కందుకూరి రుద్రకవి పదహారవ శతాబ్దం నాటి వాడు. కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నాడని కొంతమంది అంటారు. సుగ్రీవవిజయమనే యక్షగానం, నిరంకుశోపాఖ్యానం అనే గ్రంథాలను రచించాడు. కానీ ఈయనలోని మహాకవి బయటకి వచ్చింది యెనిమిది పద్యాల నిడివి ఉన్న ఒక కవితలో.
ఈ రచనకి జనార్దనాష్టకమని పేరు. దీనిని చాటుపద్యమణిమంజరిలో వేటూరి వారు ఉటంకించారు. ఈ కవిత యెన్ని పొరలతో అల్లబడిందంటే, భక్తిసుఖంతోనూ, తెలుగుభాషతోనూ కాస్త పరిచయమున్నవారినెవరినైనా చప్పున తనలోకి లాగుకొంటుంది. దీనిని వ్రాయించుకున్నది ప్రకాశం జిల్లా కందుకూరులో కొలువుదీరిన జనార్దనుడు.
శైవం పండుతూ జ్ఞానంలోకీ, వైష్ణవం పండుతూ ప్రేమ లోకీ మనిషిని లాగుతాయి. ప్రేమ అనే వస్తువు నిజస్వరూపం తెలుసుకోడానికి, దాని చుట్టూ అల్లుకొన్న విరహం, కామం, కోపం, ఉత్కంఠత, భీరుత లాంటి మనోభావాల రూపం ఉన్నది ఉనట్లు తెలుసుకోడానికీ, వాటిలోని దివ్యసుఖాన్ని ఆకళింపు చేసుకోడానికి భాగవతుల జీవితాలే మనకి సహాయపడేవి.
ప్రేమ, అది కలిగించే సుఖం - అనే విషయాలలో మనిషికి రకరకాల స్థాయిలలో అనుభూతులు కలుగుతున్నాయి. ప్రేమలో ఉన్నప్పుడు ఒక చోట దొరికే మధురిమ ఇంకొక చోటులో దొరకకపోవడానికీ, ఒక చోటులో దొరికినదానికంటే వేరే చోటులో ఇతోధికంగా దొరకడానికీ, సమయాన్ని బట్టి ఒక చోటుని మించి వేరే చోటులో రూపందుకోవడానికీ కారణం ప్రేమ కాదు. మనం ప్రేమలో ఉండి ఉపాసించే వస్తువు. కనుక, మల్లగుల్లాలు పడుతూ మనిషి 'ప్రేమ' ని నిర్వచించవలసిన అవసరం లేదు. అది సహజంగానే తీపి సముద్రం. నిర్వచించవలసింది మనం ప్రేమిస్తున్న వస్తువుని. వస్తువు జంతువైతే మన అనుభూతిలోకి జంతుప్రేమ వస్తుంది. మనిషైతే మానవప్రేమ అవగతమౌతుంది. అదే వస్తువు దివ్యమైతే, దివ్యప్రేమ మనలని ముంచివేస్తుంది. ఆ వస్తువుని బట్టే, ప్రేమకి సహాయరూపాలైన కామం, విరహం లాంటి వాటి స్వరూపస్వభావాలూ తదనుగుణంగా మారిపోతాయి.
ఈ దివ్యప్రేమని దైనందిన జీవితాలలోకి దింపి, తమ జీవలక్షణంలో సుగంధవాసనగా మలచికొని, ఆ సుఖంలో విశ్వాన్ని మరిచిపోయిన వాళ్లు విష్ణుభక్తులు. ప్రేమ రహస్యాలకి వాళ్ల జీవితాలే నివాసస్థానాలు. వారి ప్రేమ దివ్యమైనది. వారి శృంగారం దివ్యమైనది. వారి విరహం దివ్యమైనది. వారు హృదయంతో అర్పించే అరటిపండు తోలూ, తులసి ఆకూ, అటుకులూ, మూడడుగులూ, పూలదండా, చెప్పే మాటా, పాడే పాటా, చేసే యుద్ధమూ అన్నీ దివ్యమైనవే.
అటువంటి దివ్యశృంగారాన్ని వర్ణిస్తూ చేసిన కృతి ఈ జనార్దనాష్టకం. ఇందులో ఒక్కొక పద్యం అష్టవిధనాయికలలో ఒక్కొక నాయికకు ప్రతీక. ఈ కవిత ఛందస్సు సొగసైన లయతో ఉంటుంది. మత్తకోకిలకి దగ్గరైన రూపం. యతి ప్రాసలతోటి రుద్రకవి దీనిని ఉత్కృష్టమైన రచనగా మలిచాడు. నాయకుడు విష్ణువు కావడం మూలాన నాయిక అనుభవించే దివ్యప్రేమలో, సాధారణంగా ఒక ప్రియుడు వచ్చినా, రాకున్నా ఒక స్త్రీ పొందే అనుకూల ప్రతికూల వికారాలకు తావుండదు. అర్పణ మాత్రమే కనిపిస్తుంది.
