార్జునశాస్త్రిగారు బందరు హైస్కూలు లో ఆంధ్రోపాధ్యాయులుగా పని చేసారు. అనేకులైన విద్యార్థులను తీర్చిదిద్దిన సౌశీల్యం వారిది. భోగేశ్వరమాహాత్మ్యము ను వ్రాసారు. దుర్వాదిగజాంకుశము, భీమఖండ ప్రబంధము ఇత్యాది కృతులు మల్లికార్జునశాస్త్రిగారివి ఉపలభ్యంగా ఉన్నాయి. ఇక ఈయన సోదరులు మల్లంపల్లి వీరేశ్వరశర్మగారు సంస్కృతాంధ్రవిద్యలలో వినుతికెక్కినవారు. భాష్యాంతవైయాకరణులు. అలంకారశాస్త్రంలో నిష్ణాతులు. బహుగ్రంథకర్త. మనువులలో మూడవవాడైన ఉత్తముడి కథను మార్కండేయ పురాణం నుండి గ్రహించి, ఉత్తమమనుసంభవము అనే కావ్యంగా రచించారు. శివపారమ్యాన్ని ప్రతిపాదిస్తూ సనత్కుమారచరిత్ర వంటి అనేక కథలతో కాంచీఖండము అనే కమనీయకృతిని వ్రాసారు. అపరశంకరులైన ముదిగొండ శంకరారాధ్యులవారి చరిత్రను మనోహరమైన పద్యకావ్యంగా కూర్చారు. మర్చిపోయిన తెలుగువారి ఉనికిని, చరిత్రలో మరుగున పడిన ఎన్నో అధ్యాయాలనూ వెలికితీసి రాసులుగా పోసిన మల్లంపల్లి సోమశేఖర శర్మ గారూ ఈ కుదురులోని వారే.
పూర్వులందరి ఉపాసన మొత్తం కలగలిసి శరభయ్యగారిలో వినూత్నవిద్యాకళగా పరిణమించింది. పూపవయస్సునుండే ఆయన మనఃపద్మం నిండా ఎన్నో కవితనాల రేకులు నునుపుదేరాయి. ఒక కొత్త సుగంధభరితవాణి వారికి చేతనైంది. పధ్నాలుగు పదిహేను సంవత్సరాల వయసులో రసవత్కవిత ఉబికి వస్తూన్న కళ్లతో ఆయన డా.గూడూరు నమశ్శివాయ గారిని కలవడానికి వెళ్లారు. చెళ్లపిళ్లవారిని కలవాలని ఉందని చెప్పగానే ఆయన అంగీకరించి వారింటికి తీసుకుని వెళ్లారు. అక్కడ సాహిత్యగోష్ఠిలో నిమగ్నమై ప్రకాశిస్తున్న ఆ వృద్ధపుంభావసరస్వతిని చూసిన వెంటనే శరభయ్యగారి తరుణమానసంలో కొత్తచిగుళ్ళు వేస్తున్న కవిత ఇలా ఆశువుగా వెలికివచ్చింది.
దిగ్దంతి సాంద్రమద గంధ విహాసి కీర్తి
శ్రీచందనేన సమలంకృత దివ్యదేహమ్
భాషావతార మఖిలావనిపాలమౌళి
సంసేవ్యమాన పదపంకజ మాశ్రయావః.
అనయంబున్ భవదీయదివ్యకవితా
వ్యాహార మాహారమై
తనరన్, తావకదర్శనమ్మున కనం
తస్వామి పై మేను దా
ల్చిన శ్రీనాథుని కోసమా ధ్రువుని వో
లెన్ దేవ యిన్నాళ్ళు నా
యొనరింపంగల భావనాతపములో
హో పండె ఈ రాకతో.
ఎవియో గాని యెఱుంగరానివి విభూ!
యీ మిమ్ము గారించు బాం
ధవముల్ తొల్లిటిజన్మలోని వనుచున్
తర్కింతు నో దేవ నే
డవితర్కమ్ముగ దర్శనం బిడితి వా
హా! పండె నా భాగ్యమ్ము కం
దొవ కత్యంత వినోదదర్శనుడవౌ
దో కాదొ? యంచెంచితిన్.
