Thursday, 7 March 2019

కవయిత్రీసమయాలు-1 : వికటనితంబ



ఈయమ్మ అసలు పేరు మనకి తెలియదు. తెలిసిన పేరు - వికటనితంబ. ఇదేమి పేరు? ముద్దుపేరా? లేక ఈమె అందం చూసి ఆనాటి తోటి ఆడవారు ఇచ్చిన బిరుదమా? లేదా ఏ పోకిరీవాడో వెక్కిరిస్తూ (ఈ పేరులో వికట అంటే వికృతమైన అనే అర్థాన్ని కొంతమంది చూపిస్తున్నారు) అంటే, దానినే తిక్కకొద్దీ తన పేరుగా చేసుకుందా అన్నది తెలియదు. కొంతమంది ఆ కాలంలో ప్రదర్శనలో ఉన్న ఒక రూపకంలోని నాయిక పేరు ఇది అని అభిప్రాయపడుతున్నారు. (Ref. A.K. Warder, Indian Kavya Literature III, p. 255)

పేరేదైనా, ఈమె విలక్షణ వ్యక్తిత్వాన్ని నింపుకున్న కవయిత్రి. కాశ్మీరదేశంలో 7 వ శతాబ్దంలో బ్రతికిందని ఒక ఊహ. ఈమె అనేకశాస్త్రాలలో నిష్ణాతురాలు. గోవిందస్వామి అనే గురువువద్ద తర్కవ్యాకరణాలు అభ్యసించిందట. ఈ బంగారు తల్లిలో గడుసుతనపు పాళ్లకి ఏమీ కొదవలేదు. దానికి ఈమె అనుభవించిన జీవితం కూడా ఒక కారణం. కష్టాలు లేనిదెవరికి? అందుకోసం కాదు ఈమెని పరిశీలించాల్సినది. ఈమె ధీర. మహాకవయిత్రి. పరిస్థితులేవైనా సరే, తనజీవితంలో రసాస్వాదనని ఏమాత్రమూ వదిలిపెట్టకుండా ఒక సాధనలాగా చేసి, మంజులమైన సాహిత్యాన్ని మనకందించి వెళ్లిపోయింది. తన జీవితంలోని అనుభవాలనే కృతులుగా మలచింది. అందుకే ఈమె కవిత్వాన్ని రుద్రటుడు, వామనుడు, భోజుడు, రుయ్యకుడు జల్హణుడు, రాజశేఖరుడు వంటి మహాకవులూ ఆలంకారికులూ తమ భుజాలమీదకెక్కించుకుని ఊరేగారు. తమ గ్రంథాలలో ఈమె శ్లోకాలని ఉదాహరిస్తూ తమ లాక్షణికప్రతిపాదనలను పరిపుష్టం చేసుకున్నారు.

రాజశేఖరుడు ఈమెని ఈవిధంగా కీర్తించాడు -

కే వైకటనితంబేన గిరాం గుంఫేన రంజితాః
నిందంతి నిజకాన్తానాం న మౌగ్ధ్య మధురం వచః

వికటనితంబ కవిత్వాన్ని చదివి మురిసిపోయి, అంత అందంగా మీరు మాట్లాడలేరంటూ లోకులంతా తమ భార్యలని నిందలేస్తారట!

వికటనితంబ కృతులేమైనా రచించినదా అన్నది తెలియదు. ఈమె పేరుమీద మనకి లభిస్తున్నవి పదో పరకో శ్లోకాలు మాత్రమే. వీటిలో కొన్ని చాటువులైతే, అధికభాగం శృంగారపరమైనవి. రాజశేఖరుడన్నట్లు ఈమె పదగుంఫనం అద్భుతంగా ఉంటుంది. లలితంగా, నర్మగర్భంగా, ప్రసన్నంగా రచనకి ఉండవలసిన తీయనైన గుణాలనన్నింటినీ ఈమె తన పీకలదాకా నింపుకుంది.

