Thursday, 24 October 2024

శ్రీవిద్యాపంచకం



1

శ్రీవిద్యా పరివారవిద్యల
సదాశీర్బద్ధ సద్విద్యలన్
భావప్రాయముగా దలంచికొను
భవ్యంబైన విద్యాప్తికిన్
లేవమ్మా గుణశీల యోగ్యతలు;
"ఔలే! యమ్మవే"నంచు నీ
చేవన్ దగ్గర జేసికొంటి -- నను
దాక్షిణ్యాన రక్షింపవే!

2

నేనొక పిల్లవాడినయి
నీ చరణాంబుజసీమ జేరి, "య
మ్మా, నను జూడవో!"యనుచు
మాటికి మాటికి పెంకిపట్టునన్
నీ నవశాటికాంచలము
నెంజిలి నేడ్చుచు లాగునంత నా
ప్రాణము లమ్మకూచివను
భావన బల్కగదమ్మ శాంభవీ!

3

ఏ కష్టమ్మొ హఠాత్తుగా బడి, "శివే,
ఈక్షింపుమా!" యంచు లో
గేకల్ నీకయి పుట్టినప్పుడు
సుఖక్రీడానుకూల్యక్రమ
ప్రాకారమ్ములలో దలంపమి యెదన్
రానీక రక్షింపుమ
మ్మా! కాదా శిశువృత్తి దెబ్బతిని
'యమ్మా!' యంచు గాలించుటల్?!

4

జగదంబా! తెగతెంపు జేసికొని
సంసారమ్ము వర్జించి, గో
ముగ నీ వీక్షకు నోచికొన్న
తపసుల్ పుణ్యాత్ములున్ నిన్ను పి
ల్వగ లక్షించుట ప్రాతబారి
విసువుల్ రాకుండ నావంటి పా
పగ నిష్కించనుపై రవంత
దయజూపన్ నీకు భావ్యంబగున్.

5

కందువ లేని నన్ను శివకామిని!
మన్నన జేరదీసి సం
స్పంద హృదంతనాదము
రువారముగా గమనించెదేని యా
నందవిహీన జన్మమరణాంచిత
నాటక దర్శనధ్వనుల్
"చందము కూడుకొన్నదిక
చాలు!" ననంగదవమ్మ నవ్వుతో.

***


No comments:

Post a Comment