~
అని. చెళ్లపిళ్ల వెంకటశాస్త్రిగారిని విష్ణువుగా, తనను తాను ధ్రువునిగా సంభావించుకుంటూ చక్కని పదపుష్టితో శరభయ్యగారు చేసిన ఈ ఆశుకవితావిహారానికి వెంకటశాస్త్రి గారెంతో ముచ్చటపడ్డారు. ఆ పిన్నవయస్సులోనే కాటూరి వెంకటేశ్వరరావు గారిపై శరభయ్యగారు చెప్పిన పద్యం ఎంతో హృద్యమైనది
తేనెలువారు వాక అయి
తీయని షట్పదగీతికామధు
శ్రీనివహమ్ము నట్లు విల
సిల్లెడు సౌందరనంద మాధవో
ద్యానరసాల పల్లవ ర
సాతి కషాయితకంఠకోకిలా
నూనకృతజ్ఞతా మృదు మ
నోహర గీతము లాలకింపుమా!
ఎన్నో నోములు ఫలిస్తేనే కానీ, ఎన్నో ఏళ్లు సాధన చేస్తేనే కానీ వీలుకాని ఇంతటి విరళాతివిరళమైన మాధురీమయమైన పదపుష్టి అంతటి అతిచిన్న వయస్సులో శరభయ్యగారికి కలిగింది. ఆ కవితాశక్తి వారిలో నానాటికీ పరిపక్వమౌతూనే వచ్చింది. నిత్యశివోపాసన ఫలితంగా వాగర్థాలకు అధిదేవతలైన పార్వతీపరమేశ్వరుల అనుకంప వారియందు పరిపూర్ణంగా ప్రతిఫలించింది. చిన్ననాట తన మనసును చూరగొని, తనకొక మార్గదీపికగా మారి పురోగమింపచేసిన ఆ సత్కవి కాటూరివారిని తరువాత చెన్నపురి ఆంధ్రమహాసభవారు సన్మానించిన సందర్భంలో శరభయ్యగారు చదివిన పద్యాలు ఎంతో విలక్షణమైనవి. సన్మానసందర్భంలో మామూలుగా వ్రాసే స్తుతిమంతమైన పదసమూహంగా కాక, అజరామరమైన అమృతశబ్దజాలంతో సహృదయసన్మానశుభాకాంక్షలంటే ఇలానే ఉండాలనిపించేలా వ్రాసిన అతిసుందరపద్యాలివి. విస్తారమైనా వాటిని విడిచిపెట్టలేక ఎత్తివ్రాస్తున్నాను:
ఆరంబోసిన పండువెన్నెలలు నీహారాంబువుల్ మేల్మి బం
గారమ్మున్ దొనరేకు మెత్తనలు ముక్తాహారముల్ సాంద్ర క
ర్పూరక్షోదము గర్భకైతకదళమ్ముల్ కార్తికీశాలి కే
దారశ్రేణులు రూపుగొన్న కవితాతత్వంబుకున్ భద్రమే!
భద్రమే సుందరీనంద భావపరిధి
వెలుగు ప్రణయార్చి చిదిమి, దిగ్వలయతమము
లొత్తిగిల బెనుదీపిక లెత్తు మీ ఫ
లానుమితమైన సుమహితారంభమునకు!
పౌలస్త్యదుఃఖ బాడబ
మాలాకీలాగ్ని నెడద మన్నించిన యీ
తాలిమికి నాటుపోటులు
వేలాతిక్రమము లేని విత మచ్చెరువౌ.
అనవసరకావ్యశీలన
జనితోత్కళికా౽పహాతి చంచలమతినై
నిను వెదకి కాంచు నేనొక
దివాంత మందరుగుదెంచితిన్ బసినాటన్.
నీ యనుభవ మది యెట్టిదొ
మాయురె! నినుగన్న పూర్వమహితాంధ్రకవీ
శాయత తేజస్సన్నిధి
యై యెద మ్రాన్పడి వినమ్రతాధీనముగాన్.
నను గైకొన్న కృపావిశేషమునకున్ నానాకవీశాన కా
వ్యనిలీనప్రతిభామయప్రకట రూపప్రాపితోదార ద
ర్శనభాగ్యమ్మునకున్ హితత్వమునకున్ స్వాదుప్రియాలాప వ
ర్తనకున్, దైశికభావసంపదకు డెందమ్మందు గైమోడ్చెదన్.