మొదటగా, ఈ శ్లోకాన్ని చూడండి -

అనాలోచ్య ప్రేమ్ణః పరిణతిమనాదృత్య సుహృద-
స్త్వయాకాణ్డే మానః కిమితి శరలే ప్రేయసి కృతః
సమాకృష్టాహ్యేతే విరహదహనోద్భాసుర శిఖాః
స్వహస్తేనాఽంగారాః తదలమధునాఽరణ్యరుదితైః

ప్రేమలోని పరిణతి గురించి ఆలోచించకుండా, సఖులమైన మాతోనైనా కనీసం సంప్రదించకుండా, ఏ కారణంతో నీ ప్రియుడిపై ఏవగించుకున్నావు? నీ చేతులతో నీవే విరహాగ్నిశిఖలతో మండే నిప్పుకణికలను పోగేసుకున్నావు. ఇప్పటి నీ అరణ్యరోదనలు చాలును. (ఇప్పుడు బాధపడి ఏమి ప్రయోజనం?)

ఇవి ఒక వనిత ఆమె సఖితో అంటున్న మాటలు. ఆ సఖి ముందూ వెనుకా ఆలోచించకుండా తన ప్రియునితో గొడవపడి, బంధాన్ని తెంపుకున్నది. తరువాత తన పొరపాటు గ్రహించి, సఖులవద్ద విలపిస్తున్నది.

ఇలాటి వర్ణన వేరే పూర్వ కవులు చేశారేమో నాకు తెలియదు. మొత్తంగా కొత్తదనపు పూత. ముందూ వెనకా ఆలోచించకుండా ఒక విషయాన్ని గట్టిగా నమ్మి నిర్ణయం తీసుకుని తరువాత బాధపడటం అనే సుస్థిరత లేని ఒక స్త్రీ మనస్సుని చక్కగా పట్టిస్తున్న శ్లోకం.

అన్యాసు తావదుపమర్దసహాసు భృఙ్గ!
లోలం వినోదయ మనః సుమనోలతాసు
బాలామజాతరజసం కలికామకాలే
వ్యర్థం కదర్థయసి కిం నవమల్లికాయాః

ఆప్పయ్య దీక్షితులు ఈ శ్లోకాన్ని ప్రస్తుతాంకురాలంకారానికి ఉదాహరణగా కువలయానందంలో ఉటంకించారు. ఎదుట జరుగుతున్న ఒక పనిని చెప్పడం ద్వారా ఎదుట జరుగుతున్న మరో పనిని స్ఫురింపచేస్తే అది ప్రస్తుతాంకురమౌతుంది. ఇక్కడ, ప్రౌఢ అయిన తనని వదిలేసి తనకంటే వయస్సులో చిన్నదైన ఒక అమ్మాయికేసి చూస్తున్న ప్రియుడ్ని తోటలో అతనితో విహరిస్తున్న ఒక కాంత గమనించింది. ఆ పని ప్రమాదకరమనీ, వద్దనీ ఎలా చెప్పడం? కవిత్వం మనసులో సంస్కారంగా ఉంటే, ప్రకృతిలోని ప్రతీ అంశమూ మన వశమవుతుంది. సరిగ్గా ఆ సమయంలోనే అక్కడ ఒక తుమ్మెద ఒక మల్లెమొగ్గపై వాలడానికి చూస్తున్నది. ఆ తుమ్మెదని ఉద్దేశిస్తూ, నాయిక అంటున్న మాటలు - ఓ భ్రమరమా! నీ సంయోగాన్ని సహించే పూదేనె ని కలిగిన పూదీగెలలో నీ చంచలత్వాన్ని ఆనందించకుండా, ఇంకా తేనెలూరని, పుప్పొడి లేని ఈ లేత మల్లె మొగ్గనెందుకు పీడిస్తున్నావు?

ఇంతటి వర్ణన చేయడానికి ఎంతటి ప్రతిభ ఉండాలో!

ఇలాంటిదే ఇంకో శ్లోకం -

అపసర! మధుకర! దూరం
పరిమలబహులేఽపి కేతకీ కుసుమే
ఇహ న హి మధులవలేశో
భవతి పరం ధూలి ధూసరం వదనమ్

ఓ మధుకరమా! దూరంగా జరుగు. పరిమళాలు వ్యాపిస్తున్నదైనా, ఈ మొగలిపూవులో నీకు తేనె ఏ మాత్రమూ లభించదు సరికదా, దుమ్ముకొట్టుకున్న బూడిదరంగు ముఖమే నిన్ను పలుకరించేది.