~
స్వాధీన పతిక -
సిరులు మించిన పసిమిబంగరు జిలుగుదుప్పటి జారఁగా
చరణపద్మముమీఁద, దేహము చంద్రకాంతుల దేరఁగా
మురువుచూపఁగ వచ్చినావో మోహనాకృతి మీరఁగా
గరుడవాహన! దనుజమర్దన! కందుకూరి జనార్దనా!
(పాదాల పైన సిరులు మీరే బంగారు జిలుగుల దుప్పటీ జారుతుండగా, శరీరం చంద్రకాంతిలో కనిపిస్తుండగా, నీ మోహనాకృతి మీరగా సుందరతని చూపడానికి వచ్చావా స్వామీ! )
ఈమె భర్తని వశంలో ఉంచుకున్న వనిత. సాధారణంగా ప్రియుడితో గాజులు సవరించుకోవడం, తిలకం దిద్దించుకోవడం వంటి పనులు చేయించుకున్నట్లుగా చిత్రిస్తారు ఈమెను. కానీ భక్తురాలికి దగ్గరకి స్వామి రావడమే స్వాధీనపడటం. అదే మహదానందం. దాని సూచకంగా అంతా ఆయన వర్ణనే ఉంది కానీ ఈమె ఆధిక్యత లేదు ఈ పద్యంలో.
~
విప్రలబ్ధ -
ఆనపెట్టిన రాకపోతివి ఆయెబో అటుమొన్ననూ
పూనిపిలువఁగ వినకపోతివి పొంచిపోవుచు మొన్ననూ
నేనుచూడగ గడచిపోతివి నీటుచేసుక నిన్ననూ
కానిలేరా దనుజమర్దన! కందుకూరిజనార్దనా!
(స్వామీ! అటుమొన్న వస్తానని ఒట్టేయించుకుని రాలేదు నువ్వు. మొన్న యెంతో తాపత్రయంతో పిలిచినా వినకుండా పక్కనుంచి తప్పించుకుని పోయావు. నిన్న నా యెదురుగుండానే నడుస్తూ నా దగ్గరకి రాకుండా వెళ్లావు. సరే కానీలే. )
విప్రలబ్ధ మోసగించబడిన నాయిక. అనుకున్న చోటుకి ప్రియుడు రాకపోయేసరికి కోపంతో తన అభరణాలనూ, గది అలంకరణలనూ విసిరివేస్తూ కోపగించుకునే స్త్రీ. ఇక్కడి నాయికకు అహంకారజనితమైన కోపం స్వామి మీద ఇసుమంతైనా లేదు. ఆమె నిస్సహాయతను, 'వచ్చినా రాకున్నా నీ యిష్ట ' మనేటంత మహోన్నతమైన ప్రేమనూ తీయగా కవి 'కాని లేరా!' అన్న పదంలో పెట్టాడు.
~
విరహోత్కంఠిత -
నిన్నరాతిరి చవికలోపల నీవు చెలి కూడుంటిరా
ఉన్నమార్గములన్నియును నే నొకతెచేతను వింటిరా
విన్నమాత్రము గాదురా నిను వీథిలో కనుఁగొంటిరా
కన్నులారా దనుజమర్దన! కందుకూరిజనార్దనా!
(స్వామీ! నిన్న రాత్రి నీవు చావిడిలో ఒక అమ్మాయితో కలిసి ఉన్న విధాలన్నీ నేను ఒకతె చెబితే విన్నాను. వినడమే కాదు, నా కళ్లారా నిను వీధిలో వెడుతుంటే చూసాను. )
ఈ నాయిక ప్రియుడి కోసం ఎదురుచూస్తూ, కారణాంతరాలవల్ల ప్రియుడు తన దగ్గరకి రానప్పుడు విరహంతో బాధపడే స్త్రీ. ఆ స్థితిని ఒక భక్తురాలు భగవంతుడిపైన చూపించడానికి కవి యెంచుకున్న విధానం ఎంతో గొప్పది. ఆమె నిజానికి 'నన్ను విరహంలో ఉంచావు ' అని స్వామిని దెప్పి పొడవడం లేదు. 'నేను తప్ప నీకు వేరే పెద్ద పని ఏమిటి ' అని అహంకారాన్ని ప్రదర్శించడంలేదు. కేవలం 'నిన్ను వేరే అమ్మాయితో ఉండటం వేరే యెవరో చెబితే విన్నాను. విన్నానని నేను విన్నది అబద్ధమంటావేమో, నేను కూడా నిన్ను చూసాను ' అని మాత్రమే అనిపించి, 'స్వామీ, నీవు సర్వసమర్ధుడివి. నీవు వస్తే నాకు యెడతెగని ఆనందం, వచ్చేటంతవరకూ యెదురుచూడటమే నేను చేసేది ' అన్న శరణాగతిని చూపించాడు.