~
ఈ పద్యాలన్నీ ఒక కృతజ్ఞతాప్రకటన. సుధాపూతమైన హృదయంతో తన మార్గదర్శకకవికి మరొక సహృదయకవి చేయదగిన సాధువాదం. ఇక వారి శ్రీవేణుగోపాలశతకము ఒక పరిపూర్ణకృష్ణతత్త్వావిష్కారం. శివకేశవుల మధ్య భేదం చూడని కొందరు అదృష్టవంతులకు వారిద్దరూ గోచరించే తీరే వేరు. అది వారి సంకల్పమాధుర్యం. శివుడిని జీర్ణం చేసుకున్న రామలింగనికి మాధవుడు కనిపించిన సొబగే సొబగు. నృసింహోపాసకుడైన చక్రపాణి రంగనాథుడిని శ్రీశైల మల్లికార్జునుడు చేదుకున్న చెన్నే చెన్ను. పరమవైష్ణవుడైన పుట్టపర్తి నారాయణాచార్యుల వారు శివతాండవాన్ని చూసిన సోకే సోకు. అలాగే ఆజీవితమూ శివోపాసనలో ఉండి, ఆ చూపుతో కన్నయ్యను చూసి రసోన్మత్తుడైన శరభయ్యగారు ఈశతకంలో గానం చేసిన ఒక్కోపద్యమూ ఒక్కో అమృతగుళిక. ఆస్వాదించండి -
నీ వంశీధ్వనివాహినుల్ వరదలై నిండార బ్రహ్మాండముల్
ద్యోవీథిన్ గ్రహతారకాగణము చిందున్ బిందులై బిందులై
జీవాంతర్హృదయమ్ములందు నినదించెన్ స్పందమై మంద్రమై
నీ వేణుధ్వని స్థూలసూక్షములు నిండెన్ వేణుగోపాలకా!
జరుగన్ గాఢ తమో విలీనములు నిశ్శబ్దంబులై పెక్కు వ
త్సరముల్ నేటికి ఫాలబాలశశిభాస్వత్సంవి దుద్యోదిత
స్ఫురణన్ నీ కరుణన్ దరంగితగతిన్ బొందెన్ వచోగంగ; నీ
చరణాబ్జంబులపై బదింబదిగ కృష్ణా! వేణుగోపాలకా!
తలతున్ నీ వనిరాకయే చరమసంధ్యావేళలన్ గోఖురా
చల చంచత్పదవీరజఃపటల సంఛన్నాల కాబ్దాంత పే
శల చంద్రోదయవద్విభాసి లలితాస్యస్యూత గోపీ దృగం
చల నీలోత్పల సించితామృతకటాక్షా! వేణుగోపాలకా!
~
చైత్రాన్ని శరభయ్య గారు ఆహ్వానించిన తీరు నిరుపమానమైనది. చైత్రమాసాన్ని ఒక అతిథిగా భావన చేసి, భావనాతిథ్యాన్ని సమకూర్చిన కవిగృహస్తును వారి “చైత్రహూతి” అనే కవితలో చూస్తాము. ఎప్పుడూ తిరిగే ఋతుచక్రంలో ఎప్పటికప్పటిదే అయిన నూతనత్వంతో పాటు భ్రమణమనే శాశ్వతత్వమూ ఉంది. ప్రతీ ఋతువూ మన ఇంటిదాకా వచ్చిన అతిథే.
అళిగీతిస్పృహణీయముల్, సుమవధూహార్దామృతమ్ముల్, సుఖా
నిలముల్, శీర్ణమహీజపల్లవనవోన్మేషమ్ములున్, కోకిలా౽
కుల సీమాంతములున్, దిశాంచల కుహూ కూలంకషా౽ప్లావిత
మ్ములు కాంతమ్ములు, జీవలోకమధురమ్ముల్ శైశిరాహ్ణాంతముల్.
ఆర్తవసౌందర్యానికి ప్రకృతిలోని ప్రతిజీవమూ పుట్టుకతోనే నేర్చుకున్నదా అన్నట్లుగా ప్రతిస్పందిస్తుంది. అళిగీతులూ, సుమవధువుల హార్దామృతాలూ, సుఖానిలాలూ, శీర్ణమహీజపల్లవ నవోన్మేషాలూ, కోకిలాకులసీమాంతాలూ, దిశాంచల కుహూకూలంకషాప్లావితాలైన వసంతాగమనవేళలన్నీ జీవలోకమధురాలే.