మనోహరమైన పదలాలిత్యంతో తులతూగుతున్న ఆర్యాగీతి.

ఇప్పుడు ఈమె జీవితంలోకి వద్దాం. ఈమె మొదటి భర్తని కోల్పోయి రెండవ పెళ్లి చేసుకోవలసివచ్చిందని చెబుతారు. రెండవపెళ్లి జరిగిందా లేదా అన్నది ఖచ్చితంగా ఇప్పుడు చెప్పలేము కానీ, ఈమెకు భర్తగా వచ్చినవాడు ఒక చదువురాని దద్దమ్మ. ఆ కాలంలో స్త్రీలు విద్యకీ వ్యక్తిత్వానికీ చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. కాళిదాసుని 'అస్తి కశ్చిద్వాగ్విశేషః?' అని మొహంమీదనే ప్రశ్నించిన అతని భార్య గురించి తెలుసు కదా. ఈమెకు కూడా అటువంటి విచిత్రమైన గడ్డు పరిస్థితి ఎదురైంది. అప్పుడు ఈమె ఆశువుగా అల్లిన శ్లోకం చూడండి -

కాలే మాషం సస్యే మాసం
వదతి శకాసం యస్య సకాశమ్
ఉష్ట్రే లుంపతి రం వా షం వా
తస్మై దత్తా వికటనితంబా

అతగాడు 'మాస'(నెల) అని అనమంటే 'మాష'(మినుములు) అంటాడట. 'మాష'(మినుములు) అనమంటే మాస అంటాడట. 'సకాశం'(సమీపము) కి బదులు 'శకాసం' అంటాడట. 'ఉష్ట్రము'(ఒంటె) అని అనమని అన్నామే అనుకోండి, ఒకసారి 'ర' ఒత్తుని పలుకకుండా విడిచిపెట్టి "ఉష్ట" అంటాడట. ఇంకోసారి ష ని విడిచిపెట్టి "ఉట్ర" అంటాడట. అటువంటి వాడికి వికతనితంబ ఇవ్వబడిందే అని భావం.

పరిస్థితులకి లొంగిన ఈమె తండ్రి ఈమెను గురించి విలపిస్తూంటే, ఓదారుస్తూ ఈమె చెప్పిన శ్లోకం -

తాత! బాహట మా రోదీః 
ఏష వై కర్మణో గతిః
'దుషి' ధాతోరివాస్మాకం 
గుణో దోషాయ కల్పతే

(నాన్నా! రోదించవద్దు. కర్మ విధానమింతే. 'దుష్' ధాతువు లాగా, మనకి గుణం కూడా దోషానికి కారణమవుతున్నది.)

ఈ శ్లోకంలో బాధ, బాధని మించిన విసురు, విసురుని మించిన కవిత్వం, కవిత్వాన్ని మించిన పాండిత్యం; అన్నింటికీ మించిన ఆత్మబలం ఉన్నాయి. గుణం అంటే మంచి లక్షణమనీ, గుణ సంధి అనీ శ్లేష. 'దుష్' అనే ధాతువుకి గుణసంధి జరిగితే 'దోష' మన్న పదం సిద్ధిస్తుంది అన్న నియమాన్ని కమనీయంగా కవిత్వీకరించిందీ కవయిత్రి.

ఆమె కష్టంలోనించి ఆమెలాగే మనమూ బయటికి వద్దాం. ఈ శ్లోకం చూడండి. ఇది చదవని అలంకారవిద్యార్ధి ఉండడు -

క్వ ప్రస్థితాఽసి కరభోరు ఘనే నిశీథే
ప్రాణాధికో వసతి యత్ర మనః ప్రియో మే
ఏకాకినీ వద కథం న బిభేషి బాలే?
నన్వస్తి పుంఖితశరో మదనస్సహాయః

ఒక వ్యక్తి చీకటిలో ఒంటరిగా వెడుతున్న అమ్మాయిని ప్రశ్నిస్తున్నాడు. అడుగుతున్నవాడు అమాయకుడేమీ కాదు. అందుకే కరభోరు! అని సంబోధన.