~
అభిసారిక -
దబ్బులన్నియు తెలుసుకొంటిని తప్పుబాసలు సేయకూ
మబ్బుదేరెడికన్నుగవతో మాటిమాటికి డాయకూ
ఉబ్బుచేసుక తత్తరంబున నొడలిపై చెయి వేయకూ
గబ్బితనమున దనుజమర్దన! కందుకూరిజనార్దనా!
(స్వామీ! మాతలన్నీ తెలుసుకున్నాను, నా దగ్గర అబద్ధపు బాసలు చెయ్యకు. మాటిమాటికీ మబ్బుతేరే కళ్లతో నన్ను సమీపించకు. తత్తరపాటుగా నా మీద చేయి వేయకు!)
ఈమె ప్రియుడి చోటుకి తానే వెళ్ళే నాయిక. ఈమె ఎన్నో అడ్డంకులను అధిగమించి ప్రియుడిని చేరుకుంటుంది. అయితే భక్తురాలయిన ఈ పద్యంలోని నాయికకు అడ్డంకులు దాటేనన్న అహంకారం లేదు. స్వామిని చేరుకున్నాక పదునాలుగు లోకాలని యెల్లవేళ్లలా యేలే ఆయన తన దగ్గరకి వస్తే తను ఆగగలదా? తట్టుకోగలదా? స్వామి రాలేదన్న బాధ వేరు. వచ్చాక తన సంగతి? ఆ భయమే ఈ భక్తురాలి హృదయం. సాధారణంగా ఈమెను యెన్నో కష్టాలకోర్చి ప్రియుడి దగ్గరకి వెళ్లినట్లు చూపుతారు. ఇక్కడ వాటి ఊసే లేదు. ఆమె శరణాగతి, ప్రేమ తప్ప.
~
ఖండిత -
బిత్తరమ్మున మొలకకెంపులు పెదవినెవ్వతె ఉంచెరా
గుత్తమైనమిటారి గుబ్బల గుమ్మ యెవ్వతె మెచ్చెరా
చిత్తగించక జీరువారను చెక్కిలెవ్వతె నొక్కెరా
కత్తిగోరుల దనుజమర్దన! కందుకూరి జనార్దనా!
(జనార్దనా! నీ పెదవి మీద యెర్రదనాన్ని అద్దినదెవరు? వక్షఃస్థలంపైన కుంకుమని అలదిందెవరు? కత్తిగోరులతో గీరుకునే విధంగా చెక్కిలిని నొక్కినదెవరు? )
ఈమె ప్రియుడు వేరే స్త్రీతో కలిసాడని కోపగించుకునే నాయిక. అంచేత ప్రియుడితో గొడవకి దిగుతుంది. అందుకు విరుద్ధంగా ఈ కవితలో బేలతనపు ప్రశ్నలైతే ఉన్నాయి కానీ, స్వామి సర్వసమర్థతని ప్రశ్నించడం లేదు. 'నన్ను విడిచి వేరు చోటికి వెళ్లావే' అన్న బాధ తప్ప ఒక్క అహంకారపూరితమైన వాక్కు లేదు. కేవలం తన గమనింపులనే చెప్పింది కానీ,వేరు మాట మాట్లాడలేదు. తన మనసుని అర్పించుకున్న భగవంతుడితో అహంకారంగా తగువు పడటం ఈమెకి రాదు.
~
కలహాంతరిత -
అండబాయక కూడియుంటివి ఆయె బోయెను నాటికీ
ఖండి మండిపడంగ నేటికి కదలు మెప్పటిచోటికీ
ఉండరా నీమాటలకు నే నోర్వఁజాలను మాటికీ
గండిదొంగవు దనుజమర్దన! కందుకూరి జనార్దనా!
(నన్ను విడవకుండా నీవు నాతో ఉన్న రోజు వచ్చి వెళ్లిపోయింది. ఇప్పుడు మండిపడితే నాకు కలిగే ప్రయోజనమేమిటి? ఎప్పుడూ ఉండే ఆ చోటుకి కదులు. స్వామీ, ఉండరాదా? నీ మాటలకి నేను తాళలేను. నువ్వు ఇంటిదొంగవి!)