ఈ అనుభూతి ఉండనిది మానవునికి మాత్రమే. కనుకనే, “కలకంఠ ప్రియహూతు లెవ్వరిట నా కర్ణింతు రెవ్వారికీ యళిగీతుల్?” అని బాధపడి, తదనుభూతిలోని గాఢతను చెప్పగలిగే కవి ఒకడు ఎప్పుడూ ఉంటూనే ఉండాలి. కవి చేసే పని ఏమిటి? అన్న ప్రశ్నకు శరభయ్య గారు వెంటనే ఇచ్చిన సమాధానం - “నీ గాధలె త్రవ్వి నవత్వము సాధింపన్ గవికులంబు సమకొనుచుండున్” అని. ఏ కవైనా తవ్వి తీసి, తాను అనుభవించి నలుగురికీ పంచి ఇచ్చే స్వాదువైన ఆహరం ప్రకృతి తాలూకు ఋతువుల తాలూకు గాథలే కదా!
మరి ఈ కవి ఎటువంటివాడు? అలా ఋతూదిత మధురానుభవాన్ని చవి చూసి ఏ ఆనందాన్ని పొందాడు అంటే, నవనవోదిత పద్మబాంధవమరీచులు తూర్పు దిశలో ఎప్పటికప్పుడే కొత్తదనాలను వెలియిస్తూండగా తరుశాఖికాగ్రాలు చివుళ్ళు తొడుగుతూండగా వాసంతప్రియాతిథి వేంచేసిన శుభవేళలో ఈ కవికి లభించిన ఒకానొక అనిర్వచనీయమైన స్వస్థతను చూడండి -
సమతీతస్మృతివల్లు లల్లుకొని నా స్వాంతంబు పుష్పించు తీ
యము లేనాటి యనుంగులో! చరమసంధ్యామల్లికా ముగ్ధ జీ
వములై నీ వరుదెంచువేళ బునరావర్తమ్ములై వచ్చి దుః
ఖము సౌఖ్య మ్మనరాని నిర్వృతి నెడన్ గల్పించు చైత్రాతిథీ!
కవికి ఆ నిర్వృతి ఎల్లప్పుడూ అనుభూతిలోకి వస్తూనే ఉండాలి. ఒక వెలుగై అతడిని కాపాడుతూనే ఉండాలి. దానికోసం ఆ ఉదాత్తమైన తన్మయానికి కవి ముందు పట్టుబడిపోవాలి. అది జరిగినపుడు ప్రకృతి తన రహస్యాలనకు కవికి విప్పి చెబుతుంది. అలా ఈ కవి కాలగతమైన ఒక రహస్యాన్ని విన్నాడు -
తొలి నీరాక చిగుర్చు తత్కిసలయస్తోమంబె హేమంత వే
ళలకున్ బండి పురాణపర్ణముల లీలన్ రాలి కాంచున్ సము
జ్జ్వల రాగద్యుతులన్ కిసాలయపునర్జన్మంబు; దోబూచి యా
టలుగా జీవుల రాకపోక లవనిన్ దైనారుబో! నిత్యమై.
ఇది ఒక చిగురు జీవితచక్రం. వసంతంలో చిగిర్చిన ఆ చిగుళ్లే, హేమంతానికి పండి, పురాణపర్ణములై రాలిపోతాయట! మళ్లీ వెనువెంట కిసాలయపునర్జన్మ. ఈ దోబూచి ఆట లోని నైరంతర్యం, అందం కనపడడానికి కవిమనస్సు చూపుతిప్పుకోలేనంత లీనత్వాన్ని అనుభవిస్తున్నదై ఉండాలనిపిస్తుంది. ఆ రోచిర్మయదర్శనం ఆనందంలోకి విపరిణమిస్తుంది. అదే “ఎవ్వనిచే జనించు, జగమెవ్వనిలోపలనుండు” అన్న గవేషణకు “ఆనంద” మనే సాక్షాత్కారతాసిద్ధి. అందుకు ప్రత్యక్షదృష్టాంతం కనుల ముందర శబలితకుసుమరాగరంజితంగా వ్యాపిస్తున్న ఋతువే అవుతుంది.
ఆనంద ప్రభవంబె భూతనిచయం బానంద సంస్థానమే
ఆనందంబున యందె డిందు నను నయ్యానందవల్లీవచః
సానాథ్యమ్మున కెన్న నిన్ విడిచి దృష్టాంతంబు లేదెందు న
ద్దానన్ జైత్రమ! నీదు కిర్తు లలరున్ త్రయ్యంతగేయమ్ములై.