'ఇంతటి రాత్రివేళలో ఒంటరిగా ఎక్కడికి వెడుతున్నావు?' (ఒంటరిదానవా నీవు?)
'నా ప్రియుడిని కలుసుకోవడానికి వెడుతున్నాను' (కాదు, నాకు ప్రియుడు ఉండనే ఉన్నాడు.)
'ఒక్కదానివే వెళుతున్నావు, భయంగా లేదా బాలా?' (నన్ను తోడుగా రమ్మంటావా?)
'ఒక్కతినే ఏమిటి? బాణం ఎక్కుపెట్టిన మన్మథుడు నాకు సహాయంగా ఉన్నాడు." (అక్కరలేదు, నాకు నేనే చాలు.)

ఈ విధమైన స్త్రీపురుషపరస్పరసంభాషణలో శృంగారచిత్రణ అనే కావ్యవస్తువుకు ప్రాచీనభారతీయులనుండీ, మొన్న మొన్ననే "కారుమొయిళ్ళ కాటుకపొగ ల్వెలిగ్రక్కు తమాలవాటి నేదారియు కానరాదు, నెలతా! యెటువోయెద వర్ధరాత్రి" అని అనకుండా ఉండలేకపోయిన కృష్ణశాస్త్రిగారి వరకూ కవిలోకం పట్టుబడిపోతూనే ఉంది.

ఇలాంటివే కాదు, మనసుని కదిలించే శృంగారవర్ణనమూ ఈమె చేయగలదు.--

కాంతే తల్పముపాగతే విగలితా నీవీ స్వయం బంధనాత్
వాసో విశ్లథమేఖలాగుణధృతం కించిన్నితంబే స్థితమ్
ఏతావత్సఖి! వేద్మి సాంప్రతమహం తస్యాఽగసంగే పునః
కోఽయం కాఽస్మి రతం ను వా కథమితి స్వల్పాఽపి మే న స్మృతిః

రాత్రి గడిచిన తరువాత తన సఖితో ఒక అమ్మాయి అంటున్నది - 'శయ్యని చేరిన తరువాత పోకముడి తనంతతానే ఊడిపోయింది. ఒడ్డాణపు తాడుతో బంధించుకున్న బట్ట జారింది. ఓ సఖీ! నాకు ఆతని కౌగిలిలో ఉన్న సంగతే తెలుస్తుంది కానీ, అతడెవరో, నేనెవరో, అసలు ఎలా కలుసుకున్నామో ఏ మాత్రమూ నాకు జ్ఞప్తికి లేదు"

మైమరపులో ఉన్న ఒక స్త్రీ హృదయావిష్కరణ ఇది. ఏ రసంలో అయినా, లీనమైపోయి ప్రపంచాన్ని మర్చిపోగలడమే అసలు ప్రయోజనం. శృంగారంలోనూ అంతే. ఇందులో గొప్ప భావం - 'కాఽస్మి' అనడం. తనెవరో కూడా తనకి తెలియదట! ఇటువంటి ఒక స్త్రీ స్థితినే పండితరాయలు వర్ణించాడు. దానికి ఈమె ఆ రచన ఖచ్చితంగా స్ఫూర్తి అయి ఉంటుంది.

విరహేణ వికలహృదయా
విలపన్తీ దయిత! దయితేతి
ఆగతమపి తం సవిధే
పరిచయహీనేవ వీక్షతే బాలా (భామినీ విలాసం)

ఒక అమ్మాయి విరహంతో బాధపడుతూన్నది. తన ప్రియుడ్ని కలవరిస్తున్నది. నిజంగానే ప్రియుడు వద్దకి వచ్చాడు. అయినా, తన భావంలో లీనమైపోయి, వచ్చినవాడిని గుర్తుపట్టక ఏదో పరిచయం లేనివాడిలాగా చూస్తున్నదట!