ఈమె కోపంతో ప్రియుడిని వదిలి, తరవాత ఖిన్నపడే నాయిక. ఈ పద్యంలో స్వామి తనను చేరి వీడితే, ఆమె - నన్ను 'అండబాయక కూడియుంటివి ' కానీ, ఆరోజు 'ఆయెబోయెను' అని దుఃఖపడింది. మళ్లీ తేరుకొని, 'నిన్ను వదులుకున్నానని ఇప్పుడు నామీద నేనే మండిపడితే నిన్ను మళ్లీ చేరగలనా? అందుకని స్వామీ, నీవు 'యెప్పటి చోటుకి కదులు' అంటున్నది. యెంత అందమైన భావన ఇది! మూడవ పాదంలో, తనను విడిచి వెళ్లిన వాడిని 'ఉండరా' అని నిస్సహాయతతో అనడంలో ఆమె మనసులో పొంగుతున్న కొన్ని వేల భావాలను మన ముందు పెట్టాడు కవి.
~
ప్రోషిత భర్తృక -
అలుకలన్నియు దీరగా నా అండకెప్పుడువస్తివీ
పిలిచి నవరత్నాలసొమ్ములు ప్రేమతో నెపుడిస్తివీ
వలచి వలపించియును గూరిమి వదలకెప్పుడు మెస్తివీ
కలసి వేడుక దనుజమర్దన! కందుకూరి జనార్దనా!
(స్వామీ! నా కోపాన్ని తీరుస్తూ నువ్వు నా దగ్గరకి ఎపుడైనా వచ్చావా? నన్ను దగ్గరకి పిలిచి ప్రేమతో సొమ్ములేవైనా ఇచ్చావా? నన్ను ప్రేమించి, నిన్ను కలిసి వేడుకగా ప్రేమించేలా చేసుకుని వదలకుండా ఎపుడైన మెచ్చావా?)
ఈ నాయిక ప్రియుడు దేశాంతరం వెళ్లాడని బాధపడేది. తన దగ్గరగా లేని భగవంతుడి దగ్గర మనసుని అర్పించిన ఈ నాయిక చేత తనను తన స్వామి చేరాలనీ, యెలుకోవాలనీ తన మనసులో ఉన్న భావాలని గోముగా ప్రశ్నల రూపంలోనే అడిగించాడు కవి.
~
వాసకసజ్జిక -
జంట నేత్రము లంటి చూచితె జాజిపూవులు పూసెరా
మింటిత్రోవను జూచుచుండగ మేఘవర్ణము గప్పెరా
కంటిలో నొక పండు వెన్నెల కాయుచున్నది యేమిరా
కంటిలేరా! దనుజమర్దన! కందుకూరి జనార్దనా!
(రెండు కళ్లనీ దగ్గరగా చేసి చూస్తే జాజిపూవులు పూసేయి. ఆకాశంలో మేఘాలు సుతారంగా అలముకొన్నాయి. అక్కడ కాక, నా కళ్లలో ఒక పండువెన్నల యెందుకు కాస్తున్నదో చెప్పరా! స్వామీ! నిన్ను చూసానులే!)
ఈమె దూరదేశం నుండి వచ్చే ప్రియుడి కోసం అలంకరించుకుని నిరీక్షించే స్త్రీ. సాధారణంగా ఈమెను పూలూ, ఆభరణాలూ పెట్టుకున్నట్లుగానూ, ఇంటిని అలంకరించినట్లుగానూ చూపిస్తారు. కానీ భవగంతుడికోసం వేచి చూసే ఈ నాయిక మనసుని కవి తీయగా మారిపోయిన ప్రకృతి ద్వారా తెలియపరుస్తున్నాడు. ఈమె శరీరం మీద పట్టువస్త్రాలూ, సుగంధలేపనాలూ, కింకిణులూ, కంకణాలూ లేవు. ఈమె గదికి తోరణాలూ, పూలదండలూ వ్రేలాడబడిలేవు. బాహ్యాలంకరణలమీద ఈమెకి ధ్యాస లేదు. ఈమె స్థితి వేరు. తన పెరడులో ఒక జాజిపూవు పూసింది. ఆకాశంలో మొయిలు హొయలు పోతూంది. ప్రకృతే, తీయనై ఆమె అలంకారాన్ని సూచిస్తోంది. వాటితో పాటు, ఆమె కళ్లలోనే ఒక పండువెన్నెల! అది స్వామి వస్తున్నాడని తనకి తెలియడం వల్ల పుట్టిన ఆనందమని తెలిసి కూడా, అది యెందుకన్న ప్రశ్నని ఆమె చేత భగవంతుడినే అడిగించడం కవి ప్రతిభ. ఇది కదా తన తనువునూ మనసునూ భగవదర్పణ చేసిన ఒక భక్తురాలి మనసు! ఆ మనసు తెలిసిన ఒక మహాకవి మనసు!
*
అష్ట విధ నాయిక లను అద్భుతం గా పరిచయం చేసిన
ReplyDeleteరుద్రకవి కీ, మీకు ధన్యవాదాలు.
స్పష్టమైన కవితోపాఖ్యానం.
ReplyDelete