~
“ధ్యానదేహళి” అన్న కవితలో ఒక సాధకుడైన జీవుడు హంసగా మారడంలోని భూమికలను చూపించారాయన. ఎన్నో ద్వంద్వాల మధ్య గీతలను చెరిపి వేసే ఐదు తేటగీతుల కవిత యిది. కానీ ఒక్కో పద్యంలోనూ ఏమి పదబంధాలు! తెలిసిన పదాలను గుర్తు చేసుకుంటూనో, తెలియని వాటిని నిఘంటు సాయంతో గుర్తుపడుతూనో ఉన్నా కూడా, భావం అర్థమౌతున్నా కూడా దానిలోని బరువు, లోతు ఉన్నపళాన మొత్తంగా పట్టి లాగేసే శక్తి ఈ కవి పద్యాలలో ఉంది. కొంత మననం చేస్తే తప్ప, ఈ భావదృష్టి చిక్కటం అసాధ్యం.
నిరవధి వియద్విహారేచ్ఛ నీడభూమి
వేగియుంటి పక్షోద్గమవేళ దనుక
అలసి నేడు లోకాలోకయాత్ర మరలి
మత్కులాయాంతనిద్రాసమాధి వలతు.
ఇది మొదటి దశ - మానవుడు రెక్కవిప్పిన నాటి నుండీ అధికారం, ధనం ఇత్యాదులన్నీ పూర్తిగా అనుభవించిన తరువాత, వాటిలో సారహీనతను గ్రహించి పురుడుపోసుకున్న ఒకానొక అన్వేషణతో తనలోపలికి తానే చూసుకొని, అన్నింటి సమాధానం అంతర్వర్తిని అయిన లోచూపే అని తెలిసికొని, ఆ నిజకులాయనిద్రాసమాధినే వలచే దశ.
వితతమోహతంద్రాభరానతము లిపుడు
నా గరుద్రేఖ లొరసె ననంతగగన
జలధిభూధరకాననశ్యామరేఖ
లలసపవనాహతస్వనదంచలముల
శ్రమనిమీలితలోచనసరణి నిరులు
గవిసి క్రమశోవిలుప్తము లవియె మత్ప్ర
చారవలయాంకవిభూతాశాదశాంత
రాళ మాలోకపూర్ణవేలాపయోధి.
అనంతగగనమూ, సముద్రాలూ, భూధరాలూ కాననాలూ, దిగంతరేఖా అన్నీ తన రెక్కలను ఒరుస్తుంటే ఆ రాజ్యాధికారంలో, ఆ మత్తులో, ఆ ఉల్బణంలో మగ్గిన తరువాత ఒక శ్రమ ఏర్పడి, అది కనులు మూయించినపుడు, శాశ్వతమనుకున్న సుఖాలన్నీ క్రమశోవిలుప్తాలైపోయాక ప్రాణానికి తిరిగి తన నీడంలో వ్రాలడమే మిగిలి ఉంటుంది.
సరవి నిట్టి యాతాయాతపరిధుల బడి
శ్రమవిలులితము బ్రతిదివసపరిణామ
వేళ నీ నీడదేహళి వ్రాలు నాదు
ప్రాణ ముచ్ఛ్వసితపురాణపత్ర మటుల.
ఉచ్ఛ్వసితపురాణపత్రం - ఎంత లోతైనదీమాట! అలాంటి ప్రాణస్థితిలో ఒక యోగనిష్పందవృత్తి ని ఆశ్రయించి, పూర్ణపథంవైపుకి చూపుని మరల్చి, ద్వంద్వాలపట్ల మోహాన్ని విడిచిపెట్టిన తరువాత, ఒక వీడిపోలేని ఇంటికి మనం బయలుదేరగలం.
బంధురసుషుప్తియోగనిష్పందవృత్తి
పూని నేడిదె గళితదివానిశా వి
మోహమతినౌచు నాలోకపూర్ణపథము
లంటి చదియెద ననివర్తనాయతనము.