ఇంకొక రసోక్తిని చూద్దాం -

కిం ద్వారి దైవహతికే సహకారకేణ
సంవర్ధితేన విషవృక్షక ఏష పాపః ।
యస్మిన్మనాగపి వికాస వికారభాజి
ఘోరా భవంతి మదనజ్వరసంనిపాతాః ॥

"దైవహతురాలనైన నేను సింహద్వారం వద్ద ఈ మామిడిచెట్టును పెంచి ఏం సాధించాను? ఇదొక పాపిష్టి విషవృక్షం! ఈ చెట్టు కొద్దిగానైనా పూత పూసి వికసించే వికారాన్ని పొందిందో లేదో, భయంకరమైన మన్మథ జ్వరసన్నిపాతాలు విజృంభిస్తున్నాయి!"

ఈమె ఏమాత్రమూ వెనుకాడని సాహసానికి, ఘాటైన రసావిష్కారానికీ పెట్టింది పేరు.

దిగ్వధూవదనచుంబి చేర్ష్యయా
వీక్ష్య సద్యుతి దివా భవద్యశః
దర్శితః పృథుపయోధరోద్గమ-
స్తేన సాఽపి పరిరభ్యతేఽఖిలా

ఇది ఆమె ఒక రాజుపై చెప్పిన చాటువై ఉంటుంది.

ఓ రాజా! దిక్కాంతల ముఖాలను ముద్దాడుతున్న కాంతివంతమైన మీ కీర్తిని చూసి, ఆకాశకాంత తన విశాలమైన పయోధరాలను (మేఘాలను / పాలిండ్లను) చూపించింది. దానితో ఆ కీర్తి చేత ఆ సమస్తమైన ఆకాశము కూడా గాఢంగా ఆలింగనం చేసుకోబడుతున్నది.

అభిహితాభ్యియోగపరాఙ్ముఖీ
ప్రకటమంగవిలాససమకుర్వతీ
ఉపరి తే పురుషాయితుమక్షమా
నవవధూరివ శత్రుపతాకినీ

ఓ రాజా! నీవు పిలచినా ముఖాన్ని చాటేస్తూ, ఎటువంటి మంగళకరవిలాసాలనూ వ్యక్తపరచకుండా, నీపై ఆధిపత్యంచెలాయించనూ లేక నీ శత్రువుల సైన్యం సరికొత్తగా పెళ్ళయిన నవవధువులాగా ప్రవర్తిస్తోంది.

~
ఈమె కొన్ని ఏకాంతోక్తులను కూడా చెప్పింది.

బాలా తన్వీ మృదురియమితి త్యజతామత్ర శంకా
దృష్టా నైవ భ్రమరభరతో మంజరీభగ్నపుష్పా
తస్మాదేషా రహసి భవతా నిర్దయం పీడనీయా
మందాక్రాంతా విసృజతి రసం నేక్షుయష్టిః కదాచిత్.

ఈ శ్లోకంలో భ్రమరమంజరీన్యాయాన్ని, ఇక్షుయష్టి దృష్టాంతాన్నీ చక్కగా చూపిందీ కవయిత్రి. మందాక్రాంతా అన్న పదాన్ని అదే ఛందస్సులో కూర్చబడిన ఈ శ్లోకంలో సార్థకమైన అర్థంలో ఉపయోగించి మరింత అందాన్ని దిద్దింది.

స్త్రీ మధ్యభాగం గురించి మరొకటి -

అయ్యయి! సాహసకారిణి!
కిం తవ చంక్రమణేన
టసదితి భంగమవాప్స్యసి
కుచయుగభారభరేణ.

ఇలా స్వతంత్రభావాలతో, వినూత్నపదఫక్కికతో తన మనసుని ఏ మాత్రమూ భయం లేకుండా తన కవితలద్వారా ఆవిష్కరించి, కవిత్వాన్ని జీవితంలోకి నింపుకుని రసమయిగా జీవించిన కవయిత్రి వికటనితంబ.అసలు కవిత్వం యొక్క ప్రయోజనమే అది!

--------------------------

అకలుషశబ్దగుంఫనఫలాంచితసంచితభవ్యగీతికా
ప్రకటనశీలమే నిజపరాక్రమమై పెనుదన్నుగాగ కం
టకమయజీవితమ్మును నిటారుగుణమ్ముల నేలినట్టి యో
వికటనితంబ! భావపదవీసమలంకృతనాయికా! నమః.

-----------

No comments:

Post a Comment