Sunday, 20 October 2024

ఆదికవి

 


1


వర్ణయుగళావలంబన పర్ణరేఖ
ల బ్రవహించు జీవరసము రంగరించి
మతికి పట్టించుకొన్న సమర్థమూర్తి!
నీదు నిట్టూర్పు నా గుండె నిండనిమ్ము.

2


గోళ్ల సందుల మన్ను తాకుట సుమించు
గంటపున్ గదలికల వికాసమమరి
వాసిగొన్న త్వదీయపద్మాసనమ్ము
బీజయంత్రమై నాలోన పేరనిమ్ము.

3


కుముదిని వెలవెలనబోవు కోమలాక్ష
రముల మాలగట్టిన వాగ్విరాగమహతి
నీది- భావసమాధిరాజ్యాదిలతను
చిత్తమునకు స్ఫురింపగజేయనిమ్ము.

4


ఋతువు ఋతువుకు క్రొంగొత్త రీతి పూచి
వెలుగులను జిమ్ము నీ శ్లోకవిద్య - భవ్య
విధమునన్ నా యెరుకకు చూపింపనిమ్ము
సత్సనాతనకారణసత్త్వతలము.

5


శబ్దమునకు భావమునకు సత్యమునకు
చెమ్మగిల్లు నీ కందోయి- స్థిమితకవన
సంపదార్ద్రభూమికల తాకింపనిమ్ము
కరడుగట్టిన నా మనఃపరిధితతికి.
*

No comments:

Post a Comment