~
శరభయ్య గారి కవితలలో చదవగానే నన్ను కొన్ని క్షణాలపాటు అప్రతిభుడిని చేసిన కవిత “పితృతిథి”. ధ్యానదేహళిలో పదాలపోహళింపుతో విస్తుపోయేలా చేసిన ఆ కవే పితృతిథిలో అలతి అలతి పదాలతో మనసును పిండివేస్తాడు. శైశవనిష్కాపట్యం నుంచి పితృవియోగబాధాకుహరాలకు తీసుకుని పోతాడు. ఈ పద్యాలను చదివిన తరువాత చాలా కాలం నా మనసు మనసులో లేదు. ఈ కవితలో విశ్వనాథ ప్రభావం ఉన్నట్లు అనిపించినా, శరభయ్యగారి వ్యక్తిత్వం సమాంతరంగా కనిపిస్తుంది. ఇవిగో, ఆ ఐదు వజ్రాల వంటి పద్యాలు -
“పితృతిథి”
—--------
లిపి సమభ్యాస దినముల యపుడు నేను
దిద్దుకొన కమ్మ నెంతొ వేధించినాను
చెప్పవమ్మ! సముద్రము చెఱువుకన్న
చిన్నదా! పెద్దదా! నాకు జెప్పుమనుచు.
చిన్ని నాకేలు మీ కనిష్ఠిక నమర్చి
నన్ను గొనిపోయి చూపిరి మిన్నులొరయు
నల మహాజలరాశి యనంతమనుచు
విరియు పసిగన్నులందు నచ్చెరువు నిండ.
కావ్యశిక్షాదినమ్ములు గడచి నిరత
భావనావశ హృదయ విపచ్యమాన
వాసనాదుగ్ధ పరవశ భావమందు
తఱిని మఱవకుమని చెప్పి తరలినారు.
గళితసాధనపథమై ప్రగాఢమోహ
వివశమై తండ్రి! మీ పర్యవేక్షణమ్ము
తప్పి దెసమాలు మజ్జీవితమ్ము నందు
చెలగి యొకనాడు మిము దలంచినది లేదు.
నే డమావాస్య, మున్నీటి నీట గలుప
వచ్చినాడను పితృభుక్తభాజనముల
కబళిత నభఃకటాహాంధకార విలయ
జలధి మీ కోసమరసి విహ్వలుడనైతి.
~
ఇలా ఎన్నో ఎన్నో అందాలను తన కవితాప్రదర్శన ద్వారా ప్రకటీకరించిన రసోన్మత్తుడు మల్లంపల్లి శరభయ్యగారు. వ్యాఖ్యాతగా, అనువాదకునిగా, కాళిదాసాభిమానిగా, నిరంతరశివార్చనాశీలునిగా, ఉత్తమాధ్యాపకునిగా, అన్నింటి కంటే మించి రసహృదయాన్ని నిర్మించుకున్న ఉత్తమోత్తమశిల్పిగా వారు ఎప్పుడూ జరామరణభయాలకు అతీతులే. కవితామార్గం ద్వారా లౌకికభూమికలను దాటి, ఆంతరయోగభూమికలకు పయనించి ఇంద్రియాతీతమైన ఆనందాన్ని చేజిక్కించుకున్న మనీషి వారు.
-
ఇష్ట్యుద్భవా ధూమలతా ప్రతానా
నభస్తమాలే విచరంతు సర్వతః
తదుద్గమశ్యామ మనోహరద్యుతి
ర్వలాహకః పాతు వసుంధరామిమామ్
అపి యజన పరాశ్చ బ్రాహ్మణా బ్రహ్మనిష్ఠా
శ్శ్రుతిరిహ ముఖరా చ ప్రస్రవిణ్యశ్చ గావః
క్షితిరపి బహు సస్యశ్యామసీమాంతలేఖా
హుత సురభి రయం నో జాతవేదా భవంతు.
~
అని యాజ్ఞికమైన భారతీయసంస్కృతి స్వరూపం మొత్తాన్నీ ఒడిసిపట్టి, సమస్తజీవజాలానికీ నిరామయత్వం సిద్ధించాలని కోరుకున్న విశాలహృదయం కలిగిన విశ్వమానవుడాయన. పద్యానికి వన్నె తగ్గడం విలువ లేకపోవడం అనేది జరగదని గంభీరంగా నినదించిన ఆంధ్రకవితాప్రవర్తకుడు ఆయన. ఈరోజు వారి జయంతి సందర్భంగా వారికి అనేకానేక నమస్కారాలు.
*
(Image used with Permission from Sri Phaniharam Vallabhacharya)

No comments:
Post a Comment